నితిన్ , రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం భీష్మ . షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని డబ్బింగ్ దశలో ఉంది ఈ చిత్రం . ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ మరియు ఒక పాట విడుదలై మంచి ఆదరణ పొందాయి . ఈ చిత్రానికి మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు . మొట్ట మొదటి సినిమా ఛలో తోటే ఆయన మంచి గుర్తింపు తెచ్చుకొని తందిరికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు మహతి స్వర సాగర్ . తండ్రి బాట లోనే నడుస్తూ మెలోడీ కి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ సంగీతం చేయడంతో సంగీత ప్రియులు ఆనందానికి హద్దులు లేవు .

అయితే ఈరోజు ఈ చిత్రంనుండి మరో పాట విడుదలై యూట్యూబ్ లో మంచి ఆదరణ పొందుతోంది . ఈ పాటను ప్రముఖ రచయత శ్రీమణి రాయగా అనురాగ్ కుల్కర్ణి ఈ పాటను ఆలపించారు . ఈ పాటను కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందించారు మహతి స్వర సాగర్ . ప్రేమికుడికి తన ప్రేయసి ఎదురైనప్పుడు , తన గురుంచి ఆలోచించినప్పుడు కలిగే ఆనందాన్ని , బాధని చక్కగా తెలియజేశారు శ్రీమణి .

నా కలలే నీ రూపంలో
ఎదురయ్యే నిజమా మాయ
ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే
నా మనసే నింగిని దాటి
ఎగిరెనులే నిజమా మాయ
ఈ క్షణమే అద్బుతమేదో జరిగెనులే

ప్రతీ వ్యక్తికి తమ జీవితంలో ఎదురయ్యే భాగస్వామి గురుంచి కొన్ని కలలు ఉంటాయి . సాధారణంగా ప్రతీ వ్యక్తికి ఎదో ఒక సందర్భంలో ఎదుటి మనిషిని చూసినప్పుడు తాము వెతికే భాగస్వామి తనేనని , తన కలలకు వాస్తవరూపం ఎదుటి వ్యక్తేనని ఊహించుకుంటారు . అంతేకాక ప్రేయసి పరోక్షంలోనూ , ప్రత్యక్షంలోనూ ఎన్నో ఊహల్లో తేలుతూ ఉంటారు . అంతే కాక తన జీవితంలో జరిగే అద్భుతం తన ప్రేయసి కలవడమేనని ప్రేమికులు భావిస్తుంటాడు . అదే విషయాన్ని శ్రీమణి గారు ఈ పంక్తిలో చాలా క్లుప్తంగా , అందరికీ అద్భుతంగా అర్ధమయ్యేవిధంగా తెలియజేశారు .

ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే
నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే
ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే
నీతో రోజూ ఉండాలనిపిస్తోందే
ఓ నాలోనే నవ్వుకుంటున్నా
నాతోనే ఉండనంటున్నా
నాకేనే కొత్తగా ఉన్నా నీవల్లే నీవల్లే
ఓ నీవెంటే నీడనౌతానే
నువ్వుండే జాడనౌతానే
నువ్వుంటే చాలనిపించే మాయేదో చల్లావే
సరా సరి గుండెల్లో దించావే
మరీ మరీ మైకంలో ముంచావే
ఓ అయినా సరే ఈ బాధ బాగుందే

ఈ పంక్తి ద్వారా ప్రేమలో పడ్డ మొదట్లో ప్రేమికుడు అనుభవించే తీయటి బాధను తెలియజేశారు శ్రీమణి . ప్రపంచంలో ఇంకా ఎంతమంది అందగెత్తలున్నా కూడా తన ప్రేయసిని మాత్రమే కోరుకుంటారు . ఇంకా తనకేదో చెప్పాలని , అడగాలని , ప్రతీ రోజూ తనతోనే జీవితాంతం ఉండాలని ప్రేమికుడు కోరుకుంటాడు . ఇక ఆ తరువాత ప్రేమలో పడ్డ కొత్తల్లో ప్రేమికుడిలో కలిగే మార్పులను స్పష్టంగా తెలియజేశారు శ్రీమణి . ఉన్నట్టుండి తనలో తాను నవ్వుకోవడం , పరధ్యానంలో ఉండడం వంటివి దీనికి ఉదాహరణలు . తాను తన ప్రేయసితో చెప్పాలనుకునే మాటలను కూడా ఇక్కడ తెలియజేశారు . తాను అవకాశమిస్తే ఎప్పటికీ తన వెంటే నడుస్తానని , నడిపిస్తానని , కేవలం తాను ఉంటే ఈ జీవితానికి చాలని ప్రతీ ప్రేమికుడి ఆలోచనని భావం . మనకిష్టమైన వారు ఎన్ని బాధలు కలిగించినా మనకు ఎంతో హాయిగా ఉంటుంది మరి తనలో ప్రేమనే అందమైన భావన కలిగించిన ప్రేయసి ఎంత బాధ పెట్టినా హాయిగానే ఉంటుంది . ఇదే విషయాన్ని “సరా సరి గుండెల్లో దించావేమరీ మరీ మైకంలో ముంచావే ,
అయినా సరే ఈ బాధ బాగుందే ” ద్వారా తెలియజేశారు శ్రీమణి .

అనుకోనిదే మనిరువురి పరిచయం
ఓహో జతపడమని మనకిలా రాసుందే
మతిచెడి ఇలా నీ వెనకే తిరగడం
అలవాటుగా నాకెలా మారిందే
ఆగలేని తొందరేదో
నన్ను తోసే నీవైపిలా
ఆపలేని వేగమేదో
నాలోపలా
ఇంతకాలం నాకు నాతో
ఇంతగొడవే రాలేదిలా
నిన్ను కలిసే రోజు వరకు
ఏరోజిలా లేనే ఇలా
సరా సరి గుండెల్లో దించావే
మరీ మరీ మైకంలో ముంచావే

ఓ అయినా సరే ఈ బాధ బాగుందే

ఈ పంక్తి ద్వారా ప్రేమికుడిలో కలిగే మరిన్ని భావనలు తెలియజేశారు శ్రీమణి . అనుకోకుండా కలిగేది ప్రేమ , ప్రేమ కలగడానికి సమయం ,సందర్భం కారణాలు వంటివి ఉండవు . అసలు ప్రేయసి పరిచయం తాను ఎప్పుడు ఊహించలేదని , తనతో జతపడి రాసుంది కనుకనే అలా జరిగిందనేది ప్రేమికుడి భావన . పిచ్చివాడిలా ఎప్పుడు తన ప్రేయసి గురించే ఆలోచిస్తూ ,ఎప్పుడూ తన వెనకనే తిరుగుతూ ఉండడమనేది ఒక అలవాటుగా మారడం . చాలా మంది తమ మనసులో మాట ఎదుటి వ్యక్తికి చెపుదామనుకున్నా తమలో ఉన్న భయం , మొహమాటం ఆపేస్తుంటాయి , కానీ మనసు చెప్పేదాకా ఊరుకోదు , ఈ సంక్లిష్ట పరిస్థితి ప్రతీ ప్రేమికుడికి ఎదురవుతుంది ఇదే విషయాన్ని ఆగలేని తొందరేదో ,నన్ను తోసే నీవైపిలా , ఆపలేని వేగమేదో నాలోపలా , ఇంతకాలం నాకు నాతో ఇంతగొడవే రాలేదిలా ,నిన్ను కలిసే రోజు వరకు ఏరోజిలా లేనే ఇలా అనే లైన్ల ద్వారా తెలియజేశారు శ్రీమణి .

ఎప్పటికీ అందరి గుండెల్లో నిలిచిపోయేవి సాహిత్యం సంగీతం . మరీ అందులో ప్రేమ పాటల గురుంచి వేరుగా చెప్పాలా . ప్రతి ఒక్కరూ తమ కోసమే రాసినట్టుగా భావిస్తారు . అధిక కాలం ఆ పాటలను వింటూ మైమరచిపోతారు . కొన్ని దశాబ్దాలనుండి ఎన్నో భాషలలో ఎన్నో ప్రేమ పాటలు వచ్చి ఆదరణ పొందాయి . ఏదైనా విషయాన్ని చెప్పటంలో వారి గొప్పతనం వెలువడుతుంది . మరి ఇటువంటి మంచి పాటను అందించిన శ్రీమణి గారికి ధన్యవాదాలు .

– ఎస్ ఏ టీ శ్రీనాధ్ , హైదరాబాద్

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments