జగన్ టీం మెల్లిగా బయటకు వస్తొంది. పాతిక మంది మంత్రులు ఉన్నా కూడా జగన్ అయిదేళ్ల పాటు తన మంత్రులుగా కొనసాగించే వారి జాబితా కూడా చూచాయగా బయటపడుతోంది. అందులో యువ మంత్రులే ఎక్కువగా ఉన్నారు. వారు సైతం జగన్ పట్ల విధేయత మాత్రమే కాదు, పని తీరు కూడా కొలమానంగా జగన్ మార్కులు వేస్తున్నారు. వారి విషయంలో జగన్ కనబరుస్తున్న శ్రధ్ధ, ప్రత్యేక ఆసక్తిని చూస్తే అయిదేళ్ళ మంత్రులు వీరేనని అనిపించకమానదు. నిజానికి జగన్ సర్కార్ లో అరడజను మంత్రులు తప్ప మిగిలిన వారంతా రెండవ విడతలో చాన్స్ దక్కించుకోలేరని కూడా రాజకీయ అంచనాలు ఉన్నాయి. జగన్ ఎంతో ఆశతో కొందరు మహిళలకు కీలక శాఖలు అప్పగిస్తే వారు సైతం సరైన విధంగా తన ప్రతిభను చూపించలేక పోవడం విశేషం.

ఏరికోరి..

విశాఖ అంటే జగన్ కి మోజు. అది ఎందుకో తెలిసిందే. ఆయన రాజధానిగా చేద్దామనుకుంటున్నారు. అందుకే తన కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డిని అక్కడే ఉంచి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. విజయసాయిరెడ్డి పార్టీని ఒక కొలిక్కి తెస్తూంటే ప్రభుత్వపరమైన వ్యవహారాలు చక్కబెట్టేందుకే కన్నబాబుని ఇంచార్జి మంత్రిగా జగన్ చేశారని చెబుతున్నారు. జగన్ ఎంపిక కూడా చాలా దూరదృష్టితో కూడుకున్నదని అంటున్నారు. ఇక విశాఖలో గ్యాస్ లీకేజి ఘటన తరువాత పరిస్థితులు సాధారణమయ్యేంతవరకూ విశాఖలో మకాం వేసి మొత్తం ఇతర జిల్లాల మంత్రులను కూడా కలుపుకుంటూ కన్నబాబు బాగానే తన సమర్ధతను చాటుకుంటున్నారు.

కీలకమే .?

ఇక ఇంచార్జి మంత్రిగా కన్నబాబే విశాఖలో కీలకంగా ఉన్నారు. సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ సైతం ఆయన తరువాతనే ఉంటున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తూ తరచూ సమీక్షలు జరుపుతూ మరో వైపు ముఖ్యమంత్రితో వీడియో సమావేశాల్లో పాల్గోంటూ అనుసంధానంగా కన్నబాబు ఉంటూ వస్తున్నారు. నిజానికి గ్యాస్ లీకేజ్ ఘటన జరిగినపుడు వైసీపీకి చెడ్డ పేరు వచ్చి పరువు పోవడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే జగన్ వ్యూహాత్మకంగా విశాఖ టూర్ పెట్టుకున్నారు. బాధితులను ఓదార్చడమే కాకుండా భారీ నష్టపరిహారం ప్రకటించి విపక్షానికి మాట లేకుండా చేశారు. ఆ తరువాత జగన్ బాధ్యతను అంతా కన్నబాబు భుజాన మోస్తున్నారు.

క్లీన్ బౌల్డ్..

ఇక జగన్ కోటి రూపాయల పరిహారంతో ఎక్కడ మంచి పేరు వస్తుందోనని రాజకీయం మొదలైపోయింది. విపక్షాలు రెండవ రోజు నుంచే భారీ ఎత్తున ఆందోళనలకు తెర తీశారు. ఓ దశలో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిని పూర్తిగా నియంత్రించడమే కాకుండా ఎప్పటికపుడు పరిస్థితిని గమనిస్తూ కన్నబాబు ఇంచార్జి మంత్రిగా దూకుడుగా వెళ్తున్నారు. విపక్షం మాటకు నాలుగు మాటలు కౌంటర్ ఇవ్వడం ద్వారా వారిని క్లీన్ బౌల్డ్ చేయడంతో కన్నబాబు తానేంటో చూపించారని అంటున్నారు. ఇక ఎల్జీ పాలీమార్స్ కి అనుమతులు ఇవ్వడం వెనక బాబు ఉన్నారన్న దాన్ని ఆధారాలతో సహా బయటపెట్టి తెలుగుదేశం నోరు కట్టేశారు. మరో వైపు బాధిత గ్రామాల్లో పర్యటిచడం ద్వారా వారికి గట్టి భరోసా ఇవ్వడంలోనూ కన్నబాబు చురుకైన పాత్ర పోషించారు. మొత్తం మీద చూసుకుంటే కన్నబాబు జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేశారని, అయిదేళ్ల పాటు ఆయన కుర్చీని కదల్చడం ఎవరి వల్లా కాదని మాట వినిపిస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments