నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా యెడుగూరి సందింటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మధ్యాహ్నం 12.23 గంటలకు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.

”వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం గానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ.. నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియపరచనని, లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.” అంటూ జగన్ ప్రమాణంస్వీకారం చేశారు.

ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిసా సీఎం నవీన్‌పట్నాయక్, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అశేష అభిమానులు, వైసీపీ కార్యకర్తల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం హోదాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments