ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే 30 నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. నిజానికి ఈ వేడుకల్ని ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి వైస్ జగన్ కలలుగన్నారు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అధికార పార్టీకి రోజు రోజుకీ ఇబ్బందికరంగా మారుతున్నాయి.

జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించిన పథకాలతో పాటు మరిన్ని ప్రజాకర్షక పథకాలను కూడా ప్రకటించడం ద్వారా మొదటి ఏడాది సంబరాల్ని వేడుకగా చేసుకోవాలన్న ఆ పార్టీ ఆలోచనలపై దురదృష్టవశాత్తు కరోనావైరస్ నీళ్లు చల్లేసింది. దాంతో వేడుకలే లేకుండా పోయాయి.

మే 23న నిర్వహించాల్సిన విక్టరీ డే ఉత్సవాలను కూడా పార్టీ రద్దు చేసింది.

అనుకున్నదొక్కటి .. అయినది ఇంకొక్కటి

జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తిరుగులేని విజయం సాధించారు. అయితే మే 23, 2019న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు తాము సాధించిన విజయాలను ప్రజల ముందుంచేందుకు వైఎస్సార్సీపీకి సరైన సందర్భం దొరకలేదు.

దీంతో ఏపీ చరిత్రలోనే ఈ రోజు ఒక మైలు రాయిగా నిలిచిపోయేలా కార్యక్రమాలు రూపొందించాలని వైఎస్సార్సీపీ ప్రణాళికలు రచించింది.

నిజానికి జగన్ రాజకీయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మోడల్‌నే ఎంచుకున్నప్పటికీ దాన్నిఅమలు చేయడం, ఆయనకు భగీరథ ప్రయత్నంలా మారుతోందన్న విషయం పదే పదే నిరూపితమవుతోంది.

నగదు బదిలీ, సంక్షేమ పథకాలను మినహాయిస్తే, రాజధానిని అమరావతి నుంచి తరలించి, మూడు రాజధానులుగా విభజించడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్ష, ఇంగ్లిష్ మీడియం పాఠాశాలలు, టీటీడీ భూముల అమ్మకం తదితర రాజకీయ పరమైన నిర్ణయాల విషయంలో ఆయనకు పదే పదే చుక్కెదురవుతూ వచ్చింది.

చివరిగా రెండు నెలల లాక్‌డౌన్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేసింది. ఆదాయం భారీగా పడిపోయింది, రాజకీయ వ్యతిరేకత పెరిగిపోతోంది, కోర్టుల్లో పదే పదే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో ఆయన పాలనలో ఇంపుదనం అంతాపోయింది. ఈ ప్రతికూల పరిస్థితుల్ని అధికార పార్టీ ఎలా ఎదుర్కోనుందన్నదే తాజా ప్రశ్న.

వైఎస్ఆర్ స్టైల్ రాజకీయాలు

తన పాదయాత్రతో 2004లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన జగన్ తండ్రి వైస్ రాజశేఖరరెడ్డి కూడా మొదట్లో ఇలాంటి ప్రతికూల శక్తుల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఆయన విషయానికొచ్చేసరికి ఆయన నాయకత్వ లక్షణాలను గుర్తించిన పార్టీ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.

హైకమాండ్ అండతో మొదట పార్టీలో అసమ్మతి లేకుండా చేసిన ఆయన ఆ తర్వాత, టీఆర్ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ముందుగా ఆ పార్టీని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లిపోయేలా చేసిన వైస్, ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులకు తెరలేపారు. అప్పట్లో దీన్ని తెలుగు మీడియా ‘ఆపరేషన్ ఆకర్ష్’ అని పిలుస్తూ వచ్చింది. ఇక టీడీపీ అనుకూల మీడియాపై ఆయనకు ఎంత వ్యతిరేకత ఉన్నది అప్పట్లో అందరికీ తెలుసు. ఓ రకంగా పాలనలో తనదైన ముద్రకు వేసే ప్రయత్నం చేశారు వైఎస్. ప్రభుత్వంలో రెడ్డి రాజ్యానికి తెర లేపారు. రాజకీయ పదవుల నుంచి, అధికార యంత్రాంగం వరకు అన్ని చోట్లా రెడ్డి వర్గానికి చెందిన వారిని నియమించారు. ఎస్ఈజెడ్‌లు, మైనింగ్ లీజులు, థర్మల్ ప్లాంట్లు, భూ కేటాయింపులు, భూసేకరణ ఇలా అనేక విషయాల్లో ఆయన వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని చెబుతారు.

ఇన్ని జరిగినప్పటికీ తన ప్రభుత్వంపై ఎక్కడ వ్యతిరేకత రాకుండా వైఎస్ జాగ్రత్త పడ్డారు. 2004 నుంచి 2009 వరకు ఆయన అధికారానికి తిరుగు లేకుండా పోయింది. అనేక అవినీతి, బంధు ప్రీతి ఆరోపణలు వచ్చినప్పటికీ, కొన్నింటిలో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, వామపక్షాలు సహా అనేక ఇతర శక్తులు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలచడంలో విఫలమయ్యాయి. అక్కడక్కడ ఆందోళనలు జరిగినప్పటికీ తన అధికార బలంతో వాటిని సమర్థవంతంగా అణచివేయడమే కాదు…వాటిని వీధి పోరాటాలుగా మార్చేశారు.

ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అలాగే తెలుగు దేశం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచడంలో విజయవంతమయ్యారు. ఓ వైపు అధికార ముసుగులో నిరంకుశంగా వ్యవహరిస్తూనే మరోవైపు పేదల పక్షపాతి అన్న ముద్ర తనపై ఏర్పడేలా చూసుకున్నారు. అలా రెండు పరస్పర విరుద్ధమైన ఇమేజ్‌లను సొంతం చేసుకోవడం ద్వారా తన పాలనకు వ్యతిరేకత అన్నదే లేకుండా చూసుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హెలీకాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించేంత వరకు అది వైఖరి కొనసాగింది.

ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, పెన్షన్లు, ముస్లింల రిజర్వేషన్లు వంటి సంక్షేమ పథకాలు ఆయన్ను పేదల దేవుడిగా చేశాయి. జలయజ్ఞం, సాగు నీటి ప్రాజెక్టులు, ఎస్ఈజెడ్‌లు, భారీ ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణాలు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వంటి కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రభావవంతమైన వర్గాలకు ఆయన్ను దగ్గర చేశాయి. అయితే ఆర్థిక పరిమితులు సహా అనేక కారణాల వల్ల జగన్ పాలనలో ఆ సమతుల్యత లోపించింది.

అధికారం విషయంలో ఇద్దరూ ఇద్దరే !

అధికారం చెలాయించే విషయంలో ముమ్మూర్తులా తండ్రి ఎలాగో కొడుకు కూడా అలాగే. జగన్ కూడా అధికారదాహంతో రగిలిపోయే వ్యక్తే. విపక్షం పట్ల తీవ్రమైన అసహనాన్ని కనబరిచే ఆయన వాటి నోళ్లు మూయించేందుకు దేనికైనా సిద్ధపడతారు. వైఎస్ కూడా వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ లేకుండా పోతుందని అప్పట్లో పదే పదే చెబుతూ వచ్చే వారు. జగన్మోహనరెడ్డిది కూడా అదే ధోరణి. త్వరలోనే టీడీపీ అంతరించిపోతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

అదే ఆశతో తండ్రి అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్‌ మంత్రాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మొత్తాన్ని తన కులానికి చెందిన వారితోనూ, తన నమ్మకస్తులతోనూ నింపేసి పెత్తనమంతా తన చేతుల్లో పెట్టుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన అధికారులందర్నీ జగన్ పక్కనబెట్టారు. కానీ వైఎస్ అప్పట్లో అలా చెయ్యలేదు. అధికారుల సామర్థ్యాలను గుర్తించి వారు గతంలో చంద్రబాబునాయుడికి సన్నిహితంగా మెలిగినప్పటికీ, వారికి కీలక బాధ్యతల్ని అప్పగించారు. ఈ ఆర్టికల్ రాసే సమయానికి సుమారు పన్నెండు మందికిపైగా అధికారులు ఏడాది కాలంగా పోస్టింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ కక్షసాధింపు చర్యలకు ఇది నిదర్శనం.

కోరి కష్టాలు తెచ్చుకుంటున్న జగన్ !

ఓ రకంగా వైఎస్‌తో పోల్చితే రాజకీయంగా జగన్ చాలా బలమైన స్థితిలో ఉన్నారు. పార్టీలో అసమ్మతి గురించి ఆయన భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకు అసలు హైకమాండే లేదు. అయితే తన తొందర పాటుతనంతో తనకున్న ఇతర పరిమితులను ఆయన గుర్తించడం లేదు. ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని మెజార్టీ కట్టబెట్టడంతో తానెవ్వరికీ బాధ్యుణ్ణి కాదని భావిస్తూ తనకు తానుగా రాజకీయ సంక్షోభాలను సృష్టించుకుంటున్నారు.

ఫలితంగా ఆయన తీసుకున్న కొన్ని ప్రశంసించదగ్గ నిర్ణయాలు కూడా వివాదాల్లో పడుతున్నాయి. చంద్రబాబునాయుడి పాలనలో అమరావతి కేంద్రంగా జరిగిన రాజకీయాలు, మోసపూరిత విధానాలకు విసిగిపోయిన చాలా మంది మేథావులు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ వంటి నిర్ణయాలకు మద్దతు పలికారు. కానీ ఆయన వైఖరిని గమనించిన వాళ్లంతా ఇప్పుడు క్రమంగా దూరమవుతున్నారు.

“2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తుందని అనుకున్నాం. ముఖ్యంగా వైజాగ్ సహా ఇతర ప్రాంతాల్లో సీఆర్‌జెడ్ నిబంధనల విషయంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, చట్ట విరుద్ధమైన కట్టడాలను తొలగిస్తుందని ఆశించాం. కానీ గత ప్రభుత్వంలో జరిగిన ఉల్లంఘనల్ని పట్టించుకోలేదు సరికదా వాటిని శాశ్వతం చేసింది ఈ ప్రభుత్వం. నగరాల్లో చాలా వరకు చట్ట విరుద్ధమైన కట్టడాలను తొలగించినప్పటీ సీఆర్‌జెడ్ నిబంధనల్ని ఉల్లంఘించిన కట్టడాల జోలికే వెళ్లలేదు” అని ప్రభుత్వ మాజీ సెక్రటరీ ఈఏఎస్ శర్మ వ్యాఖ్యానించారు.

తీర ప్రాంతంలోని పర్యావరణ సంరక్షణ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న డాక్టర్ శర్మ, పేదలకు ఇళ్ల పట్టాలిచ్చే నెపంతో, ఇటీవల కాకినాడ పోర్టు భూముల్లోని కొన్ని దశాబ్దాలుగా ఉన్న మడ అడవులు నాశనం చేయడాన్ని ప్రభుత్వ చర్యలకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

“మడ అడవుల సంరక్షణ విషయంలో చట్టంపై స్థానిక అధికారవర్గాలకు ఏ మాత్రం గౌరవం లేదు. అందుకే వాటికి అవసరమైన, అత్యంత విలువైన జీవ వనరుల్ని నాశనం చెయ్యడానికి వెనుకాడలేదు. ఈ చర్యలపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరనసలు పెల్లుబికినప్పటికీ పట్టించుకోలేదు” అంటూ డాక్టర్ శర్మ తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఉన్న కేంద్ర, రాష్ట్ర చట్టాలను(ఉదా. వాటర్, ల్యాండ్&ట్రీస్ యాక్ట్ లేదా వాల్టా) ఏ మాత్రం గౌరవించకుండా పర్యావరణ పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అందుకోసం కొత్త చట్టాలను తీసుకురావాలని ముఖ్యమంత్రి మాట్లాడటం మరింత హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు.

బ్యాలెన్స్ మిస్సయ్యింది

ఆయన వ్యక్తిత్వంలో భిన్న కోణాలైన పేదల పక్షపాతి- అధికార పిపాసి అన్నరెండు ఇమేజ్‌ల మధ్య, కచ్చితమైన బ్యాలెన్స్‌ను సాధించలేకపోవడం వల్ల సంస్ధాగతమైన అరాచకత్వం పెరిగిపోయింది. పాలన అన్నది కేవలం ప్రతిపక్షాన్ని వెంటాడి అసమ్మతి అన్నదే లేకుండా చెయ్యడానికి అన్నట్లు తయారయ్యింది.

రాష్ట్ర రాజధాని అమరావతిని మూడు భాగాలు చేసి జ్యూడీషియల్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్స్‌ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి చాలా వర్గాల నుంచి మద్దతు లభించింది. అయితే ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. అలాగే మధ్యతరగతి వర్గమంతా మెచ్చుకున్న ఇంగ్లిష్ మీడియం పాఠశాలల నిర్ణయానికి కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మోకాలడ్డింది. ప్రభుత్వ కార్యాలయాకు పార్టీ రంగులు వేయడాన్ని కూడా హైకోర్టు రద్దు చేయడంతో ప్రభుత్వం పరువు పోయింది.

గ్రామ స్థాయిలో 4.5 లక్షల ఉద్యోగాల కల్పన, చేనేత కార్మికుల సంక్షేమ పథకాల పేరిట నగదు ప్రయోజనాలు, అమరావతి రైతు భరోసా, వాహన మిత్ర(ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు రూ. పది వేలు), న్యాయ విద్యార్థులకు 5వేల రూపాయల ఉపకారవేతనం వంటి అనేక పథకాలు లబ్దిదారుల్లో ఆయన ఇమేజ్ పెరగడానికి కారణమయ్యాయి. అదే సమయంలో కక్ష సాధింపు రాజకీయాలపై అతిగా ఆధారపడటం, తాను చెప్పిందే జరగాలన్న వ్యవహారశైలి ఆయన సంక్షేమపాలనపై కారు మబ్బులు కమ్మేలా చేశాయి.

“చంద్రబాబునాయుడి కాలంలో కొనసాగిన ‘కమ్మ పాలన’కు బదులు జగన్మోహన్ రెడ్డి ‘రెడ్ల పాలన’ తీసుకురావడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ.వెంకటేషు వ్యాఖ్యానించారు.

“ఒక్క సంక్షేమ పథకాలను మినహాయిస్తే పాలన విషయంలో జగన్ ఎటువంటి చెప్పుకోదగ్గ మార్పులు తీసుకు రాలేకపోయారు. ఇతరులు చెప్పే విషయాన్ని ఆయన వినరన్న విషయం స్పష్టమైపోయింది. బహుశా ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రజాగ్రహానికి గురికాకుండా కొంతకాలం తప్పించుకోవచ్చు. అయితే ఆయన అనుసరిస్తున్న రాజకీయ విధానాలను చూస్తుంటే సామాజిక న్యాయం విషయంలో ఆయనకు ఆయన ప్రత్యర్థులకు తేడా లేదన్నది స్పష్టమవుతోంది” అని వెంకటేష్ చెప్పారు.

హైకోర్టు మొట్టికాయలు

గత వారం రోజులుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక ముఖ్యమైన నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచడం ద్వారా ఏడాది పాలనను పూర్తి చేసుకున్నామన్నఆ పార్టీ ఉత్సాహంపై నీళ్లు చల్లేసింది.

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్, డాక్టర్ సుధాకర్ అరెస్ట్, గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్, టీటీడీ భూముల అమ్మకం, ఇలా అనేక కేసుల విషయంలో హైకోర్టు నుంచి ప్రభుత్వం ఎన్నో ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే కోర్టు తీర్పులకు దురుద్ధేశాలను ఆపాదిస్తూ విమర్శించిన అధికార పార్టీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా మరి కొంత మంది పార్టీ మద్దతుదారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

జగన్-చంద్రబాబు ఇద్దరూ ఇద్దరే

గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన సారూప్యత కనిపిస్తుంది. ఇద్దరూ వ్యక్తిగత ఎజెండాలతో ముందుకెళ్లేవారే. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా చూపిస్తూ అప్పటి వరకు రాయలసీమ రెడ్ల కేంద్రంగా ఉన్న అధికారాన్ని అమరావతి కేంద్రంగా మార్చాలని అప్పట్లో చంద్రబాబు ప్రయత్నించారు. ఇప్పుడు జగన్ కూడా అదే రీతిలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న ప్రతిదీ నాశనం చెయ్యడమే తన ఎజెండాగా ముందుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇద్దరి పద్ధతులూ వాంఛనీయం కాదు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments