శివాజీరాజా, జాకీ, గుండు సుదర్శన్, సివి ఎల్ నరసింహరావు, భావన ప్రధాన పాత్రధారులుగా పిఎల్ క్రియేషన్స్ పతాకంపై నటుడు లోహిత్ కుమార్ నిర్మాతగా జాకీ తోట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అక్షరం’. ఈ నెల 26న భీమినేని ఫిల్మ్స్ ఎల్.ఎల్.పి ద్వారా సినిమా విడుదల కానుంది. ఈసందర్భంగా నిర్మాత లోహిత్ కుమార్ మాట్లాడుతూ, ‘అన్నీ ఉచితంగా అందరికీ ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వాలు విద్యను మాత్రం అందరికీ ఒకేలా ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించే సినిమా ఇది. మోయలేని బరువులను పిల్లల మీద రుద్దుతున్న తల్లిదండ్రులను ప్రశ్నించే సినిమా. తల్లిదండ్రుల శ్రమను అర్థం చేసుకోవాలని పిల్లలకి తెలియజెప్పే సినిమా. ఒకరకంగా సమాజహితమైన సినిమా. దేశం సర్వనాశనం కావాలంటే అణుబాంబులు, యుద్ధాలు చేయనక్కర్లేదు. విద్యా వ్యవస్థ మీద దెబ్బకొడితే చాలు. ఆ దేశం నిర్వీర్యమౌతుందన్నది అందరికి తెలుసు.
నేడు మనం చదువు కోవడం లేదు. చదువు కొంటున్నాం. దాని వల్ల సహజమైన జ్ఞానం అనేది నశించి అసలు పిల్లలు ఏమవ్వాలి? ఎలా అవ్వాలి?
భవిష్యత్తులో ఎలా ఉండాలి? అనేది కూడా వారు మరిచిన క్షణాలివి. అందుకే దానివల్ల స్వార్ధం, క్రూరత్వమే పెరుగుతుంది తప్ప మంచి అభివృద్ధి అనేది రాదు. ఈరోజు సమాజంలో జరిగే ప్రతి ఆకృత్యానికి వారి అజ్ఞానమే కారణం. అందుకే ‘అక్షరం’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం’ అని చెప్పారు.