ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో జరిగే ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నెల 17న లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి… లాక్‌డౌన్ అమలు అవుతున్న తీరు, ఇకపై తీసుకోవాల్సిన చర్యలను ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానితో పాటు హోంమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా హాజరుకానున్నారు. గత సమావేశంలో కేవలం హోంమంత్రి మాత్రమే పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది. ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో.. రాష్ట్రాలన్ని కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అన్ని రాష్ట్రాలు సీఎస్‌లు, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో నిన్న కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీల రాకతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఈ భేటీలో చర్చ జరిగింది. దీంతో ఇప్పటివరకు లేని జిల్లాలు కూడా రెడ్‌జోన్లుగా మారుతున్నాయని చెప్పినట్లు తెలిసింది. ఇలాగైతే సాధారణ స్థితికి చేరుకోవడం కష్టమేననన్న భావన అధికారుల్లో వ్యక్తమైంది. ఈ అంశం కూడా ముఖ్యమంత్రులతో సమావేశంలోనూ చర్చకు వచ్చే అవకాశముంది. దేశవ్యాప్తంగా మూడో విడత లాక్ డౌన్ ముగిసేందుకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ప్రధాని.. ముఖ్యమంత్రులతో నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ ఆసక్తిరేపుతోంది.. గత సమావేశంలో 9 రాష్ట్రాల సీఎంలే మాట్లాడగా, ఈసారి అందరికీ అవకాశమివ్వనున్నారు. దేశంలో పెరుగుతున్న కేసులు, లాక్‌డౌన్ నిబంధనల సడలింపులు, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments