శాస్త్రీయ నృత్యకారుడిగా , మంచి నటుడిగా దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నావారు వినీత్ . ఆయన పొరుగు రాష్ట్రం కు సంబందించిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆయనను ఆదరించారు . ఆయన ఈ మధ్య ఒక ప్రముఖ టీవీ ఛానెల్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు .
హాయ్ వినీత్ ఎలా ఉన్నారు?
వినీత్: నేను బాగున్నానండీ! మీ షోకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.
క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని మీకు ఏ వయసులో అనిపించింది?
వినీత్: నాకు ఊహ తెలిసినప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరిక ఉండేది. ఒక ఫంక్షన్లో నేను డ్యాన్స్ చేయడం చూసి, ‘వీడిలో టాలెంట్ ఉంది. తప్పకుండా డ్యాన్స్ నేర్పించాలి’ అని మా పెద్దమ్మ పద్మిణి శిక్షణ ఇప్పించారు. అలా మొదలైంది నా డ్యాన్స్ ప్రస్థానం. అది నేర్చుకునేటప్పుడే దాని విలువ ఏంటో తెలిసింది.
మీ తొలి చిత్రం ఏది?
వినీత్: 1985లో ఒక మలయాళ చిత్రంలో నటించా. చాలా చిన్న పాత్ర. కానీ, నాకు బ్రేక్ వచ్చింది మాత్రం హరిహరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నక్షత్రంగళ్’. అందులో నేను, మునీషా యంగ్ లవర్స్‌గా నటించాం. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నా. సినిమాల కంటే చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టేవాడిని. డిగ్రీ తర్వాత వరుసగా సినిమాలు చేశా.
తెలుగులో మీ మొదటి చిత్రం?
వినీత్: క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘సరిగమలు’. అశ్వనీదత్ నిర్మాత. మలయాళ ‘సర్గమ్’ను తెలుగులో తీశారు. మలయాళంలో మేము చేసిన పాత్రలనే తెలుగులో మాతో తీయించారు.
మరి ఆ తర్వాత వరుస తెలుగు సినిమాలు ఎందుకు చేయలేదు?
వినీత్: ఆ సమయంలో నేను మలయాళంలో చాలా బిజీ ఆర్టిస్ట్. క్రాంతికుమార్లాంటి దర్శకుడితో పనిచేయాలని ఈ సినిమా చేశాం. పాటలు, సంగీతం పరంగా బాగున్నా, కమర్షియల్‌గా పెద్ద హిట్ కాలేదు. దీంతో నాకు తెలుగులో వరుస ఆఫర్ల రాలేదు. ఆ తర్వాత సాక్షి శివానంద్‌తో కలిసి ‘ప్రియురాలు’ అని తీశారు కానీ, దాన్ని విడుదల చేయలేదు. డబ్ చేసి మలయాళంలో మాత్రమే విడుదల చేశారు.
‘ప్రేమదేశం’ ఒక ట్రెండ్ సెట్టర్ కదా దాని గురించి?
వినీత్: ఇందులో నేనూ అబ్బాస్ కలిసి నటించాం. టబు అప్పుడు దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చారు. ప్రియదర్శన్ తెరకెక్కించిన ‘కాలాపానీ’లో మోహన్‌లాల్‌కు మేనల్లుడిగా నేను నటించా. అందులో టబు నాకు ఆంటీ. ఇక్కడ ‘ప్రేమదేశం’లో నా లవర్(నవ్వులు).
ఆ సినిమా విడుదల తర్వాత మీకు ఫాలోయింగ్ ఎలా ఉంది?
వినీత్: ఎక్కడ చూసినా మా సినిమా గురించే చర్చ. ఇందుకు దర్శకుడికి, రెహమాన్‌గారికి ధన్యవాదాలు చెప్పాలి. అసలు ఆ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంటుంది. విజువల్స్ పరంగా, సంగీతం పరంగా చక్కగా తీశారు. మా ఫేస్ల్లో ఫ్రెష్‌నెస్ సినిమాకు మరింత బలం తీసుకొచ్చింది.
‘ప్రేమదేశం’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏవో గొడవలు జరిగాయట!
వినీత్: కాలేజ్‌లో ఫేర్వెల్ జరిగే ఎపిసోడ్ ఒకటి ఉంది. ప్రెసిడెన్సీ కాలేజ్‌లో ఆ సన్నివేశాలు తీశాం. అది మెరీనా బీచ్‌కు దగ్గరే ఉంటుంది. పక్కనే ఉన్న స్లమ్ నుంచి పిల్లలు వస్తే, వారికి కొన్ని చాకెట్లు ఇచ్చాం. అయినా, ఇంకా కావాలని గొడవ చేస్తుండడంతో మా సెట్లోని ఒక డ్యాన్సర్ వాళ్లను తిట్టేశారు. దాంతో ఆ స్లమ్ నుంచి కత్తులు, కర్రలు వేసుకుని ఆ అమ్మాయిని కొట్టడానికి వచ్చారు. విషయం పోలీసులకు తెలియడంతో వాళ్లు వచ్చి సర్దిచెప్పి పంపారు.
అబ్బాస్‌తో మీ స్నేహం ఎలా ఉండేది?
వినీత్: తను నాకు జూనియర్. అప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు. అతని లుక్స్ చూసి, ‘మీరు నటిస్తారా’ అని అడిగి సెలక్ట్ చేశారు. ఆ సినిమా కోసం అబ్బాస్ చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత మంచి ఆర్టిస్ట్‌గా, స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు న్యూజిలాండ్‌లో సెటిల్ అయ్యాడు. అప్పుడప్పుడు ఫేస్బుక్లో ఇద్దరం పలకరించుకుంటూ ఉంటాం. ఇక టబు మంచి నటి. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ తర్వాత మీరు కలిసి ఏదైనా సినిమాలో నటించారా?
వినీత్: నేనూ, అబ్బాస్ కలిసి ‘స్వయంవరం'(తమిళ్), ‘నీ ప్రేమకై’ చిత్రాల్లో నటించాం.
మీ కుటుంబం ఎక్కడ ఉంది?
వినీత్: అందరూ చెన్నైలోనే ఉన్నారు. నా భార్య భారతీయ విద్యా భవన్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. మాకు ఒక పాప. ఇప్పుడు 8వ తరగతి చదువుతోంది. మాది పెద్దల కుదిర్చిన సంబంధమే! ఫ్యామిలీ ఫ్రెండ్‌గా పరిచయమైంది.
మూడో తరగతిలోనే మీరు గోడ దూకి పారిపోయారట!
వినీత్: అప్పట్లో మంచి స్కూల్లో చదివిద్దామనే ఉద్దేశంతో మా తల్లిదండ్రులు నన్ను హాస్టల్లో వేశారు. ఇప్పుడు ఉన్నట్లు ఫోన్లు అంతగా ఉండేవికావు. నాకు బాలాజీ అనే ఫ్రెండ్ ఉండేవాడు. హాస్టల్‌కి వచ్చినప్పటి నుంచి.. ఎప్పుడు? ఎలా బయటకి వెళ్దామా? అని ప్లాస్ చేస్తూ ఉండేవాళ్లం. ఆదివారం హాస్టల్లో ఒక సినిమా వేశారు. అందులో కొందరిని బంధిస్తే, సొరంగం తీసుకుని బయటకు వెళ్లే సన్నివేశం ఉంది. అది చూసిన దగ్గరి నుంచి సొరంగం తవ్వి వెళ్లిపోదామనుకునేవాళ్లం. ఎక్కడ ఏం ఉందో మ్యాప్‌లు కూడా వేసేవాడు. ఒకరోజు తను ఎలాగో బయటకు వెళ్లిపోయాడు. హాస్టల్లో ఒకటే చర్చ. ఆ తర్వాత ఒక వ్యక్తి బాలాజీని తీసుకొచ్చాడు. ఆ మరుసటి రోజే వాడిని హాస్టల్ నుంచి బయటకు పంపేశారు.
మలయాళ ఇండస్ట్రీలో సగం మంది వినీత్ కుటుంబ సభ్యులేనని అంటారు నిజమేనా?
వినీత్: అలా ఏమీ లేదు. సగానికి పైగా ఫ్రెండ్స్ ఉన్నారు. నటి శోభన మాకు బంధువు అవుతారు.
ఎయిర్‌పోర్ట్‌లో మీరు డ్రగ్స్ తీసుకెళ్తుంటే మిమ్మల్ని పట్టుకున్నారట నిజమేనా?
వినీత్: ఇది మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. అప్పట్లో నాకు కాస్త జుట్టు ఎక్కువగా ఉండేది. సరిగా దువ్వుకునేవాడిని కూడా కాదు. డ్రస్‌లు కూడా ఏది పడితే అది వేసుకునేవాడిని. దీంతో ప్రతి పోలీస్ నన్ను అనుమానంగా చూసేవాడు. నా బ్యాగ్‌లో పూజా సామాగ్రి ఉండేవి. విభూతి, కుంకుమ ఇలా ప్రతిదీ డబ్బాలో పెట్టి సంచిలో పెట్టుకునేవాడిని. దాంతో అనుమానం వచ్చేది. అన్నీ ఓపెన్ చేసి చెక్ చేసేవారు. కర్పూరాన్ని నలిపి వాసన చూసి వాళ్లలో వాళ్లు మాట్లాడుకునేవారు.
ఒక సినిమాలో మొసలితో ఫైట్ చేశారట! అది బతికే ఉందా?
వినీత్: కుంజుమన్ నిర్మించిన ‘శక్తి’ అనే చిత్రంలో జరిగింది. అందులో నేను హీరో. ఒక గుడి నేపథ్యంలో కథ నడుస్తుంది. నదిలో దిగిన ఏనుగును మొసలి పట్టుకుంటుంది. నేను నీళ్లలోకి దిగి మొసలితో పోరాడి ఏనుగును రక్షించాలి. పొలాచ్చిలో షూటింగ్. షూటింగ్‌కు వెళ్లకముందే నా షెడ్యూల్ గురించి అడిగితే ‘ఫైట్’ సీన్ తీస్తున్నామని చెప్పారు. డమ్మీ మొసలి రెడిగా ఉందా? అని అడిగితే ఉందన్నారు. ఉదయాన్నే షూటింగ్‌కు వెళ్తే, చిన్న గొడవ జరిగి, డమ్మీ మొసలిని తీసుకెళ్లిపోయారట. దీంతో నిజమైన మొసలి అక్కడ ఉంది. నాకేమో లోపల విపరీతమైన భయం. ఆ ఫైట్ సీన్‌కు కనల్‌కణ్ణన్ దర్శకుడు. పీటర్హెయిన్స్ సహాయకుడు. మొసలి నోటికి వైర్ కట్టారు. అయినా భయం పోలేదు. వాళ్లు ధైర్యం చెప్పడంతో భగవంతుడిని తలచుకుంటూ మొసలిని పట్టుకునే యాక్షన్ సన్నివేశాలు తీశారు. ఆరోజు అది మౌనవత్రం పాటించిందేమో తెలియదు కానీ, ఒక వేళ తోకతో తలపై కొట్టినా చచ్చిపోయేవాడిని. చాలా ప్రమాదకర స్టంట్స్ అవి.
‘జెంటిల్మెన్’లో బస్సు కింద తలపెట్టే సన్నివేశం చేస్తుండగా సడెన్‌గా పైకి లేచిపోయారట!
వినీత్: 1992లో జరిగింది. ఆరోజు సెట్‌కు రాగానే ఎదురుగా ఒక బస్సు. అసిస్టెంట్ ఒకరు పాక్కుంటూ బస్సు కిందకు వెళ్లి, టైరు దగ్గర తల పెట్టుకుని పడుకున్నాడు. నాకు అనుమానం వచ్చింది. ఈ సీన్ నాతోనే తీస్తారా ఏంటీ? అనుకున్నా. ఆ సమయంలో సెట్లో నేను తప్ప మరోనటుడు లేడు. బస్సు టైర్ పక్కనే తల పెడితే రివర్స్‌లో బస్సు వెనక్కి వెళ్తుంది. ఎడిటింగ్‌లో దాన్ని ముందుకు వచ్చినట్లు చూపిస్తారట. నాకు ఒక్కసారిగా భయం వేసింది. శంకర్‌గారికి చెబితే ‘ఏం కాదు. ముందు అసిస్టెంట్ చేస్తాడు’ అని అన్నారు. శంకర్ ఇప్పుడు పెద్ద దర్శకుడు కావచ్చు, కానీ, బస్సు టైరుకు ముందు తలపెట్టి పడుకున్న సమయంలో పైన ఉన్న డ్రైవర్ పొరపాటున ఫస్ట్‌గేర్ వేస్తే అంతే సంగతులు కదా! అసిస్టెంట్ చేస్తున్నప్పుడు కూడా నేను ఫీలయ్యా. ఎందుకంటే తనూ మనలాగే ఒక మనిషి. దాంతో ‘వద్దండీ. ఏదైతే అది అయింది. ఆ సీన్ నేనే చేస్తా’ అని చేసేశా. భగవంతుడిని ప్రార్థిస్తూ వెళ్లి బస్సు కింద పడుకున్న ఒక్కటే టేక్, ఒకే చేశారు.
‘అమ్మాయికోసం’ షూటింగ్ సందర్భంగా ఖాళీ సమయంలో రెండు కుర్చీలు వేసుకుని హాయిగా పడుకునేవారట!
వినీత్: అప్పట్లో క్యారావాన్లు లేవు. దాంతో రెండు కుర్చీలు పెట్టుకుని నడుం వరకూ శరీరం ఒక కుర్చీలో, మిగిలిన పార్ట్ మరో కుర్చీలో పెట్టి పడుకునేవాడిని. భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు అలా పడుకొంటే ఆ తర్వాత 5 పేజీల డైలాగ్‌లు ఇచ్చినా చెప్పేసేవాడిని.
చాలా మంది ఆర్టిస్ట్‌లతో నటించారు. కానీ, ‘చంద్రముఖి’లో రజనీకాంత్‌తో నటించడం ఎలా అనిపించింది?
వినీత్: ఆయనతో కలిసి నటించాలని ప్రతి నటుడూ కల కంటాడు. ఈ శతాబ్దంలో ఉన్న అవతార పురుషుడు ఆయన. రజనీసర్తో ఒక్క సీన్లో కనిపించినా చాలు. ‘చంద్రముఖి’ సందర్భంగా ఒక సంఘటన జరిగింది. నేను, జ్యోతిక ఆయన ముందు డ్యాన్స్ చేస్తుంటే ఆయన ‘తళాంగు, తకజం..’ అంటూ జతి పాడుతూ రావాలి. అయితే, ఆ సీన్లో ఆయన చెవి పోగు కింద పడిపోయింది. మొదట సీన్ అనుకున్నప్పుడు అలా లేదు. పొరపాటున అది ఊడిపోయింది. అయితే కట్ చెప్పకుండా ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారు. అప్పుడు కళా మాస్టర్ ఆ సీన్‌ను అలాగే ఉంచేయమన్నారు. ఆ తర్వాత రజనీసర్ నా తల నరికి ఆ చెవిపోగును పెట్టుకుంటూ మళ్లీ జతిని నిదానంగా అంటూ ఉంటారు. ఒక సాధారణ సన్నివేశానికి ఎలా మెరుగులు దిద్దుతారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. అందుకే ఆయన సూపర్‌స్టార్ అయ్యారు. ఇంకో విషయం ఏమిటంటే చంద్రముఖి ప్రేమికుడినైన గుణశేఖరుడి తల నరికేసిన తర్వాత దాన్ని ఆయన కాలితో తన్నాలి. ఈ సీన్ తీసిన తర్వాత యూనిట్ తర్జన భర్జనలు పడింది. రజనీకాంత్‌లాంటి స్టార్ ఒక మనిషి తలను కాలితో తన్నితే ప్రేక్షకులు హర్షిస్తారా? అసలు ఊరుకుంటారా? అని ఆలోచించడం మొదలు పెట్టారు. ఎందుకంటే తమిళనాడులో ఇలాంటి విషయాలను ఫ్యాన్స్ చాలా దగ్గరి నుంచి చూస్తారు. ఇదే విషయాన్ని రజనీసర్కు చెబితే, ‘ఆ సీన్ ఉంచండి. ఎందుకంటే చంద్రముఖి నెగెటివ్ క్యారెక్టర్. ఆ పాత్రపై ప్రేక్షకుల్లో జాలి కలగాలంటే తప్పకుండా ఆ సీన్ ఉండాలి’ అని చెప్పారు. తలను కాలితే తంతే సరిగ్గా కెమెరా పక్క నుంచి వెళ్లింది. దాన్ని కూడా రజనీసర్ సింగిల్ టేక్‌లో చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందుకు దూరం అయ్యారు?
వినీత్: నేను చెన్నైలో సెటిల్ అయ్యాను. తమిళ్, మలయాళ సినిమాలు చేశా. ఆ తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చేసింది. ‘లాహిరి.. లాహిరి.. లాహిరిలో’ తర్వాత ఒక్క సినిమా చేశాను అంతే. తెలుగులో నటించి దాదాపు 16ఏళ్లు అయింది. నాకు ఆఫర్లు వచ్చాయి కానీ, మంచి క్యారెక్టర్ వస్తే చేద్దామని ఆగా.
మీరు ఏదైనా స్కూల్ పెట్టారా?
వినీత్: ప్రస్తుతం కొచ్చిన్‌లో ఒక డ్యాన్స్ స్కూల్ ప్రారంభించబోతున్నా. పూర్తిగా క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తా. నేను ఏం నేర్చుకున్నానో దాన్ని తర్వాతి తరాలకు అందించాలి. పురుషులు డ్యాన్స్ నేర్చుకుంటే దాని ప్రభావం వాళ్లపై ఉంటుందనేది తప్పు.
సన్నీలియోనితో అవకాశం వస్తే..
వినీత్: ఆ స్క్రిప్ట్ బట్టి నటిస్తా. ఎవరు ఎలాంటి వారైనా నా తోటి నటులను గౌరవించడం నా విధి.
ఇక్కడకు వచ్చాక తెలుగు నేర్చుకున్నారా? మీకు ముందే తెలుగు తెలుసా?
వినీత్: మొదట్లో నాకు తెలుగు అస్సలు తెలియదు. ‘బాగున్నారా’ అనే మాట మొదట నేర్చుకున్నా. ‘సరిగమలు’ సినిమాని రాజమండ్రి చుట్టుపక్కల తీశారు. సెట్లో నాకు ఏది కావాలన్నా సైగలతోనే చెప్పేవాడిని. అక్కడి వాళ్లు కూడా బాగా చూసుకునేవారు.
మీ భార్యకు చెప్పిన మొదటి అబద్ధం!
వినీత్: నాకు గుర్తు లేదు. చాలా చెప్పి ఉంటా!(నవ్వులు).
ఇలాంటి షోలకు రావడం నేను చాలా గౌరవంగా భావిస్తా. ఎందుకంటే ప్రేక్షకులకు దగ్గరయ్యేది ఇలాంటి కార్యక్రమాల ద్వారానే పైగా మన అనుభవాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా!