
డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా జైలుకు పంపనున్నారు. ఇప్పటివరకు జరిమానాలతో సరిపెట్టిన రవాణా శాఖ ఇక కఠినంగా వ్యవహరించనుంది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 88,872 మంది డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ మేరకు రవాణా శాఖ తాజాగా ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదికను రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి అందజేసింది. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపేవారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టు కమిటీ సూచించింది. దీంతో ఏపీ రవాణా శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను ఈ ఏడాది 20 శాతం తగ్గించాలని రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలను ఇక ముమ్మరంగా చేపట్టనున్నారు.