కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో పర్ణిక ఆర్ట్స్ పతాకం పై తెరకెక్కుతున్న చిత్రం “అడవి దొంగ”.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కొన్ని రోజుల క్రితం విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ నటుడు నాగ మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఇప్పటికే పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు నాగ మహేష్. ఆయన నట జీవితం గురుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

విశాఖపట్నంలో నాటకరంగంలో లబ్ధ ప్రతిష్టుడైన శ్రీ యస్ కే మిశ్రో గారి నేతృత్వంలో నేటికీ నిర్వహించబడుతున్న ‘ బహురూప నట సమాఖ్య ‘ అనే నాటక సంఘం ద్వారా పాతికేళ్ళనాడు ‘ భలేపెళ్ళి ‘ అనే నాటకంతో నటుడుగా ఆరంగ్రేటం చేసాడు నాగమహేష్

గీతాకృష్ఞ దర్శకత్వం వహించిన కోకిల చిత్రం ద్వారా తొలిసారి కెమెరా ముందు నిలిచి సింగిల్ టేకులో నటించి అందరిచేతా శభాష్ అనిపించుకున్నాడు.
ప్రశంసలు ప్రశాంతంగా వుండనివ్వవు కదా !

సినిమా నటుడవ్వాలన్న ఆకాంక్ష వటవృక్షంలా పెరగడంతో, విశాఖపట్నంలో చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పి మద్రాసు చేరుకున్నాడు. ధర్మక్షేత్రం, ప్రెసిడెంటుగారి పెళ్ళాం, మెకానిక్ అల్లుడు, కొండపల్లి రాజా, రక్షణ, మొదలగు చిత్రాల్లో అడపాదడపా వేసిన చిన్న చిన్న వేషాలు అతనిలోని నటుడికి సంతృప్తిని కలిగించలేకపోయాయి.

అదేసమయంలో తోడపుట్టిన అన్నకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన వుద్యోగం మానివేసాడు. అన్న కుటుంబాన్ని, అమ్మ, తమ్ముడు, చెల్లెలును పోషించే భారం నెత్తిమీద పడటంతో మోజుపడ్డ సినిమాని వదిలి డబ్బు సంపాదనకై మిత్రులతో కల్సి, రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి వెంచర్స్ వేసి వాసికెక్కాడు.

జీవితం సుఖంగా గడుస్తున్నా కళాకారుడు కాలేకపోయానన్న బాధ ఈతముల్లులా గుచ్చుతూవుండేది. నటనకు దూరమైన నాగ మహేష్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే రచయితగా మారాడు. అతను తొలిసారిగా రాసిన ‘ కొత్తపుంతలు ‘ అనే కధను ప్రచురించి అతనిలోని రచయితకు ప్రోత్సహించింది ‘స్వాతి వార పత్రిక ‘ అది మొదలు మరో పదిహేను కధలు స్వాతిముత్యాలుగా మారాయి.

శిష్యుడిలోని రచనా పటిమను గుర్తించిన గురువు మిశ్రో నాటికను రాయమని ప్రోత్సహించాడు. ‘ దేవుడు చూస్తున్నాడు ‘ అనే నాటికను రాసి గురువుకి అందించాడు నాగ మహేష్ . పల్లెకోన అనే వూళ్ళో పరుచూరి రఘుబాబు పరిష్యత్తులో ఆ నాటిక ప్రదర్శించబడి నాగమహేష్ కు ద్వితీయ ఉత్తమ రచయితగా అవార్డుని తెచ్చిపెట్టింది.

ఆ కాలంలోనే చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ముఖ్య కార్యకర్తగా అత్యంత ప్రియమైన సలహాదారుగా చిరంజీవికి ఎంతో చేరువయ్యాడు.
దశాబ్ధ కాలం తరువాత రాజకీయాల నుండి మరలి నటుడిగా చిరంజీవి నటిస్తున్న చిత్రం ఖైదీ నెం. 150 లో తనూ నటించాలనే మక్కువ మళ్ళీ మనసుని సినిమా వైపు మళ్ళించింది. చిరంజీవితో మంచి అనుబంధం వుండడంతో ఆయన్ని కలిసి తన అభిలాషను బయటపెట్టాడు.

ఎంతో పరిచయంవున్నా తనని ఏనాడు ఏమీ అడగని నాగమహేష్ కు ప్రతిభను ప్రదర్శించే అవకాశంవున్న పాత్రనిచ్చి ప్రోత్సహించాడు చిరంజీవి.
అందులో శంకర్ పాత్రను పోషించిన చిరంజీవిని షర్ట్ పట్టుకుని అరెష్ట్ చేసి పోలీస్ స్టేషన్లో హింసించే ఇనస్పెక్టర్ క్యారెక్టర్లో చాలా సహజంగా నటించి చిరంజీవి గారి ఆశీస్సులను దర్శకుడు వినాయక్ గారి మన్నలను పొందాడు.

అతని నటనను మెచ్చి రంగస్ధలం చిత్రంలో సమంత తండ్రిగా ఒక తాగుబోతు పాత్రనిచ్చాడు దర్శకుడు సుకుమార్ హేమాహేమీలైన నటసమూహం మద్య పాత్ర పరిధి తక్కువైనా తన ఉనికిని చాటుకున్నాడు నాగమహేష్
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ఞ నాగమహేష్ ఫెరఫార్మెన్స్ గురించి ప్రస్తావించటం…చాలా సహజంగా నటించాడని మెచ్చుకుంటూ, ఆ ఆర్టిష్ట్ ఎక్కడ దొరికాడని డైరక్టర్ సుకుమార్నే అడగడం, నాగమహేష్ ప్రతిభకు దర్పణం.

రంగస్ధలం తరువాత భరత్ అనే నేను, అరవింద సమేత, యాత్ర, గద్దలకొండ గణేష్ , మహార్షి, కొబ్బరిమట్ట లాంటి విజయవంతమైన సినిమాల్లో గుర్తుండిపోయే నటనను ప్రదర్శించాడు.

మైత్రీమూవీస్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా బుచ్చిబాబు దర్శకత్వంలో “
ఉప్పెన ” చిత్రాన్ని నిర్మిస్తూ, రంగస్ధలం చిత్రంలో నటించిన ఏ ఒక్క ఆర్టిష్టుని రిపీట్ చేయకుండా ఒక్క నాగమహేష్నే రిపీట్ చేస్తూ విజయసేతుపతి సరసన గొప్ప పాత్రనిచ్చి ప్రోత్సహించారంటే, దర్శకుల నటుడిగా నాగమహేష్ ఎదుగుతున్న తీరు అవగతమౌతుంది.

పర్ణిక ఆర్ట్స్ పతాకంపై నూతన నటుడు ‘ రామ్ తేజ్ ‘ హీరోగా, ‘ గోపీకృష్ఞ శేషం ‘ నిర్మాతగా దర్శకుడు ‘ కిరణ్ కోటప్రోలు ‘ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ” అడవిదొంగ.” ఆ చిత్రంలో కడుపునిండని కూలీలను బానిసలుగా చేసుకుని, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే దుర్మార్గుడైన రాఘవరెడ్డి
పాత్రలో తొలిసారిగా ప్రతికధానాయకుడుగా నటిస్తున్నాడు నాగమహేష్ . ఈ చిత్రంలోని తన నటన ప్రేక్షకులను ఎంతో అలరిస్తుందనే నమ్మకంతో వున్నానంటున్నారు నాగమహేష్

అలానే ‘ ప్రశాంత్ వర్మ ‘ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలోనూ ప్రతికధానాయకుడి పాత్రను పోషిస్తున్నాడు ఉప్పెన, అడవిదొంగ, బాలకృష్ఞ – బోయపాటి చిత్రం … గోపీచంద్ – సంపత్ నంది సిటీమార్ …నాగచైతన్య – శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మొదలైన చిత్రాలతో నాగ మహేష్ ప్రేక్షకులకు మరింత చేరువవుతాడనడంలో ఎట్టి సందేహాంలేదు.

ఇండ్రష్టిలో మంచి క్యారెక్టర్ నటుడిగా, మంచి క్యారెక్టర్ వున్న నటుడిగా మనుగడ సాగించాలనే నా ఆకాంక్ష అంటున్న నాగమహేష్ కాంక్ష నెరవేరాలని ఆశిద్దాం… ఆల్ ద బెష్ట్ టు నాగమహేష్ !

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments