ఎటువంటి వారినైనా ప్రభావితం చేయగలిగిన వాటిలో సాహిత్యం ముందు వరసలో ఉంటుంది . కొన్ని పాటలు వింటుంటే మనలో తెలియని భావోద్వేగాలు వెలువడుతుంటాయి . తెలుగు సినీ సాహిత్యంలో ఇటువంటి ప్రభావితమైన రచనలు చేసే వారిలో చంద్రబోస్ ముఖ్యులు . ఆయన కలం ద్వారా ఎన్నో ఆణిముత్యాలు పరిచయం అయ్యాయి . అటువంటి ఆణిముత్యాలలో హోటల్ ముంబయి సినిమాలోని “ఇదేరా భారతదేశం ” అనే పాట .

2008 లో ముంబై నగరంపై తీవ్రవాదులు దాడిచేసిన సమయంలో యావత్ దేశం అంతా ఉలిక్కిపడింది . ఆ క్రమంలో ముంబై లోని తాజ్ హోటల్ మీద చేసిన దాడి అందరికి గుర్తుండే ఉంటుంది . ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం హోటల్ ముంబయి .

ఇప్పటికే మన దెస ఔన్నత్యానికి తెలియజేసే పాటలను చంద్రబోస్ గారి ద్వారా అందుకున్నాం . ఝమ్మంది నాదం సినిమాలో
“దేశమంటే” అనే పాట మన చెవుల్లో మార్మోగుతూ ఉంటుంది . హోటల్ ముంబయి చిత్రంలోని ఇదేరా భారతదేశం అనే పాట కూడా అదే కోవకు చెందినది . ఈ పాట ద్వారా చంద్రబోస్ గారు భారతీయుడు అనే వాడు ఆపద వచ్చినప్పుడు తన ప్రాణాలకు తెగించి ఇతరులకు ఎలా చేయూతనందిస్తాడు అనే విషయాన్ని తెలియజేశారు .

“ప్రతి మనిషిలో చూస్తాం దైవత్వం
పరహితము క్షేమం మా తత్త్వం
రక్షించేటందుకే మా రక్తం
ప్రాణాలిచ్చేందుకు పడి చస్తాం
మా సుఖ సౌఖ్యం వదులుకుంటాం
ఇతరులకోసం కదులుతుంటాం
సాయమే ఒక గేయమై ధ్వనించిన దేశం

ఇదేరా భారతదేశం … ఇదేరా భారతదేశం
ఇదేరా భారతదేశం … ఇదేరా భారతదేశం

జాతి , కుల , మత , వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరూ సుఖ శాంతులతో జీవిస్తున్న ఏకైక దేశం భారతదేశం . భారతీయులైన మనం ప్రతి ఒక్కరిలో దేవుడిని చూస్తాం , మనము ఎలా ఉన్నా పరవాలేదు మన వద్దకు వచ్చిన అతిథికి ఏమి లోటు కాకుండా చూసుకుంటూ వారి ప్రాణాలకు ఎటువంటి ముప్పు వచ్చినా తెగించి మన ప్రాణాలను అడ్డు పెడతాం , అది మన భారతీయుల సగటు మనస్తత్వం . ఇదే విషయాన్ని చంద్రబోస్ గారు చాలా సరళమైన రీతిలో అందరికీ అర్ధమయ్యే విధంగా తెలియజేశారు . తమపై ఎన్ని దాడులు చేసినా కరుణతో ఆశ్రయం ఇచ్చిన దేశం మన భారతదేశం . అదే విషయాన్ని “సాయమే ఒక గేయమై ధ్వనించిన దేశం ” అనే లైన్ ద్వారా చెప్పారు చంద్రబోస్ . గేయమనేది శ్రోతల చెవుల్లో ధ్వనిస్తూనే ఉంటుంది . సాయాన్ని గేయంతో పోల్చడంలో చంద్రబోస్ గారి విశిష్టత బయటపడుతోంది . భారతదేశం ఎటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా ఆడుకోవడానికి సంసిద్ధంగా ఉందని తెలియజేయడమే ఇందులోని భావం .

“మీ కష్టాన్ని తుడిచే కల్లాపిలా చిందిస్తాం మేమే కన్నీళ్లు
మీ భయాన్ని తుంచే ఆయుధంలా అందిస్తాం మేమే మునివేళ్ళు
కరుణేగా ఇక్కడి వర్షం
మానవతేగా ఈ ఋతుపవనం
ప్రతి మట్టికణమొక క్షేత్రంగా వెలసిన దేశం

ఇదేరా భారతదేశం … ఇదేరా భారతదేశం
ఇదేరా భారతదేశం … ఇదేరా భారతదేశం

ముంబై తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో ఆ హోటల్ యాజమాన్యం , మన భారతీయుల పోలీసు వ్యవస్థ తక్షణమే తమ ప్రాణాలు అడ్డుపెట్టి అందులో అతిథిలుగా ఉన్న విదేశీయలకు ఎటువంటి హాని జరగకుండా ఎలా చూసుకున్నారని విషయం అందరికీ తెలిసినదే . ఇప్పటికీ ఆ దృశ్యాలు కదలాడుతూ ఉంటాయి . భారత దేశం యొక్క దయాగుణం ప్రపంచానికి మరొకసారి కళ్ళకు కట్టినట్టు చూపించిన సందర్భం . ఇదే విషయాన్ని చంద్రబోస్ గారు ఈ పంక్తి ద్వారా తెలియజేశారు .

ఇక్కడ ఇతరుల కష్టాలను దూరం చేయడానికి తమ కన్నీళ్లను కల్లాపి గా చిందించడం , భయాన్ని తుడిచే ఆయుధంలా మునివేళ్ళను అందించడం వంటి ఉపమానాలు చూస్తే ఆయనకు ఆయనే సాటి అని చంద్రబోస్ గారు మరోసారి నిరూపించుకున్నారు .
మానవత్వానికి , కరుణకి పెట్టింది పేరు మన భారతీయులు . మానవత్వం ఉంటేనే ఎదుటి వ్యక్తిపై కరుణ ఏర్పడుతుంది . ఇదే విషయాన్ని ప్రకృతికి అనుసంధానించి తెలియజేశారు . ఋతుపవనాల ద్వారా వర్షం వస్తుందనేది విదితమే . అలాగే మానవత్వం అనే ఋతుపవనం ద్వారా కరుణ వర్షిస్తుందని భావం . ఇటువంటి ఉదాహారణలతో రాసిన చంద్రబోస్ గారికి ఎంత ఇచ్చినా సరిపోదు . ఆధ్యాత్మిక పరంగా , మనుషుల వ్యక్తిత్వాల పరంగా ప్రపంచంలో మొదటి స్థానం ఎప్పటికి భారతదేశానిదే . ఈ మట్టిలోనే ఒక జీవం ఉంటుంది . అదే విషయంగా చంద్రబోస్ గారు “ప్రతి మత్తికానమొక క్షేత్రంగా వెలసిన దేశం ” అనే లైన్ ద్వారా తెలియజేశారు . అంటే ప్రతీ మట్టికణంలోనూ దైవత్వం ఉందనేది ఇందులో భావం . ఈ విధంగా భారతదేశ గొప్పతనాన్ని ఇంకెవ్వరూ చెప్పని విధంగా చెప్పారు చంద్రబోస్ .

“సూర్యుడి ఎరుపుని చంద్రుడి తెలుపుని
పంటలో పచ్చెను తీద్దాం
గుండెల నిండుగ జెండా ఎగరగా త్యాగానికి సంసిద్ధం

ఇదేరా భారతదేశం … ఇదేరా భారతదేశం
ఇదేరా భారతదేశం … ఇదేరా భారతదేశం

ఇక ఈ పంక్తిలో భారతీయుడి ఏ విధంగా తమ త్యాగానికి వెనకాడకుండా ముందుకు వెళతారు అనేది తెలియజేశారు చంద్రబోస్ . సూర్యుడి తన ఎరుపుకి , చంద్రుడు తన తెలుపుకు , అలా పంటలు పచ్చదనానికి ప్రతీక . సూర్యూడిలోని ఎరుపుని అనే ధైర్యం , చంద్రుడి తెలుపు అంటే నిర్మలత్వం వంటి లక్షణాలతో గుండె నిండా తమ దేశ ప్రతిష్టను పెట్టుకొని భారతీయలు ఎటువంటి త్యాగానికైనా సిద్ధం అనేది ఇందులో భావన .

ఒకే విషయాన్ని పది మంది పది రకాలు రకాలుగా చెప్తారు . అయితే ఎంత సరళంగా , తమకు ఎవరూ సాటి లేరు అనే విధంగా చెప్పడంలో వారి గొప్పతనం దాగి ఉంటుంది . మరి ఈ పాటలో ఎంతో గొప్ప సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ గారికి అక్షర లక్షలిచ్చినా తక్కువే . ఆయన ఇంకా మరిన్ని గొప్ప , ఆలోచన రేకెత్తించే పదాలు మరిన్ని ఆయన కలం నుండి రావాలని కోరుకుందాం .

– ఎస్ ఏ టీ శ్రీనాధ్ , హైదరాబాద్

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments