గతంలో ఎన్నడు లేని విధంగా భారతదేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వాలు దీనిని అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మందులేని కరోనాని నివారించేందుకు దాదాపు రెండు నెలలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో భారతదేశ ఆర్ధిక పరిస్థితి కుదేలైంది. ఇటువంటి పరిస్థితులలో మరో ప్రమాదం భారత్‌ని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుంది. పొరుగుదేశం నుండి వచ్చిన మిడతల దండు( లోకస్ట్ ఎటాక్) ఇప్పుడు భారత్‌లోని పంటపొలాలని నాశనం చేస్తుంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం భారత్‌కి సవాలుగా మారిన రెండు ప్రమాదాలని ముందుగానే ఊహించి వెండితెరపై ఆవిష్కరించారు తమిళ దర్శకులు. వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో, దాని వలన ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ చిత్రంలో కళ్ళకి కట్టినట్టు చూపించారు. కరోనా వైరస్ మాదిరిగానే సూర్య సినిమాలో చూపించిన వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుందని నెటిజన్స్ చెబుతున్నారు.
ఇక సూర్య, మోహన్ లాల్ ప్రధాన పాత్రలలో కేవీ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం బందోబస్త్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెకండాఫ్‌లో మిడతల దండు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపించారు. మైనింగ్ పరిశ్రమని నెలకొల్పే నేపథ్యంలో పంటపొలాలని నాశనం చేసేందుకు మిడతల దండుని ప్రయోగిస్తారు . ఇవి పంటపొలాలని పూర్తిగా నాశనం చేస్తాయి. అయితే చివరకి ఈ మిడతల దండుని హీరో చాకచక్యంగా అడ్డుకుంటారు.
మొత్తానికి భారతదేశం ఎదుర్కొంటున్న రెండు తీవ్ర విపత్తులని ముందుగానే ఊహించి తమిళ దర్శకులు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కొంపదీసి వారికి భవిష్యవాణి పుస్తకం ఏమైన దొరికిందా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది గతంలో హాలీవుడ్ చిత్రం కాంటేజియన్ చిత్రంలోను చక్కగా చూపించారు.