టాలీవుడ్‌లోని ఇద్దరు మీడియం బడ్జెట్ సినిమాల స్టార్ల కెరీర్‌కు సెప్టెంబర్ 5 అనేది వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే.. ఆ రోజే హీరోగా వాళ్ల తొలి సినిమాలు రిలీజయ్యాయి. ఆ హీరోలు.. నాని, నాగచైతన్య. ఈ రోజుతో నాని హీరోగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంటే, నాగచైతన్య 10 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

నాని హీరోగా నటించిన తొలి సినిమా ‘అష్టా చమ్మా’ 2008 సెప్టెంబర్ 5న విడుదలైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ‘కలర్స్’ స్వాతి& నాయికగా నటించింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో రాంబాబు అనే పాత్రలో ఇమిడిపోయిన నాని, చక్కని అభినయంతో ఆకట్టుకున్నాడు. ‘ఎవరీ కొత్త కుర్రాడు.. చాలా ఈజ్‌తో చేస్తున్నాడు!’ అని ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులూ ఆశ్చర్యపోయేలా చేశాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ మంచి విజయమే సాధించింది. పదకొండేళ్ల తర్వాత చూసుకుంటే ఇవాళ.. నాని మిడిల్ క్లాస్ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజును పురస్కరించుకొని, “అష్టా-చమ్మా రిలీజ్ అయ్యి పదకొండేళ్ళు.. నా నుండి మీ అయ్యి పదకొండేళ్ళు. ఇంత పెద్ద ఫ్యామిలీకి థాంక్ యు అనేది చాలా చిన్న మాట. ఈ మేజికల్ బంధం మరిన్ని సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నా. మీ నాని” అని ట్వీట్ చేశాడు నాని.

ఇక.. నాగచైతన్య కెరీర్ కొంచెం నిరుత్సాహపూరితంగా మొదలైంది. అక్కినేని కుటుంబంలో మూడో తరానికి ప్రతినిధిగా చిత్ర రంగంలో నటుడిగా అడుగుపెట్టిన చైతూని దిల్ రాజు వంటి టాప్ ప్రొడ్యూసర్ లాంచ్ చేశాడు. వాసువర్మ అనే డెబ్యూ డైరెక్టర్ తీసిన ‘జోష్’ మూవీతో చైతూ హీరోగా పరిచయమయ్యాడు. 2009 సెప్టెంబర్ 5న ఆ మూవీ రిలీజయ్యింది. అందులో సత్య అనే స్టూడెంట్ కేరెక్టర్‌లో చైతూ ఫర్వాలేదనిపించుకున్నాడు. యాక్షన్ సీన్లు బాగానే చేశాడు. డాన్సుల్లో పూర్‌గా ఉన్నాడనీ, హీరోగా బాడీ లాంగ్వేజ్‌ను మెరుగుపర్చుకోవాలనీ విమర్శకులు అభిప్రాయపడ్డారు. బాక్సాఫీస్ దగ్గర ‘జోష్’ అనిపించుకోలేకపోయింది సినిమా. దశాబ్దం గడిచింది. ఇవాళ చైతూ అక్కినేని వారసత్వాన్ని మాత్రమే నమ్ముకున్న హీరో కాదు. తనకంటూ సొంతశైలిని నిర్మించుకొని, నటుడిగా పరిణతి చెందిన కథానాయకుడు. సినిమా సినిమాకీ తనను తాను మెరుగుపర్చుకుంటూ, తనకంటూ మార్కెట్‌ను సంపాదించుకున్నాడు. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదిగుతాడనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments