ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేర్లు సచిన్-గంగూలీ. వీరిద్దరూ 90వ దశకంలో టీమ్ఇండియాకు ఓపెనింగ్ పెయిర్‌గా అత్యద్భుత ప్రదర్శన చేశారు. జట్టుకు ఎన్నో మరపురాని విజయాల్ని కూడా అందించారు. తమదైన బ్యాటింగ్ విన్యాసాలతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో అభిమానుల గుండెల్లో అసలైన ఛాంపియన్లు అనిపించుకున్నారు. సచిన్, గంగూలీ టీమ్ఇండియాకు ఎంపికవ్వకముందే అండర్-15 స్థాయిలోనే కలిసి ఆడారు. అలా వారిద్దరి మధ్యా చిన్ననాటి నుంచే స్నేహం పెరిగింది. ఇన్నేళ్లు గడుస్తున్న ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం, ఆప్యాయత. ఈ నేపథ్యంలోనే దాదాతో తనకున్న ఓ మధురస్మృతులను పంచుకున్నాడు క్రికెట్ దిగ్గజం.
వీళ్లిద్దరూ టీమ్ఇండియాకు ఆడుతున్న రోజుల్లో లిటిల్‌మాస్టర్ ఓ సందర్భంలో దాదా ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా సౌరభ్ తల్లి నిరూపా గంగూలీ.. సచిన్‌కు ఇష్టమైన వంటకాలు చేసి మంచి విందు ఇచ్చారు. నాటి ఫొటోను మాస్టర్‌బ్లాస్టర్ తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దాదీ ఇంట్లో గడిపిన సంతోషకరమైన సాయంత్రం గతస్మృతులు అంటూ పోస్టు చేశాడు. నాటి ఆతిథ్యం చాలా బాగుందని, ఈ సందర్భంగా గంగూలీ తల్లిని గుర్తుచేసుకున్నాడు తెందూల్కర్. ఆమె బాగున్నారని ఆశిస్తూ సచిన్ శుభాకాంక్షలు చెప్పారు.
సచిన్-గంగూలీ 176 వన్డేల్లో టీమ్ఇండియాకు కలిసి ఆడారు. ప్రపంచంలో ఏ జోడీ చేయనన్ని పరుగులు చేశారు. వీరిద్దరూ 47.55 సగటుతో 8227 పరుగులు సాధించారు. తాజాగా, ఐసీసీ సైతం ఇదే విషయాన్ని ట్వీట్ చేసింది. వన్డేల్లో ఏ జోడీ కూడా 6000 పరుగులు చేయలేదని చెప్పింది. దీనికి స్పందించిన సచిన్.. గంగూలీకి ఒక ప్రశ్నవేశాడు. ‘ఐసీసీ ట్వీట్‌తో అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి దాదీ. ఇప్పుడున్న వన్డే నిబంధనలు (నలుగురు ఫీల్డర్లు సర్కిల్ బయట, రెండు కొత్త బంతులు) అప్పుడుంటే, మనం ఇంకెన్ని పరుగులు చేసేవాళ్లమని అనుకుంటున్నావ్’ అని అడిగాడు. దానికి గంగూలీ స్పందిస్తూ.. కనీసం ఇంకో 4000 పరుగులు చేసేవాళ్లమని బదులిచ్చాడు. కాగా, గంగూలీని అందరూ దాదా అంటే, సచిన్ మాత్రమే దాదీ అని పిలువడం గమనార్హం.