రైతుల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తెదేపా ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన విమర్శించారు. సచివాలయంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం తెచ్చిన రుణాలను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ సరిగా అమలు చేయలేదని.. గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇప్పుడు రైతు సంక్షేమం గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని వ్యాఖ్యానించారు.
రుణమాఫీ పేరిట ఐదేళ్లపాటు రైతులను తెదేపా ప్రభుత్వం మోసం చేసిందని.. సుమారు రూ.2వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వలేకపోయారన్నారు.
”రైతులకు ఇస్తామన్న రూ.24వేల కోట్ల రుణాలను మాఫీ చేయకుండా.. బాండ్లు ఇచ్చి చేతులు దులుపుకొని అన్నదాత సుఖీభవ కింద కొత్త పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు? రుణమాఫీ మొత్తాన్ని చెల్లించవచ్చు కదా? అలా చేయకుండా కొత్త పథకాన్ని తీసుకొచ్చి రైతులను ఎందుకు మోసం చేయాలనుకున్నారు?ఎన్నికల ముందు ఓట్ల కోసం కాదా?” అని కన్నబాబు దుయ్యబట్టారు. రైతులు, మహిళలను చంద్రబాబు అనేక విధాలుగా మభ్యపెట్టారని ఆయన ఆరోపించారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చే సాయాన్ని ఆపేస్తున్నామంటూ తెదేపా విమర్శిస్తోందని.. రైతులు కష్టాల్లో ఉన్నారని భావించి ఈ అక్టోబర్‌లోనే వైఎస్సార్ రైతుభరోసాను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినదానికంటే ఏడాది ముందే రైతుభరోసాను అమలు చేస్తున్నామని కన్నబాబు వివరించారు.
రుణమాఫీ చేయకుండా కొత్త పథకమెందుకు?
Date: