ఘటోత్కచుడికి 25 ఏళ్ళు …

669

ఎస్వీ కృష్ణారెడ్డి – ఆలీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి . వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండొవ సినిమా “ఘటోత్కచుడు”. మనిషా ఫిలిమ్స్ పతాకం పై అచ్చి రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. 1995 వ సంవత్సరం ఏప్రిల్ 27 వ తారీఖున ఈ చిత్రం విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సరిగ్గా ఈ రోజుకి ఈ చిత్రం విడుదలై 25 ఏళ్ళు. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది.

ఈ చిత్రంలో కధ మొత్తం ఘటోత్కచుని పాత్ర చుట్టూ అల్లుకొని ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామంలో గాయపడి ఘటోత్కచుడు ఒక అడవిలో కోన ఊపిరితో ఉండగా ఒక బాలిక వచ్చి నీరందించి ప్రాణాలను కాపాడుతుంది, అప్పుడు ఈ జన్మలోనే కాదు , ఏ జన్మలోనైనా సరే నీకు ఆపద వస్తే నన్ను తలుచుకో ” అని బాలికకు వరమిస్తాడు . అయితే కొన్ని వందల సంవత్సరాల తరువాత ఆ పాప మళ్ళీ పుట్టి ఆపదలలో ఉన్నప్పుడు ఘటోత్కచుడు తన మాటను నిలబెట్టుకొని ఏ విధంగా సహాయం చేసాడనేది కధ. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణుడిగా రాజశేఖర్,అర్జునుడిగా శ్రీకాంత్ నటించిన సన్నివేశాలు ప్రేక్షకులకు కనుల పండుగగా ఉంటాయి.

సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టూనే …

ఘటోత్కచుని పాత్రలో కైకాల సత్యనారాయణ గారు నటించారు అనడం కంటే జీవించారని చెప్పాలి. అప్పటికే యమలీలలో యముడిగా మెప్పించిన ఆయన ఈ పాత్రలోనూ ఒదిగిపోయారు. తన మాయలతో రౌడీలను ఇబ్బంది పెట్టే సన్నివేశాలు అందరికీ గిలిగింతలు పెట్టాయి,ముఖ్యంగా చిన్నారులను బాగా ఆకట్టుకున్నాయి. చిన్నారి పాత్రలో బేబీ నిఖిత తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ కట్టి పడేసింది . ఇక ఈ చిత్రంలో నటించిన ఆలీ , రోజా మధ్య ఉండే సన్నివేశాలు,పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాయి.

సుబ్బారావు/రోబో

ఇక ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్ర సుబ్బారావు అలియాస్ రోబో. సైంటిస్ట్ టినూ ఆనంద్ దీనిని తయారు చేస్తారు. ఈ రోబో చిన్నారులను భలే అలరించింది. ముఖ్యంగా రోజాను ప్రేమించడం,”ఐ లవ్యూ రోజా” అంటూ పదే పదే వెంటపడడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఘటోత్కచునితో రోబో పోటీపడడం, వారిద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అందరినీ అలరించాయి. రోబో తో ఎక్కువ సన్నివేశాలు ఉన్న తొలి తెలుగు చిత్రం ఇదే కావొచ్చు.

కామెడీ సన్నివేశాలు

ఘటోత్కచుడు ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా, ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు కొదవు లేదు. రోడ్డుపై దొరికే ప్రతీ వస్తువును సేకరిస్తూ వాటి వల్ల సమస్యలలో ఇరుక్కునే పాత్రలో బ్రహ్మానందం, “రంగు పడుద్ది” అంటూ ఏ వీ ఎస్, తోటరాముడిగా తనికెళ్ళ భరణి, మాంత్రికుడిగా కోట శ్రీనివాసరావు, శిష్యులుగా మల్లిఖార్జునరావు ,చిట్టి బాబు ప్రేక్షకులను తెగ నవ్వించేశారు . ముఖ్యంగా ఫుట్ బాల్ తరిమే సన్నివేశాలు, ఫైట్ మధ్యలో టీపాయి పట్టుకున్న బొమ్మ కొట్టడం ప్రేక్షకులకు కితకితలు పెట్టిస్తాయి. ఆ బొమ్మ కొట్టేటప్పుడు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అప్పట్లో సందడి చేసింది.

మ్యూజికల్ హిట్ …

ఎస్వీ కృష్ణారెడ్డి ఆయన సినిమాలకు ఆయనే సంగీతం వహిస్తుంటారు. ఈ చిత్రానికి కూడా ఆయనే స్వరాలూ సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. “అందాల అపరంజి బొమ్మ” , “ప్రియమధురం” వంటి పాటలు హిట్స్ గా నిలిచాయి. అప్పట్లో కృష్ణారెడ్డి ప్రతీ సినిమాలో ఒక హీరోతో కానీ కమెడియన్ తో ఒక స్పెషల్ సాంగ్ పెట్టేవారు. ఈ చిత్రంలో ప్రియమధురం పాటలో నాగార్జున తళుక్కున మెరవడం అభిమానులను విపరీతంగా అలరించింది.

ఈ సినిమానే కాదు కృష్ణారెడ్డి-అచ్చి రెడ్డి కంబినేషన్లో వచ్చిన ప్రతీ సినిమా విభిన్నంగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాబోయే రోజులలో వీరిద్దరి కంబినేషన్లో మరెన్నో మంచి సినిమాలు వచ్చి అలరించాలని ప్రతీ సినీ ప్రేక్షకుడి కోరిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here