ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల నుండి ఎలా బైటపడాలని అంతర్జాతీయ సంస్థలు, దేశాలు, రాష్టాలు, ప్రభుత్వాలు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ ఒక్కరూ కృషిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంక్షోభ సమయంలో కొన్ని అవాస్తవమైన మెసేజ్ లు ప్రజలను మరింత మానసిక ఒత్తడికి గురిచేస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఒక ఫేక్ మెసేజ్ నెట్టింటి నుంచి మన నట్టింటికి వచ్చి కలకలం సృష్టిస్తోంది. మాజీ అడిషనల్ డిజిపి వి.వి.లక్ష్మీనారాయణ, ఐపిఎస్ గారు మాట్లాడినట్లుగా ఒక ఫేక్ మెసేజ్ బాగా వైరల్ అయింది. కరోనాపైన వచ్చిన ఈ అవాస్తవమైన మెసేజ్ ని ఖండిస్తూ లక్ష్మీనారాయణగారు ఒక వీడియో ద్వారా ఆ ఆడియో అవాస్తవమని, అందులో వినిపిస్తున్న గొంతు తనదికాదని ఆ ఆడియోతో తనకెటువంటి సంబంధంలేదని తెలియజేశారు . ఇలాంటి అవాస్తవ మెసేజెస్ వల్ల తనకు చాలా కాల్స్ రావటం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు.
ఈ కరోనా సమయంలో వాస్తవానికంటే అవాస్తవ మెసేజస్ ఎక్కువగా ప్రచారం జరగటం చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రజలు కూడా తమకు వచ్చిన ప్రతి మెసేజ్ ని వెంటనే మరొకరికి పంపించి అవాస్తవాన్ని ప్రచారం చేయకుండా వుండాలి. నిజానిజాలు తెలియని మెసేజస్ ని మరొకరికి పంపకూడదు..ఇలా చేసినవారు చట్టరీత్యా శిక్షార్హులు..దయచేసి ఈసమయంలో మనం ప్రభుత్వాలననుసరించి కరోనాపై పోరాడదాం..కరోనాను తరిమికొడదాం,మానవత్వాన్ని చాటుకుందాం..జై భారత్ .
