మ్యూజిక్ లో ఒక మ్యాజిక్ ఉంటుంది . ఎటువంటి వారి మూడ్ నైనా చిటికెలో మార్చే శక్తి సంగీతానికి ఉంటుంది, అందుకనే ఎక్కువ పాటలు వినేవాళ్ళు చాలా వరకు ప్రశాంతంగా కనిపిస్తారు . సంగీతంలో అతి ముఖ్య పాత్ర గాత్రానిది , గాత్రం ఎంత మధురంగా ,శ్రావ్యంగా ఉంటే శ్రోత అంత హాయిని అనుభవిస్తాడు . అలనాటి ఘంటసాల మాస్టారు నుండి ఈనాటి యువతరం గాయకులు వరకూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గాత్రం కలిగిన గాయకులు అనేకమంది ఉన్నారు . అటువంటి గాయకులతో ప్రధమ వరుసలో ఉండే వారిలో మన ఎన్ .సి . కారుణ్య ఒకరు .

01,మార్చి , 1986 న ఒక సంప్రదాయ సంగీత కుటుంబంలో పుట్టిన కారుణ్య చిన్ననాటి నుండే తనకు సంగీతం మీద ఉన్న మక్కువతో అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు . గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు నిర్వహిస్తున్న పాడుతా తీయగా నుండి మొదలు పెట్టి దేశం మొత్తం ఆదరించే ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో రన్నర్ అప్ స్థాయికి ఎదిగారు కారుణ్య . ఆ కార్యక్రమం తరువాత తెలుగు , హిందీ , తమిళ్ , కన్నడ , బెంగాలీ బాషలలో కొన్ని వందల పాటలు పాడారు . అంతే కాక కొన్ని మ్యూజిక్ రియాలిటీ షోస్ కు హోస్ట్ గా వ్యవహరించారు కారుణ్య . ఆయన తెలుగులో పాడిన “ఏకాంతంగా ఉన్నా” , “ఓరుగల్లుకే పిల్లా ” , “123 నేనొక కంతిరీ ” , “ఓం నమో శివ రుద్రాయ ” , “వయ్యారాల జాబిల్లి ” మొదలు పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి .

“మిలే సుర్ మేర తుమహారా” అనే పాట అందరికీ తెలిసే ఉంటుంది . భారత దేశంలోని వివిధ ప్రాంతాలను , ఆచారాలను , భాషలను ప్రతిబింబిస్తుంది ఈ పాట . అటువంటి ఆ పాట రీమేక్ లో పాలుపంచుచున్న అతి చిన్న వయస్కుడు కారుణ్య అవ్వడం విశేషం . 2010 రిపబ్లిక్ డే కి జూమ్ టీవీ ద్వారా ఈ పాట విడుదలయ్యింది . అంతే కాక ఆయన అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు . 2008 లో ఆయన తన మొదటి హిందీ ఆల్బం విడుదల చేశారు .

మరి ఇంతటి ప్రతిభావంతుడుకి అవార్డులు దాసోహం అనకుండా ఎలా ఉంటాయి . మేలుకొలుపు అనే టెలీ సీరియల్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నంది అవార్డు అందుకున్నారు . చిరుత సినిమాకి బెస్ట్ ప్లేబాక్ సింగర్ గా సంతోషం ఫిలిం అవార్డు , సిడ్నీ నగరం అన్న పాటకు 92. 7 BIG FM “బెస్ట్ మేల్ ప్లేబాక్ సింగర్ అఫ్ ది ఇయర్ ” అవార్డు మొదలైనవి ఎన్నో అవార్డులు అందుకున్నారు . అంతే కాక న్యూయార్క్ లో శశి ధరూర్ గారి చేతుల మీదుగా “యంగ్ రైసింగ్ స్టార్ అఫ్ ఇండియా ” , డల్లాస్ లో IANT వారి చేతులమీదుగా “వన్ అఫ్ ఏతే రేర్ టాలెంట్స్ అఫ్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ” వంటి ప్రతిష్ఠాత్మయికమైన అవార్డు . అసలు ఇంతటి ప్రతిభావంతుడికి ఎంతటి పురస్కారాలు ఇచ్చినా తక్కువే .

ప్రతిభావంతులు ఎటువంటి అవకాశం వచ్చినా వదులుకోరు , ప్రతి ఒక్క విషయాన్ని ఒక సదావకాశంగా మలుచుకొని తానేంటో నిరూపిస్తుంటారు . 2017 లో తానే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు కారుణ్య . ఇందులో పాటలకు తాను సంగీతం చేయడమే కాక తనలో ఉన్న ఒక రైటర్ ను ఆవిష్కరించారు . ఆయన ఛానల్ ద్వారా విడుదలైన “ఓ ప్రియతమా ” అనే పాట సంగీత , సాహిత్య ప్రియులను ఆకట్టుకుంది . ఆయన ఈ పాటలు గురుంచి టీవీ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తాను తన 14 ఏళ్ళ వయసులోనే ఈ పాటలు రాశానని , ఇప్పటికి ఈ విధంగా తీసుకురావడం జరిగిందన్నారు . మరి అంత చిన్న వయసులో అంత భావుకతతో కూడిన సాహిత్యం రాయడం అంటే మామూలు విషయం కాదు . ఓ ప్రియతమా నుండి మొదలు పెట్టి దాని తరువాత అనేక పాటలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందించారు కారుణ్య . ఆయన ఇటీవల విడుదల చేసిన సమజవరాగమనా మాష్ అప్ సంగీత ప్రియులందరినీ కట్టి పడేసింది .

ఒక సాధకుడు అన్నవాడు ప్రతిక్షణం సాధన చేస్తూ నేర్చుకుంటూనే ఉంటారు . అటు సినీ సంగీతం తో పాటు సంప్రదాయ సంగీతం పై ఉన్న మక్కువతో ఆయన తన సమయాన్నంతా సంప్రదాయ సంగీత సాధనకు వెచ్చిస్తున్నారు . ఆయన సినిమాలలో పాడిన పాటలు తక్కువే అయినప్పటికీ అనేక మ్యూజిక్ రియాలిటీ షోస్ లో పాల్గొంటూ తన గాన మాధుర్యంలో సంగీత ప్రియులని కట్టి పడేస్తున్నారు . కొన్ని పాటలు వింటుంటే ఇది కేవలం కారుణ్య మాత్రమే పాడగలరు అనడంలో అతిశయోక్తి లేదు .

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా కారుణ్య మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని , భవిష్యత్తులో మరింతగా సంగీత , సాహిత్యాభిలాషులను ఆనందింప జేయాలని ఆశిస్తున్నాము .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments