అపుడెపుడో సినిమాలో వచ్చిన నెల్లూరు పెద్దారెడ్డి సంగతేమో కానీ విశాఖకు సంబంధించి చూస్తే నెల్లూరు రెడ్డి గార్లు చాలా మంది కనిపిస్తారు. అందులో అగ్రజుడు టి.సుబ్బిరామిరెడ్డి. ఆయన దాదాపు మూడు దశాబ్దాల క్రితం విశాఖకు వచ్చి సిటీని దత్తత తీసుకున్నానని చెప్పారు. ఆయన ఇక్కడ ఠంచనుగా రెండు కార్యక్రమాలు చేస్తారు. ఒకటి మహాశివరాత్రి, రెండు ఆయన పుట్టినరోజు. మిగిలిన సమయంలో ఆయన ఎక్కడ ఉన్నా విశాఖ జనాలకు కనిపించేది ఈ సందర్భాల్లోనే. ఇక ఆయన విశాఖ నుంచి రెండు సార్లు ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఇపుడు ముచ్చటగా మూడవసారి రాజ్యసభ సభ్యునిగా ఉంటున్నారు.

ఓట్లు అడగను అంటూనే..?

టి.సుబ్బిరామిరెడ్డిలో హాస్యచతురత ఎక్కువ. ఆయన మాటలే అలా ఉంటాయి. ఆయన హావభావాలతో సహజంగానే నవ్వు తెప్పిస్తారు. ఆయన పుట్టిన రోజుని విశాఖ జనాలకు పండుగగా చేసి సినిమా తారలను రప్పించి వారికి సత్కారం చేస్తారు. అలాగే మహాశివరాత్రికి సాధువులను, స్వామిజీలను రప్పించి వారితో ఆధ్యాత్మిక పూజలు జరిపిస్తారు. ఈ రెండు సందర్భాల్లో కూడా టి.సుబ్బిరామిరెడ్డి ఒక మాట చెబుతారు. నేను ఈ వేడుకలు ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ విశాఖ నా దత్తత తీసుకున్న నగరం కాబట్టి ఇక్కడే అన్నీ చేస్తున్నాను, మీకు సినిమా తారలను చూపించి రక్తిని కలిగిస్తున్నాను, స్వామిజీలను రప్పించి ముక్తిని ఇస్తున్నాను అంటూ టి.సుబ్బిరామిరెడ్డి తాను విశాఖకు చేస్తున్న మేలు గురించి సోత్కర్షగా చెబుతూంటారు. ఇంత చేసిన నేను ఓటు అడగను సుమా. నాది రాజకీయం కాదు సుమా ఆయన తనని ఓడించిన విశాఖ ప్రజలను గుర్తు చేసుకుంటారు. అదే అసలైన రాజకీయమేమో మరి.

మళ్ళీ రంగంలో..

ఇక టి.సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాదితో మార్చితో పూర్తి అవుతుంది. మరి ఆయన రాజకీయం ఏంటన్నది ఇప్పటివరకూ తెలియకపోయినా ఆయన విశాఖను నమ్ముకుని ఎంపీగా వచ్చే ఎన్నికల్లో నిలబడతారా లేక మరోమారు రాజ్యసభ కోసం వైసీపీ వైపు వస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. టి.సుబ్బిరామిరెడ్డి కి జగన్ కి మంచి అనుబంధం ఉంది. వారి మధ్య అనుసంధానం చేయడానికి విశాఖ శారదాపీఠం స్వామిజీ కూడా ఉన్నారు. టి.సుబ్బిరామిరెడ్డి కోరుకోవాలే కానీ వైసీపీలో రాజ్యసభ సీటు గ్యారంటీ అంటున్నారు. అలాగే విశాఖ లోక్ సభ సీటుని ఇవ్వడానికీ జగన్ సుముఖమే అంటున్నారు. ఇప్పటికే విశాఖను నోడల్ జిల్లాగా తీసుకున్న వి విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన కూడా నెల్లూరు రెడ్డిగారే. మరి టీఎస్సార్ కూడా వైసీపీలో చేరితే నెల్లూరు రెడ్లతో విశాఖ వైసీపీ కొత్త బలం సంతరించుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments