ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ అనుకూలురు సంచలన విశ్లేషణలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను దేవుడు మెచ్చలేదని, అందుకే టీడీపీకి ఈ మేర ఓటమి దక్కిందన్న కోణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా… జగన్ కు ఆస్థాన గురువుగా పరిగణిస్తున్న విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అంతకు మించిన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారాయని చెప్పక తప్పదు.
వైసీపీ విజయం సాధించడం, జగన్ త్వరలోనే సీఎంగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో స్వరూపానందేంద్రను ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్వారూపానందేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు పాలనను దుష్ట సామ్రాజ్యంగా అబివర్ణించిన ఆయన… చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడేందుకే కేసీఆర్ తో జగన్ చేతులు కలిపి ఉంటారని చెప్పారు. కేసీఆర్ తో జగన్ కలవడానికి కారణం ఇదీ అంటూ తానేమీ చెప్పలేనని వ్యాఖ్యానించిన స్వరూపానంద… ఓ దుష్ట సామ్రాజ్యాన్ని కూల్చాలంటే… ఎన్నో రకాల ఎత్తుగడలు వేయాల్సి ఉంటుందని, అందులో భాగంగానే కేసీఆర్ తో జగన్ కలిసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
ఇక జగన్ లో కనిపిస్తున్న కసి గురించి కూడా స్వామీజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పాలనను తనదైన శైలిలో పరుగులు పెట్టించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి… జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పిన స్వామీజీ… జగన్ కూడా జనం మదిలో చెరగని ముద్ర వేసుకోవాలని, అంతేకాకుండా తన తండ్రిని మించి జనానికి మంచి చేయాలన్న కసితోనే ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. స్వరూపానందేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగానే మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here