మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆచార్య. మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్, కొనిదల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్, ఆ తర్వాత కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిరంజీవి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసి ఫ్యాన్స్‌ను సస్పెన్స్‌లోకి నెట్టేశారు.
‘సాధారంగా పాటలు చిత్రీకరించే సమయంలో నేను సంగీతం ఎంజాయ్ చేస్తాను. మధ్య మధ్యలో ఆపడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఇటీవల ఓ పాటను మాత్రం తరచూ పాజ్ చేస్తూ.. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. దానికి గల కారణం ఏమిటన్నది రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను’ అని ట్వీట్ చేసి అభిమానులను సస్పెన్స్‌లోకి నెట్టేశారు. చిరంజీవి వినే ఆ పాట ‘ఆచార్య’ సినిమాలోది అయిండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే కనుక జరిగితే 14 ఏళ్ల తర్వాత చిరంజీవి కోసం మణిశర్మ స్వరపరిచిన పాటను మంగళవారం వినొచ్చు. కాగా, చిరు, మణిశర్మ కాంబోలో అన్నయ్య, ఠాగూర్, ఇంద్ర, స్టాలిన్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.