రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలోనే ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొన్ని రకాల అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉందని తెలిపారు. తెలంగాణ అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో అమలు చేసే పథకాలను అందరూ అనుసరిస్తున్నారని సీఎం తెలిపారు.
‘నీటిపారుదల ప్రాజెక్టుల ఫలాలు మనం చూస్తున్నాం. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ తెలంగాణలో ఉంది. వేలాది పాడిపశువులు పంపిణీ చేసి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. అధునాతన పద్ధతుల్లో పంటలు పండించేందుకు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాం. 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదే. రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలి. తెలంగాణలో కాటన్ పంటకు అద్భుతమైన భవిష్యత్ ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే వేయాలి. 70 లక్షల ఎకరాల్లో పత్తిపంటను పండించాలి. గతంలో 53 లక్షల ఎకరాల్లో పత్తి పండించారు..ఈసారి 70 లక్షల ఎకరాల్లో వేయాలి. ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేసి మంచి ధరను రైతు పొందాలి. వ్యవసాయంలో మనం అన్ని రికార్డులను బద్ధలుకొడుతున్నాం. పాలిహౌజ్, గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు సబ్సిడీలు ఇస్తున్నామని’ సీఎం వివరించారు.