అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని వికేంద్రీకరణ చేస్తుంటే, టీడీపీ నేతలు జీర్జించుకోలేకపోతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా రోడ్లపైకి రాని చంద్రబాబు కుటుంబం.. ఇప్పుడు వేల కోట్ల స్పప్నం తరలిపోతుందనే వేదనతో బయటకొస్తుందని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 రోజుల నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని, కానీ వాస్తవాలు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతాయన్నారు. చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కొని రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రాజధాని ప్రాంత రైతులకు కౌలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు చెల్లించారని గుర్తుచేశారు.

అమరావతి సమస్యను అంతర్జాతీయ సమస్యగా సృష్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. 23 గ్రామాల రాజధాని ఉద్యమం ఇప్పుడు మూడు గ్రామాల ఉద్యమంగా మారిందన్నారు. రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అమరావతి గ్రాఫిక్‌ డిజైన్ల కోసం 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబుకు రాజధాని ప్రాంత రైతుల కౌలు ఇవ్వడానికి మనసు రాలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్‌ను చంద్రబాబు గౌరవించడం లేదని ఆరోపించారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీ వికేంద్రీకరణ జరగాలని స్పష్టంగా చెప్పిందని గుర్తుంచారు.  ఎల్లో మీడియాను అట్టుపెట్టుకొని కృత్రిమ ఉద్యమం ఎన్నాళ్లు నడుపుతారు, వాస్తవాల్లోకి రండి అని టీడీపీ నేతలకు సూచించారు. రాజధాని వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఈ విషయాన్ని ఉద్యమంలో ఉన్న ప్రజలు ఆలోచన చేయాలని మంత్రి కన్నబాబు కోరారు. 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments