పేదలకు భూ పంపిణీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నేడు జిల్లా కలెక్టర్‌లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదలందరికీ జులై 8న పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈలోగా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకా లబ్దిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తులు తనకు వచ్చాయని జగన్ వెల్లడించారు. మరో 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలన్నారు.

గ్రామాల్లోకి వెళ్లి ఇంటి పట్టా ఎవరికైనా లేదా? అని తాను అడిగితే.. లేదు అని ఎవ్వరూ అనకూడదన్నారు. తనకు ఓటు వేయని వారైనా పర్వాలేదు, వాళ్లకీ పట్టాలు ఇవ్వాల్సిందేనని జగన్ పేర్కొన్నారు. అర్హత ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇంటిపట్టా లేదని చెప్పకూడదన్నారు. 27లక్షల ఇళ్ల పట్టాలు మనం ఇవ్వబోతున్నామన్నారు.

టెలి మెడిసిన్‌ కోసం ఒక నంబర్‌ కేటాయించాం..

టెలి మెడిసిన్‌ కోసం ఒక నంబర్‌ కేటాయించామని జగన్ తెలిపారు. అలాగే ప్రతి సచివాలయంలో కూడా ముఖ్యమైన నంబర్లు ఉంచుతామన్నారు. ఈ నంబర్లు ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉండాలన్నారు. టెలిమెడిసిన్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందని అధికారులు చెప్తున్నారన్నారు. కాల్‌చేసిన వారికి ప్రిస్కిప్షన్‌ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితోపాటు, కలెక్టర్‌కూ వస్తాయన్నారు. ఇక్కడ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. పీహెచ్‌సీ పరిధిలోకి ఒక ద్విచక్ర వాహనాన్ని, థర్మల్‌ బాక్సును అందుబాటులోకి తీసుకురావాలని జగన్ తెలిపారు.

24 గంటల్లోగా ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు వెళ్లాలని సూచించారు. త్వరలో విలెజ్ క్లినిక్‌ ప్రారంభమవుతుందని.. అప్పుడు టెలీ మెడిసిన్‌ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ వ్యవస్థను కలెక్టర్లు తమదిగా భావించి బాగా పనిచేయించాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలపై సమగ్రంగా సర్వే చేశామని.. వీరిలో అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించామన్నారు: ఇంకా 5,281 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని జగన్ తెలిపారు. వీలైనంత త్వరగా వీరికి పరీక్షలు పూర్తి చేయాలన్నారు. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం… నిర్దేశించుకున్న కంటైన్‌మెంట్‌ క్లస్టర్లపై దృష్టి పెట్టాలన్నారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్, దానిచుట్టూ ఉన్న బఫర్‌ జోన్‌పై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. వస్తున్న కేసులన్నీ కూడా క్లస్టర్‌ జోన్ల నుంచే అధికశాతం వస్తున్నాయని జగన్ వెల్లడించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments