కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోందని…ఇప్పటికే లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. అగ్ర రాజ్యాలు సైతం కరోనా తీవ్రతను తట్టుకోలేకపోతున్నాయని తెలిపారు. భారత్‌లో కరోనా వ్యాప్తిని మోదీ కట్టడి చేయగలిగారని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజల కోసం గరీబ్ కల్యాణ యోజన పధకం అమలు పరిచారన్నారు. మోదీ రాబోయే నవంబర్ వరకు యావత్ భారత్ మొత్తానికి రేషన్ ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.
ఎనభై కోట్ల జనాభాకు అదనపు భారం భరిస్తూ ఈ పధకం ద్వారా పేద ప్రజలకు బియ్యం , గోధుమలు, శనగలు ఇవ్వాలి నిర్ణయించారన్నారు. పేద ప్రజలకు మోదీ ఎల్లపుడు అందుబాటులో ఉంటారని రావెల స్పష్టం చేశారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ముప్పై రెండు కోట్ల మంది పేద ప్రజలకు రెండు వందల కోట్లు పైగా డబ్బును వారి ఖాతాలో జమ చేశారని వెల్లడించారు. వలస కార్మికులకు దేశ వ్యాప్తంగా ఎక్కడైన రేషన్ తీసుకునే అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమమే మోదీ ధ్యేయమని స్పష్టం చేశారు. దేశంలో ఎనభై కోట్ల లబ్ధిదారలకు మోదీ అండగా ఉన్నారని చెప్పారు.
గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా మరో అయిదు నెలలు పాటు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా ఏపీకి నలబై వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్న చందగా రాష్ట్ర పరిస్థితి మారిందని విమర్శించారు. మూడు శాతం సెస్ రూపేణా నేషనల్ హైవే అభివృద్ధి చెయ్యడానికి కేంద్రం వసూలు చేస్తుందన్నారు. కేంద్రం పేదలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ ఫలాలు అందిస్తుంటే రాష్ట్ర నాయకులు వారి పేర్లు ముద్ర వేసుకుని డబ్బా కొడ్తున్నారని మండిపడ్డారు. కేంద్రం దేశ ఆర్థిక పురోగమనం కోసం సెస్ రూపంలో వసూలు చేస్తోందని రావెల కిషోర్ వివరణ ఇచ్చారు.