మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

31 వరకు మెట్రో రైలు, విమానాలు బంద్

లాక్ డౌన్ 3 నిబంధనలు కొనసాగింపు

ఢిల్లీ: దేశంలో మే 31 వరకు నాలుగో దశ లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం, అమలుపై మార్గదర్శకాలు జారీ చేసింది.

స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ప్రార్థనా స్థలాల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. వీటిపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. అదే విధంగా మెట్రో రైలు, విమాన సర్వీసులకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలని ఆదేశించింది.

కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా వ్యవహరించాలని, నిత్యావసరాలకు తప్ప దేనికీ వెసులుబాటు ఇవ్వవద్దని సూచించింది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో నిర్ణయాధికారం రాష్ట్రాలకే కట్టబెట్టింది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కేంద్రం మినహాయింపులు ఇచ్చింది. ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం కల్పించింది. జోన్లలో అనుసరించాల్సిన విధివిధానాలపైనా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిచ్చింది.

సడలింపులపై రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని, కేంద్రం నిబంధనలతో రాష్ట్రాలు నష్టపోతున్నాయని సీఎంలు చేసిన ఫిర్యాదుతో కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయికి చేరుతున్న సమయంలో నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్రాలు కఠినంగా ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని కేంద్రం సంకేతాలు ఇచ్చింది.

భౌతిక దూరం పాటిస్తూ, 50 మంది సభ్యులతో పెళ్లిళ్లకు అనుమతినిచ్చింది. అంతర్రాష్ట బస్సు సర్వీసులపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించడం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. రెస్టారెంట్లకు హోం డెలివరీ సర్వీస్ చేసుకునే అవకాశం ఇచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments