- లాక్డౌన్ – కేంద్ర మార్గదర్శకాలే ఎజెండా!..
- ఆర్థిక స్థితిగతులపైనా చర్చించే అవకాశం
వైరస్ వ్యాప్తి నివారణకు సుదీర్ఘంగా లాక్డౌన్ అమలుచేస్తున్న క్రమంలో రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 19 న సమావేశం కానున్నది. రెండోవిడుత ప్రకటించిన లాక్డౌన్ అమలుతోపాటు, కేంద్రం తాజాగా విడుదలచేసిన మార్గదర్శకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మంత్రిమండలి చర్చించే అవకాశం ఉన్నది. కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే, ఈ నెల 20 నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీచేసిన విషయంతెలిసిందే. కేంద్రం మార్గదర్శకాలను అమలుచేస్తే పరిస్థితి ఏమిటి? పర్యవసానాలు ఎలా ఉంటాయి? వాటిని అమలుచేయాలా? లేక ముందుగా ప్రకటించినట్లు పూర్తి లాక్‌డౌన్‌ను కొనసాగించాలా అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతుంది.
వైరస్ కట్టడిలో ముందు వరుసలో..
రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై యుద్ధమే చేస్తున్నది. మార్చి రెండోవారం నుంచే తెలంగాణలో వైరస్ నివారణ చర్యలు చేపట్టింది. అన్ని రాష్ర్టాల కంటే ముందుగా చర్యలకు ఉపక్రమించి వైద్యచికిత్సలు అందించడానికి దవాఖానలను సిద్ధంచేసింది. ఇందుకోసం నిధులనూ కేటాయించింది. ప్రజలు సామూహికంగా గుమిగూడే అవకాశాలున్న సినిమాహాళ్లు, షాపింగ్మాళ్లను మూసివేసింది. ప్రార్థనామందిరాలు, ఆలయాలకు ప్రజలు వెళ్లడాన్ని నిషేధించింది. దశలవారీగా నిబంధనలను కఠినతరంచేసుకొంటూ దేశంలోనే ముందుగా లాక్‌డౌన్‌కు వెళ్లింది. ఈ రకంగా వైరస్ వ్యాప్తి తీవ్రతకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేయగలిగింది. ప్రస్తుతం మర్కజ్ కాంటాక్ట్ కేసులు మినహా ఇతరకేసులు రావడంలేదు. అయినప్పటికీ వైరస్వ్యాప్తి ఆగుతుందని భావించడంలేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్.. లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన ఆవశ్యకతను దేశానికి ముందుగా తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఆ తర్వాత కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తించి కట్టడి తీవ్రతరంచేశారు.
ఆదాయ మార్గాలేమిటి?
మార్చి 22 నుంచి లాక్డౌన్ అమలువల్ల.. దాదాపు 23 రోజులుగా రాష్ర్టానికి నయాపైసా ఆదాయం లేదు.. దేశమంతటా ఆదాయంలేక విలవిల్లాడుతున్న క్రమంలో రాష్ర్టాలను ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావాలి. నగదు చలామణి అయ్యేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకోసం హెలికాప్టర్ మనీ విధానాన్ని అమలుచేయాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. లాక్డౌన్ నేపథ్యంలో అన్ని వ్యాపారాలు, పరిశ్రమలు మూతపడిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ‘చీకట్లో చిరుదీపం’లా వ్యవసాయరంగం అద్భుత ప్రగతిని సాధించింది. ఈ పరిస్థితుల్లో రాష్ర్టాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్నదానిపై లోతుగా చర్చించి పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాల్సి ఉన్నది. ఆదివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆర్థికపరంగా అన్ని అంశాలపై లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.
సడలింపులు ఇస్తే ఎలా?
ఏప్రిల్ 20 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను యథాతథంగా అమలుచేస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లమీదకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కరోనా వ్యాపిస్తే దాన్ని కట్టడిచేయడం ఎలాసాధ్యపడుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ మార్గదర్శకాలపై నెలకొన్న సందేహాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్.. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. తాము ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదలచేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. క్యాబినెట్ భేటీలో ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.