మగువ , ఈ పదం లో సకల సృష్టి సారాంశం ఉంది . ప్రతీ మనిషి జీవితంలో ఒక తల్లిగా , చెల్లిగా , భార్యగా కూతురిగా తనవంతు భాద్యత అద్భుతంగా పోషిస్తుంది మగువ . పురుషుడు శారీరకంగా సామర్ధ్యం కలిగి ఉన్నా , మానసిక పరంగా మాత్రం స్త్రీ మాత్రమే దృఢంగా నిలబడగలుగుతుంది . అన్నిటికీ మించి స్త్రీకి సహనం చాలా ఎక్కువ , అందువలనే వారి ఆలోచనలు కూడా అంతే బలంగా ఉంటాయి . వారు ఏ రంగంలోనైనా పురుషుడి కంటే గొప్పగా ఎదుగుతారు . వారిని చూసి పురుష జాతి మొత్తం నేర్చుకోవాలి , వారికెప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండడం పురుషుడి బాధ్యత . స్త్రీ ఎంతటి సహనానికి చిహ్నమో , ఉగ్ర రూపం దాలిస్తే అంతే భయంకరంగా ఆదిపరాశక్తిలా తయారవుతుంది .

ఎంత గొప్ప వ్యక్తి అయినా , చివరికి ఆ దేవుడైనా ఒక స్త్రీ ద్వారానే ఈ లోకానికి పరిచయం అవుతాడు . మరి అటువంటి మహిళపై ఈ నవీన యుగంలో కూడా చూపిస్తున్న వివక్షత , వారిపై జరుగుతున్న అకృత్యాలు చూస్తుంటే సకల మానవాళి కూడా సిగ్గు పడే పరిస్థితిలో ఉన్నాం . ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పటికైనా అందరిని మానసిక స్థితులలో మార్పు వచ్చి మహిళలు సరైన గౌరవం , స్థానం , వారికి కావాలసిన సపోర్ట్ ను అందిద్దాం .

ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు చిత్ర బృందం . ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు . ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు . రెండు రోజుల క్రితం ఈ పాట ప్రోమో విడుదలై విపరీతంగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే . ఈ సినిమా కథ మొత్తం ఒక స్త్రీ చుట్టూనే తిరుగుతుంది . “మగువా ఓ మగువా ” అంటూ సాగే పాట కొద్దిసేపటి క్రితం విడుదలై అందరిని ఆలోచింపజేస్తూ స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తోంది .

“మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
అటు ఇటు అన్నింటా నువ్వేలే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయటా
అలుపని రవ్వంత అననే అనవంటా వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా”

మహిళలను ఎలా ఈ జగత్తు గుర్తిస్తోంది , అసలు మహిళకు ఉన్న లక్షణాలు ఏంటి అనేవి ఈ పల్లవిలో అద్భుతంగా తెలియజేశారు రామజోగయ్య శాస్త్రి గారు . స్త్రీ యొక్క సహనానికి హద్దులే లేవని , అన్ని రంగాలలలో స్త్రీలు చాలా ముందు ఉన్నారని , ఇటు ఇంట్లోనూ , బయట తన ఉద్యోగంలోనూ మహిళ ఎప్పుడు రాణిస్తూ ఉంటుందని , ఎక్కడ కూడా కొంచెం కూడా అలసట అనే మాట లేకుండా తాను ఏ రంగంలో ఉన్నా తన యొక్క గొప్ప తనాన్ని చాటి ఆ రంగంలో అందరికీ ఒక మార్గదర్శిగా నిలుస్తుందని , అటువంటి మహిళా యొక్క గొప్పతనం ఈ లోకంలోని మనుషులు గుర్తించకుండా మహిళలపై అనేక రకాలైన అకృత్యాలకు పాల్పడుతున్నారని ఈ పల్లవి సారాంశం .

“నీ కాటుక కనులు విప్పారాకపోతే ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా
ప్రతి వరుసలోనూ ప్రేమగా అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమ అంచనాలకందుమా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా
నీవులేని జగతిలో దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మొగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరునువ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా “

మహిళ యొక్క గొప్పతనాన్ని , ప్రతి పురుషుడు మహిళా నుండి ఏమి నేర్చుకోవాలి అన్న విషయాన్ని చక్కగా తెలియజేశారు రామజోగయ్య శాస్త్రి గారు . సామాన్యంగా మహిళలు ఇంట్లో ఉన్న అందరికంటే ముందే నిద్ర లేచి తన పనులు మొదలుపెడతారు . అదే విషయాన్ని కాటుక కనులు విప్పరాక పోతే ఈ భూమికి తెలవారదుగా అనే లైన్ ద్వారా తెలియజేశారు శాస్త్రి గారు . అంటే స్త్రీ మెళుకువతోనే ఈ భూమి మేలుకుంటుంది అని అర్ధం . మహిళ ఎటువంటి పనులు చేయకపోతే పనులు సరైన రీతిలో సాగవు . అదే విషయాన్ని నీ గాజుల చేయి కదలాడకాపోతే ఏ మనుగడ కొనసాదుగా అనే లైన్ ద్వారా తెలియజేశారు శాస్త్రి గారు .

“ప్రతి వరుసలోనూ ప్రేమగా అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమ అంచనాలకందుమా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా
నీవులేని జగతిలో దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరునువ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా “

సామాన్యంగా స్త్రీ కి ఎవరి పట్ల వివక్షత ఉండదు . ఎటువంటి వారినైనా ఆదరిస్తుంది . కుటుంబంలో అందరితో కలిసిపోతూ , అందరిని ఆనందింపజేస్తుంది . తల్లిగా గాని , భార్యగా గాని , అత్తగా గాని , ఎటువంటి వరుసలో అయినా ఆమె ప్రేమను పంచుతూనే ఉంటుంది . అందుకనే ఎవరైనా అడిగితే అమ్మమ్మ ఇల్లు , నానమ్మ ఇల్లు అంటూ ఉంటాం . స్త్రీలు తమ ప్రేమ ద్వారా అందరిని కట్టిపడేస్తారు . ఇప్పుడు నవీన కాలంలో స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు , రోజూ విధులు ముగించుకొని ఇంటికి చేరిన తరువాత ఇంటి పనులలో నిమగ్నమవుతారు , వారి ప్రతి రోజూ చేసే శ్రమకు ఎటువంటి కొలమానం లేదు , అంచనాలకు అందదు . స్త్రీ అనేది ఆది శక్తీ స్వరూపం ఎంత ప్రేమగా ఉంటుందో , మందలించడంలో ఆది శక్తీ స్వరూపంగా మారిపోతుంది . స్త్రీ లేని జగత్తు ప్రకాశవంతంగా ఉండదు అందుకే ఇంటికి ఆడపిల్ల అందం . స్త్రీ ఉన్న సమాజం ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది . ఎవరినైనా లాలించడంలో , ఇంటిని చక్కదిద్ది అన్ని రకాలుగా ఇంటిని నిర్వహించంలో ప్రతి పురుషుడు పసివాడిలా మారి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి . ఇంట్లో ఉండి ఆడవారు చేసే శ్రమ కంటే పురుషుడు బయట చేసే శ్రమ శ్రమే కాదు , ఒక ఇంటిని తద్వారా సమాజాన్ని చక్కదిద్డడంలో స్త్రీ ఏ విధంగా వ్యవహరిస్తోంది అనే విషయాన్ని అనుసరిస్తే ప్రతి పురుషుడూ కూడా తమ జీవితంలో అద్భుతమైన విజయం సాధిస్తాడు . ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటూ చిరునవ్వు చిందించాలంటే ఆ ఇంటి వాతావరణం అతి ముఖ్యం . ఎటువంటి సమస్యలు ఎదురైనా సమయస్ఫూర్తితో ఆ సమస్యలను నివారించి ఇంటిని ప్రశాంత వాతావరణంలో ఉంచి అందరిని ముఖాలపై అనడానికి కారణం అవుతుంది స్త్రీ . అదే ఈ చరణం యొక్క సారాంశం .

ఏదో ఒక్క రోజు స్త్రీలను ఆరాధించి వారికి కానుకలు అందించి మిగతా రోజులు వారిపై అధికారం చెలాయించడం కాదు , ఎప్పటికీ వారు తమ వారి కోసం చేసే త్యాగాన్ని గుర్తించి వారికి అన్ని రకాలుగా సహకరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి . ఇప్పటికైనా స్త్రీ యొక్క విలువ తెలుసుకొని వారిపై జరుగుతున్న దారుణాలు తగ్గుముఖం పట్టాలని కోరుకుందాం.

– ఎస్ ఏ టీ శ్రీనాధ్

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments