మనిషి జీవితంపై ఎంతో మోహం, అనురాగం, అనుబంధం ఉంటాయి. వాటిని చేధించడం అంత సులభం కాదు. అవి ఎంత బలమైన బంధాలంటే.. వాటి నుంచి మానవుడిని బయటపడేయడానికి దేవుడు కూడా కష్టపడాల్సిందే. ఎందుకంటే.. అర్జునుడిని మోహనిద్ర నుంచి మేలుకొలపడానికి దేవుడైన కృష్ణుడే ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
చెలికాడు, శిష్యుడు, బావమరిది అయిన అర్జునుడికి తాను కృష్ణదాసుడినని తెలుసుకోవడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా.. పద్దెనిమిది అధ్యాయాలు, ఏడువందల శ్లోకాలతో కూడిన గీతను చెబితే కానీ .. అర్జునుడు మేలుకోలేదు . అప్పటికి కానీ .. చిట్టచివరికి ‘ఓ అచ్యుతా ! నువ్వు చెప్పినట్లే చేస్తాను’ అన్న సమాధానం కిరీటి నోటి వెంట రాలేదు .
కానీ భగవంతుడు మాత్రం తన భక్తుల కోసం ఎంత కష్టమైనా భరిస్తాడు . ఓ భక్త శిఖామణి కోసం ఉడుపిలోని బాలకృష్ణుడు తన దిశను మార్చుకుని , కనకదాసు దశను మార్చాడు . క్షణంలో భక్తుడికి మోక్షం ప్రసాదించాడు .
పురందరదాసు శ్రీకృష్ణ దేవరాయల రాజధాని హంపీ క్షేత్రంలో తన కీర్తనలు వినిపించి ఈనాటికీ సంప్రదాయ భక్తి సంగీతపు మెరుపులు కురిపిస్తున్నాడు . బద్ధ జీవులను భక్తి సేవలతో తన అక్కున చేర్చుకోవడానికి భగవంతుడు సర్వదా సిద్ధంగా ఉంటాడు .