రాష్ట్రంలోని రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టపోకుండా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఆంధ్రా గ్రీన్స్‌(andhragreens.com) వెబ్‌సైట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఉంచటంతో పాటు వినియోగదారులు కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు నమోదు చేసుకునే విధంగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు. కొవిడ్‌ కారణంగా రైతుల ఉత్పత్తుల విక్రయాలకు ఇబ్బంది కలిగిందని.. ఈ సమస్యను పరిష్కరించాలనే ఈ తరహా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో ద్వారా పండ్లు, కూరగాయలు విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో ఆంధ్రా గ్రీన్స్‌ కూడా ఈ తరహా సేవలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉంటే 305 లక్షల మెట్రిక్‌ టన్నుల పండ్లు, కూరగాయల ఉత్పత్తి వచ్చిందని మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ సంక్షోభంలో రాష్ట్రవ్యాప్తంగా 8.12లక్షల పండ్ల కిట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం నుంచి 18 లక్షల మెట్రిక్‌ టన్నుల పండ్లు, కూరగాయల మార్కెటింగ్‌ జరిగిందని ఆయన వివరించారు. ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఉద్యాన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి కన్నబాబు అన్నారు. లేనిపోని అవాస్తవాలతో రైతులను చంద్రబాబు గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో ఏ ఒక్క పంటకు సరైన మద్దతు ధర దక్కలేదని ఆయన ఆరోపించారు. అదేవిధంగా గతంలో రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వారి గురించి మాట్లాడటం శోచనీయమన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments