‘నువ్వు నంద అయితే నేను బద్రి.. బద్రీనాథ్‌’ అంటూ పవన్‌కల్యాణ్‌ ఛాలెంజ్‌ చేసే డైలాగ్‌కు ఇరవై ఏళ్ల క్రితం థియేటర్లు విజిల్స్‌తో మారుమ్రోగాయి. కేర్‌లెస్‌ ఆటిట్యూడ్‌తో కూడిన పవన్‌ మేనరిజమ్స్‌, పూరి జగన్నాథ్‌ స్టైలిష్‌ టేకింగ్‌, రమణ గోగుల పాటలు..వెరసి బద్రి సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే పూరి జగన్నాథ్‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. పవర్‌స్టార్‌గా పవన్‌కల్యాణ్‌ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయేలా చేసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి సోమవారం నాటితో ఇరవై ఏండ్లు అవుతోంది.

దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కు ‘బద్రి’ తొలి సినిమా. అంతకుముందు సినిమాలపై మక్కువతో హైదరాబాద్‌ వచ్చిన పూరి జగన్నాథ్‌ ఎన్నో సినీ కష్టాలు పడ్డారు. ఉత్తేజ్‌ ద్వారా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మతో పూరి జగన్నాథ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ‘శివ’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకొని జోరుమీదున్నారు వర్మ. శివ సినిమాను హిందీలో రీమేక్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. హిందీ శివకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశాన్ని ఇప్పించమని వర్మను అడిగారు పూరి జగన్నాథ్‌. అప్పటికే తన దగ్గర అసిస్టెంట్స్‌ చాలామంది ఉండటంతో వర్మ అతడికి నటుడిగా అవకాశం ఇచ్చారు. నాగార్జునతో ఉండే రౌడీ బ్యాచ్‌లో ఒకరిగా పూరి జగన్నాథ్‌ తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ

తర్వాత కృష్ణవంశీతో ఏర్పడిన పరిచయం పూరి జగన్నాథ్‌ జీవితాన్ని మలుపుతిప్పింది. అతడి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తూనే గులాబీ సినిమాకు మేకింగ్‌ వీడియోలు రూపొందించారు. అవి పూరికి మంచి పేరుతెచ్చిపెట్టాయి. ఒకవైపు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూనే మరోవైపు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. వాటి ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసంతో దర్శకుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ఆలోచనతో సూపర్‌స్టార్‌ కృష్ణకు థిల్లానా అనే కథ చెప్పి ఒప్పించారు. ముహూర్తం జరుపుకున్న తర్వాత ఆర్థిక సమస్యలతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత సుమన్‌తో మొదలుపెట్టిన మరో సినిమాకు షూటింగ్‌ మొదలవ్వకముందే ప్యాకప్‌ పడింది. మూడో ప్రయత్నం చేజారి పోకూడదని త్రీవంగా ప్రయత్నించారు.

సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు విజయాలతో యువతరం ఆరాధ్యనాయకుడిగా మారిపోయారు పవన్‌కల్యాణ్‌. అతడితో సినిమా చేయాలని పూరి జగన్నాథ్‌ సంకల్పించారు. పవన్‌కల్యాణ్‌ను కలిసేందుకు కెమెరామెన్‌ ఛోటా కె నాయుడు సహాయాన్ని అడిగారు. తనకు కథ నచ్చితేనే పవన్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తానని పూరితో ఛోటా కె.నాయుడు చెప్పారు. బద్రి కథ చెబితే ఛోటా కె.నాయుడు తిరస్కరిస్తాడనే భయంతో పూరి అతడికి ఇట్లు శ్రావణిసుబ్రహ్మణ్యం కథ చెప్పి ఒప్పించారు. అలా ఛోటా కె.నాయుడు ద్వారా పవన్‌కల్యాణ్‌ను కలిసిన పూరి జగన్నాథ్‌ సింగిల్‌ టేకింగ్‌లోనే పవన్‌కు బద్రి కథను చెప్పి ఒప్పించారు. ైక్లెమాక్స్‌లో మార్పులు చేయమని పవన్‌కల్యాణ్‌..పూరికి సూచించారు. పూరి మాత్రం అందుకు అంగీకరించలేదు. కథపై పూరి జగన్నాథ్‌కు ఉన్న నమ్మకం చూసి పవన్‌ సినిమా చేయడానికి అంగీకరించారు. త్రివిక్రమరావు ఈ సినిమాను నిర్మించారు.

చెలి టైటిల్‌అనుకొని..

పవన్‌కల్యాణ్‌ రేణుదేశాయ్‌ పరిచయానికి ఈ సినిమానే నాందిగా నిలిచింది. ఈ సినిమాతో రేణు దేశాయ్‌ కథానాయికగా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యింది. మోడలింగ్‌లో రంగంలో బిజీగా ఆమెను వెతుక్కుంటూ ముంబాయి వెళ్లి ఈ సినిమా కథ చెప్పి ఒప్పించాడు పూరి జగన్నాథ్‌. కహోనా ప్యార్‌ హై లాంటి సంచలన విజయం తర్వాత అమీషాపటేల్‌ నటించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు పూరి జగన్నాథ్‌ చెలి అనే టైటిల్‌ పెట్టాలని అనుకున్నారట. కానీ హీరో పేరు బద్రి కావడంతో ఆ పేరునే టైటిల్‌గా నిర్ణయించారు.

47 కేంద్రాల్లో శతదినోత్సవం

బద్రి(పవన్‌కల్యాణ్‌) ఓ యాడ్‌ ఏజెన్సీ డైరెక్టర్‌. అతడి అమ్మనాన్నలు విదేశాల్లో నివసిస్తుంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్‌ వెన్నెల(రేణుదేశాయ్‌) బద్రిని ప్రాణప్రదంగా ప్రేమిస్తుంటుంది. బద్రికి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. బద్రి ప్రేమలో ఆమెకు నిజాయితీ కనిపించదు. ఎవరైన అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆమెను తనకంటే ఎక్కువగా అతడిని ప్రేమించేలా చేయమని బద్రితో వెన్నెల పందెం కాస్తుంది. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన బద్రి సరయు(అమీషాపటేల్‌)ను ప్రేమిస్తాడు. సరయు అన్న నంద(ప్రకాష్‌రాజ్‌) వారి ప్రేమఅడ్డుపడతాడు.

బద్రి అతడిని ఎలా ఎదురించాడు? వెన్నెల బద్రితో పందెం కాయడానికి కారణమేమిటి? బద్రి, సరయు ఎలా ఒక్కటయ్యారన్నదే మిగతా కథ. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఊహించినట్లుగానే పెద్ద విజయాన్ని సాధించింది. నలభై ఏడు కేంద్రాల్లో వంద రోజుల్ని పూరిచేసుకున్నది. హే చికితా, బంగాళాఖాతంలో, ఐ యామ్‌ ఎన్‌ ఇండియన్‌ లాంటి రమణగోగుల స్వరపరచిన పాటలు ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఈసినిమాతో పూరి జగన్నాథ్‌ దర్శకుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు. ఈ సినిమాతోనే పవన్‌కల్యాణ్‌ను అభిమానులు పవర్‌స్టార్‌ అంటూ పిలవడం మొదలుపెట్టారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments