తెలంగాణలో ఇవాళ మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధి నుంచి వచ్చినట్లు తెలిపింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇద్దరికి, మరో ముగ్గురు వలస కూలీలకు ఈ మహమ్మారి సోకినట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1551కి చేరింది. ఇప్పటి వరకు 34 మంది మరణించారు.
మరోవైపు రాష్ట్రంలో ఈ వైరస్ నుంచి కోలుకుని ఇవాళ మరో 21 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 992కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 552 మంది చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంది.