తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి అనే సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడాయన. ఈ ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా రాజమౌళి పేరు చర్చనీయాంశం అయిపోయింది. ఈ సినిమానే కాదు.. అంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నదే. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. కానీ, రాజమౌళికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటేనే ఇష్టం. ఈ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు కూడా. సినిమాల పరంగానే కాదు.. బయట కూడా వీళ్లిద్దరూ ఎంతో స్నేహంగా ఉంటారు. అందుకే ఆ బాండింగ్ ఉంది. వీళ్ల కాంబినేషన్‌లో విడుదలైన ‘యమదొంగ’ తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

1
సూపర్ హిట్ కాంబినేషన్

దర్శకధీరుడు రాజమౌళి.. రాఘవేంద్ర రావు శిష్యుడిగా ‘స్టూడెంట్ నెం.1’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనే ‘సింహాద్రి’ అనే సినిమాను చేశాడు. ఇక, వీళ్ల కాంబినేషన్‌లో ‘యమదొంగ’తో హ్యాట్రిక్ హిట్స్ నమోదయ్యాయి. ఈ మూడు చిత్రాలూ తారక్‌ను స్టార్ హీరోగా మార్చాయి. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమాలన్నీ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

2
కీలక సమయంలో హిట్లు ఇచ్చాడు

హీరోగా ఎన్టీఆర్ మొదటి ప్రయత్నమే ఫెయిల్ అయింది. ఆ సమయంలో రాజమౌళి ‘స్టూడెంట్ నెం.1’ రూపంలో ఫస్ట్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస పరాజయాలు వస్తున్న సమయంలో ‘సింహాద్రి’తో ఎన్టీఆర్‌ను ఒడ్డున పడేశాడు. దీని తర్వాత కూడా చాలా కాలం ప్లాప్ సినిమాలు వచ్చాయి. అప్పుడు ‘యమదొంగ’తో మరో హిట్ ఇచ్చి తారక్‌ను నిలబెట్టాడు జక్కన్న.

3
‘యమదొంగ’ ప్రత్యేకమైనది

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, ప్రియమణి, మమతా మోహన్ దాస్ నటించిన చిత్రం ‘యమదొంగ’. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. 2007లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, అప్పటి వరకు లావుగా కనిపించిన తారక్.. ఇందులో స్లిమ్‌గా కనిపించాడు. దీని తర్వాత తారక్ వెనుదిరిగి చూడలేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

4
12 ఏళ్ల తర్వాత వస్తోంది

విడుదలైన 12 సంవత్సరాల తర్వాత ‘యమదొంగ’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమా తమిళంలోకి డబ్బింగ్ అవుతోంది. సుదీక్షా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ ఈ సినిమాను తమిళంలో విడుదల చేస్తోంది. ఏఆర్కే రామరాజా ఈ సినిమాకు మాటలు, పాటలు రాస్తున్నారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments