కొన్ని పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటాయి . ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు . ఇందులో ముఖ్య భూమిక సాహిత్యం పోషిస్తుంది . సాహిత్యంతో పాటు మంచి సంగీతం తోడైతే ఆ హాయే వేరు . ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా ” . ఇప్పటికే ఈ చిత్రంలోని “నీలి నీలి ఆకాశం” అనే పాట విడుదలై అన్ని వర్గాల ప్రేక్షుకులని విపరీతంగా మైమరిపిస్తోంది . ఈ పాటకి చంద్రబోస్ గారు అందించిన సాహిత్యానికి ఆయన చెప్పినట్టుగానే దానికి మారుగా బహుమానం ఏమిచ్చినా సరిపోదు .

ఈరోజు ఈ చిత్రంలోని ఇంకొక పాట విడుదలై మంచి ఆదరణ పొందుతోంది . ఈ పాటకు కూడా చంద్రబోస్ గారు సాహిత్యాన్ని అందించారు . మొదటి పాటలో ప్రేమ గురించి చెప్పగా ఈ పాటలో స్నేహం గురించి తెలియజేశారు చంద్రబోస్ గారు . ఈ పాట ద్వారా అసలైన స్నేహానికి నిర్వచనం తెలుపుతూ స్నేహంలో ఉన్న పవిత్రతని చాలా సరళంగా తెలియజేశారు చంద్రబోస్ గారు .

ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం

కనివిని ఎరగని స్నేహం
ఇది కాలం చూడని స్నేహం
దేహం అడగని స్నేహం
ఇది హృదయం అడిగే స్నేహం
నింగిని నేలని వానచినుకై కలిపెను స్నేహం
తూర్పుకి పడమరకి కాంతితోరణమయ్యింది స్నేహం

జీవితంలో చాలా మంది స్నేహితులు ఉంటారు . కానీ కొంతమందితోనే విడదీయలేని బంధం ఏర్పడుతుంది . అమ్మా నాన్నలతో కూడా పంచుకోలేని విషయాలని వారితో పంచుకోగలుగుతాం .

కొంతమంది స్నేహితులను చూస్తూ ఉంటే ఇంత గొప్ప స్నేహితులు ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది . మనకి ఇటువంటి స్నేహితులు లేరే అని కొంత అసూయ కూడా కలుగుతుంది . అదే విషయాన్ని చంద్రబోస్ గారు ఈ పంక్తిలోని మొదటి రెండు లైన్ల ద్వారా తెలియజేశారు . ఇంత గొప్ప స్నేహం ఇప్పటివరకూ ఎవరూ చూడలేదనేది ఇందులోని అర్ధం . కొంతమంది ఎదుటివారి డబ్బుకు కానీ అందానికి కానీ లోబడి వారితో స్నేహం చేస్తుంటారు . ఇటువంటి స్నేహాలు స్వార్ధంతో కూడుకున్నవి తప్ప ఎటువంటి నిజాయితీ ఉండదు , అటువంటి స్నేహాలు ఎక్కువ కాలం నిలబడవు . అదే విషయాన్ని ఇక్కడ ” దేహం అడగని స్నేహం
ఇది హృదయం అడిగే స్నేహం” అనే లైన్ ద్వారా తెలియజేశారు చంద్రబోస్ గారు . దేహం అడగడం అంటే ఇక్కడ ఎదుటి వారు అందంగా ఉన్నారా లేదా అని అర్ధం అలా కాకుండా ఎదుటివారి రూపంలో ఎలా ఉన్నా కానీ తమ మనస్సుతో బంధం ఏర్పరుచుకోవాలి అని ఇందులోని భావం . సాధారణంగా స్నేహితులు చాలా వరకూ ఒకే చోట పుట్టి ఉండరు . కొన్ని సందర్భాలలో కలిసినప్పుడు స్నేహం ఏర్పడి అది విడదీయలేనట్టుగా ఆ బంధం ఏర్పడుతుంది అదే విషయాన్ని ఇక్కడ చంద్రబోస్ గారు తెలియజేశారు . “నింగిని నేలని వానచినుకై కలిపెను స్నేహం
తూర్పుకి పడమరకి కాంతితోరణమయ్యింది స్నేహం ” . ఇక్కడ స్నేహం అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు చంద్రబోస్ గారు . ఇక్కడ నింగికి , నేలకి మధ్య వాన చినుకు స్నేహం ఏర్పరుస్తుందని , అలాగే తూర్పుకి , పడమరకు కాంతి తోరణం అంటే ఇంద్రధనుస్సు స్నేహం ఏర్పరుస్తుంది అనేది భావం . అంటే ఆ స్నేహంలో ఎంత స్వచ్ఛత దాగి ఉంటుందో ఇక్కడ కథానాయకుడు , కథానాయకి మధ్య ఏర్పడిన స్నేహం అంత స్వచ్ఛమైనది అర్ధం .

“మీ మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి
మీ పాదం తాకాలంటూ అలలయ్యింది ఆ కడలి
తన మచ్చను మీ స్వచ్చతతో కడగాలంది జాబిల్లి
మీ భారం మోసేటందుకె పుట్టానంది ఈ పుడమి
ఆశలు ఆకర్షణలు లేనిదే మీ ఆడ మగ స్నేహం
నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం “

కొంతమంది స్నేహితులను చూస్తుంటే అరె ఇటువంటి స్నేహితులు మన జీవితంలో తారసపడలేదే అనిపిస్తూ ఉంటుంది , వారి మధ్య ఎటువంటి అసూయ కానీ , కల్మషం కానీ ఉండవు . ఎటువంటి అవాంతరాలు వచ్చినా వారి మధ్య బంధం మాత్రం అలాగే ఉంటుంది . అదే విషయాన్ని ఈ పంక్తిలో చాలా గొప్పగా తెలియజేశారు చంద్రబోస్ గారు . నిజమైన స్నేహితుల మధ్య ఎటువంటి అసూయ ఉండదు , అటువంటి స్నేహితుల మధ్య చిరుగాలి తనకు చోటు ఇవ్వవలసినదిగా బతిమాలడం అని చెప్పడం చంద్రబోస్ గారి ఊహాశక్తి కి నిదర్శనం . సామాన్యంగా గొప్ప వారి కాళ్ళకు నమస్కరించి వారి పై ఉన్న అమితమైన గౌరవాన్ని వ్యక్తపరుస్తాం . ఇక్కడ కడలి అలలుగా మారి పాదం తాకడం అంటే వారి స్నేహం చూసి వారి పాదాలను ఎలాగైనా తాకి పునీతం కావాలని అలలుగా మారిందని అర్ధం , అంటే వారి స్నేహం ఎంత గొప్పదో అర్థంచేసుకోవచ్చు . జాబిల్లి అంటే చాలా వెలుగునిచ్చేదే కాక స్వచ్ఛతకు నిదర్శనం . అటువంటి చంద్రుడిలో కూడా కొన్ని మచ్చలు ఉంటాయి , అటువంటి చంద్రుడే ఈ ఇద్దరి మధ్యన ఉండే స్వచ్ఛతను చూసి ఆ స్వచ్ఛత ద్వారా తనలో ఉన్న మచ్చను తుడిచి వేసి తనను కూడా ఇంకా స్వచ్ఛంగా చేసుకోవాలని కోరుకునే అంత గొప్పగా వారి మధ్యన స్నేహం ఉందని , ఎంతో శ్రేష్టమైన భూమి ఆ స్నేహితులను మోస్తూ ఎంతో పులకరించిపోతూ తమను మోయటానికే తాను పుట్టినట్టుగా భావించడం వంటి ఉపమానాలు చూస్తూ ఉంటే ఇంతకంటే గొప్పగా చంద్రబోస్ గారు తప్ప ఎవరూ తెలియచేయలేరేమో అనిపిస్తోంది . సామాన్యంగా ఆడ , మగ మధ్య ఆకర్షణలు , అనేక రకాల ఆశలు ఉంటాయి , అటువంటి ఆకర్షణలు లేని స్నేహం కథానాయకుడు , కథానాయకి మధ్య ఉందనేది దీని అర్ధం . సామాన్యంగా రెండు దగ్గర మనస్థత్వాల మధ్యనే దృఢమైన స్నేహం ఏర్పడుతుంది , ఎదుటి వారిలో తనను చూసుకుంటూ ఉంటారు, ఎదుటి వ్యక్తి నుండి మనం ఏది ఆశించనప్పుడే వారితో మనసు విప్పి మాట్లాడగలం,
అలాంటి స్నేహమే వీరి మధ్య కూడా ఉందని చంద్రబోస్ గారు తెలియజేశారు .

“తన చూపులు నువ్వు చూస్తుంటే నీ కలలను తను కంటోంది
తన మాటలు నువ్వంటుంటే నీ నవ్వులు తను నవ్వింది
తను అడుగులు వేస్తూ ఉంటే గమ్యం నువ్వే చేరేవు
నీలో నువ్వు చెయ్యని పనులే నీలా తానే చేసెను
జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం
దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం “

ఒకే రకంగా ఆలోచించినప్పుడే ఇద్దరు వ్యక్తులు విడదీయలేనంత దగ్గరవుతారు . అదే విషయాన్ని మనకు మరింత అర్ధమయ్యే విధంగా , కథానాయకుడు , కధానయకి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడిందనేది తెలియజేశారు చంద్రబోస్ గారు . ఇద్దరు నిజమైన స్నేహితుల మధ్య ఏ విధంగా బంధం ఏర్పడుతుందంటే ఒకరి గెలుపుని ఇంకొకరూ వారి కంటే ఎక్కువగా ఆనందిస్తారు , బాధ కలిగినా కూడా వారు ఎల్లవేళలా తోడుంటారు ,ఎదుటి వారి ఇష్టా ఇష్టాలను తెలుసుకొని వారి కోసం ఎక్కువగా శ్రమిస్తారు . ఇక్కడ చంద్రబోస్ గారు రాసిన తీరు చూస్తుంటే వర్ణించటానికే పదాలు చాలడం లేదు . ఒకరి కలలు ఇంకొకరు తమదిగా భావించడం , ఒకరి గమ్యం చేరడంలో ఇంకొకరు తోడ్పడటం , ఒకరి ఆనందాన్ని ఇంకోకరు తమదిగా భావించడం వంటివి చూస్తే నిజమైన స్నేహం ఇలాగే ఉండాలి కదా అని అనిపిస్తోంది . ఎదుటి వ్యక్తి చెయ్యలేని పనులు తమవిగా భావిస్తూ స్నేహితులు చేస్తుంటారు , నీలో నువ్వు చెయ్యని పనులే నీలా తానే చేసెను . అటువంటి వారి స్నేహానికి అవధులు లేవని , ఎన్ని జన్మలైనా కూడా తనివితీరక మళ్ళీ మళ్ళీ జన్మించి స్నేహంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారనేది ఇందులోని భావం. సకల జీవరాసులను సృష్టించేవాడు భగవంతుడు , అటువంటి భగవంతుడే వీరి మధ్యన ఉండే స్నేహం చూసి మురిసిపోయాడని , అంత గొప్ప స్నేహం వీరి మధ్యన ఉందనేది భావం .

సామాన్యంగా చంద్రబోస్ గారు గొప్ప రచయత అని అందరికీ తెలుసు . కానీ ఆయన రచనల్లో బంధాల యొక్క గొప్పతనాన్ని , ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలి అనేది అద్భుతంగా తెలియజేస్తారు . ఆయన రచనలు చూస్తే చాలు ఎటువంటి పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులు వినాల్సిన అవసరం లేదు . అటువంటి ఆయన నుండి మరెన్నో ఆలోచింపజేసే రచనలు రావాలని ఆకాంక్షిస్తూ ఎదురుచూద్దాం .

– ఎస్ ఏ టి శ్రీనాధ్ , హైదరాబాద్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments