కెరీర్‌లో ఒక్కసారైనా ప్రపంచ కప్‌ ఆడాలనేది ప్రతీ క్రికెటర్‌ కల. సచిన్‌ లాంటి దిగ్గజాలు ఆరు ప్రపంచ కప్‌లు ఆడగలిగితే సుదీర్ఘ కాలం కెరీర్‌ ఉండీ ఒక్క టోర్నీ కూడా ఆడే అవకాశం దక్కనివారు
ఎందరో. అయితే కెరీర్‌ చివరి దశకు వచ్చిన సమయంలో ‘ఈ ఒక్కసారి’ అంటూ వరల్డ్‌ కప్‌ కోసం సర్వశక్తులు ఒడ్డి సిద్ధమయ్యే క్రికెటర్ల జాబితా కూడా పెద్దదే. ఆటగాళ్ల ఆలోచన, బోర్డు ప్రణాళికల్లో
కూడా ఆయా సీనియర్లు, వారి అనుభవానికి ఒక ఆఖరి అవకాశం ఇచ్చి సగౌరవంగా పంపించాలనే భావన కనిపిస్తుంది. అందుకే సహజంగానే ప్రతీ ప్రపంచ కప్‌ తర్వాత ఎందరో స్టార్ల కెరీర్‌లకు ఫుల్‌స్టాప్‌పడుతుంది.
కొందరు విజయంతో సంతృప్తికరంగా గుడ్‌బై చెబితే, మరికొందరు నిరాశాజనకంగా ఆటను ముగించాల్సి వస్తుంది. ఈసారి వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత కూడా చాలా మంది ఆట నుంచి
నిష్క్రమించేందుకు సిద్ధమవుతుండగా… మరికొందరు కెరీర్‌ను కొనసాగించినా వచ్చే ప్రపంచ కప్‌ వరకు మాత్రం మైదానంలో ఉండటం దాదాపు అసాధ్యం. అలాంటి క్రికెటర్ల జాబితాను చూస్తే…

క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)
కొత్త మిలీనియం ప్రారంభానికి ముందు వన్డేల్లో అరంగేట్రం చేసి ఇప్పటికీ కొనసాగుతున్న అతి కొద్ది ఆటగాళ్లలో గేల్‌ ఒకడు. విధ్వంసక ఆటగాడిగా గుర్తింపు ఉన్నా, పలు రికార్డులు తన పేరిట ఉన్నా వన్డే వరల్డ్‌ కప్‌ విజయంలో మాత్రం అతను భాగం కాలేకపోయాడు. మధ్యలో కొంత కాలం టి20ల హోరులో జాతీయ జట్టుకు దూరంగా ఉండిపోయిన అతను ఇప్పుడు మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. విండీస్‌పై పెద్దగా అంచనాలు లేని సమయంలో గేల్‌ రాక జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. కప్‌ గెలిపించగలడో లేదో కానీ ఇటీవలి ఫామ్‌ ప్రకారం చూస్తే వరల్డ్‌ కప్‌లో గేల్‌ మెరుపులు ఖాయం. 2003 నుంచి నాలుగు ప్రపంచ కప్‌లు ఆడిన గేల్‌ 26 మ్యాచ్‌లలో 37.76 సగటుతో 944 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. గత ప్రపంచ కప్‌లో డబుల్‌ సెంచరీ బాదాడు.

మహేంద్ర సింగ్‌ ధోని (భారత్‌)
నాలుగున్నరేళ్ల క్రితమే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించినా… పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోని ముద్ర కొనసాగింది. అయితే గత కొంత కాలంగా వరుస వైఫల్యాలు, అనంతరం అతని ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ వరల్డ్‌ కప్‌లాంటి మెగా ఈవెంట్‌లో ధోని అనుభవం, వ్యూహాలు జట్టుకు ఎంత అవసరమో గుర్తించి సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. ఎలాగైనా వరల్డ్‌ కప్‌ వరకైతే కొనసాగించాలని భావించారు. కెప్టెన్‌ కోహ్లి పదే పదే మద్దతుగా నిలవడం కూడా కలిసొచ్చింది. భారత్‌ గెలవాలంటే ధోనిలాంటి సీనియర్‌ పాత్ర కూడా కీలకం కానుంది. అయితే పరోక్షంగా బోర్డు వర్గాల వ్యాఖ్యల్లో కూడా ధోనికిదే చివరి టోర్నీ అని చాలా సార్లు వినిపించింది కాబట్టి ఇకపై రిషభ్‌ పంత్‌లాంటి యువ ఆటగాడు వేచి చూస్తున్న తరుణంలో టోర్నీ ఫలితం ఎలా ఉన్నా, 38 ఏళ్ల ధోని ఎలా ఆడినా అతనికి ఇదే ఆఖరి ఆట కావచ్చు.
రికార్డు: రెండు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఒకసారి జట్టును జగజ్జేతగా నిలపడంతో పాటు మరోసారి సెమీస్‌ చేర్చాడు. అతనికి ఇది వరుసగా నాలుగో ప్రపంచ కప్‌. 20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో 42.25 సగటుతో 507 పరుగులు చేశాడు. 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

మొర్తజా (బంగ్లాదేశ్‌)
బంగ్లాదేశ్‌ జట్టు ఇన్నేళ్లుగా ఎక్కడో ఒక చోట సంచలనానికి కారణమౌతోందంటే అందుకు పునాది వేసిన వారిలో మొర్తజా ఒకడు. తన వన్డే కెరీర్‌లో ఎక్కువ భాగం కెప్టెన్‌గా వ్యవహరించిన మొర్తజా సమర్థంగా టీమ్‌ను నడిపించాడు. 2007 వరల్డ్‌ కప్‌లో భారత్‌ పతనానికి కారణమై ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన క్షణాన్ని ఎవరూ మరచిపోలేరు. గత ప్రపంచకప్‌లో అతని సారథ్యంలోనే ఇంగ్లండ్‌ను వెనక్కి తోసి బంగ్లాదేశ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా ఎంపికైన అతను వరల్డ్‌ కప్‌ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. తన చివరి టోర్నీలో బంగ్లాకు గొప్ప విజయాలు అందించాలని అతను కోరుకుంటున్నాడు. గాయంతో 2011 ప్రపంచ కప్‌కు దూరమైన అతను 2003నుంచి 3 వరల్డ్‌ కప్‌లలో కలిపి 16 మ్యాచ్‌లలో 36.05 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు.

మలింగ (శ్రీలంక)
మూడు ప్రపంచ కప్‌లు… వరుసగా రెండు ఫైనల్స్‌లో పరాజయం. వన్డే ప్రపంచ కప్‌ను అందుకోలేని లంక అగ్రశ్రేణి క్రికెటర్లలో మలింగ ఒకడు. గాయాలతో 2016 మొత్తం ఆటకు దూరమై, ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు మాత్రమే మ్యాచ్‌లు ఆడుతూ వచ్చిన పేసర్‌ ‘స్లింగ’ ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్‌ వేదికపై నిలబడ్డాడు. ఇటీవల ఐపీఎల్‌తో తన బౌలింగ్‌లో జోరు తగ్గలేదని చూపించిన అతను… ఈసారి మరింత బలహీనంగా కనిపిస్తున్న శ్రీలంకకు ఏమాత్రం ఉపయోగపడగలడో చూడాలి. ఈ మెగా టోర్నీ తర్వాత అతను పూర్తిగా టి20 లీగ్‌లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. గత మూడు ప్రపంచ కప్‌లు ఆడిన మలింగ 22 మ్యాచ్‌లలో 21.11 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు.

షోయబ్‌ మాలిక్‌ (పాకిస్తాన్‌)
సుదీర్ఘ కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాక్‌ కీలక ఆటగాళ్లలో మాలిక్‌ ఒకడు. ఇతను కూడా 1999లోనే వన్డేల్లోకి అడుగు పెట్టాడు. అయితే వేర్వేరు కారణాలతో ఒకే ఒక్క ప్రపంచ కప్‌ (2007) ఆడగలిగాడు. 3 మ్యాచ్‌లలో కలిపి 92 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి అతని అనుభవంపై పాక్‌ అంచనాలు పెట్టుకుంది. మిడిలార్డర్‌లో జట్టును నడిపించగలడని నమ్ముతోంది. వరల్డ్‌ కప్‌ తర్వాత మాలిక్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. తన 20 ఏళ్ల అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ కెరీర్‌లో మాలిక్‌ 283 మ్యాచ్‌లు ఆడి 7522 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సఫారీల కల నెరవేరేనా!
ఒకసారి కాదు…రెండు సార్లు కాదు… ప్రతీ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా గెలుపు ఆశలు ఏదో కారణంతో కుప్పకూలిపోవడం రొటీన్‌గా మారిపోయింది. 1992 నుంచి అన్ని ప్రపంచ కప్‌లలో గెలుపు అవకాశాలు కనిపిస్తూ చివరకు ఓడి ‘చోకర్స్‌’గా సఫారీ జట్టు ముద్ర వేసుకుంది. 2015 సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడి గుండె బద్దలైన క్షణాన సఫారీ జట్టు ఆటగాళ్లంతా చిన్నపిల్లల్లా రోదించారు. నాటి టీమ్‌లో భాగంగా ఉండి ఇప్పుడు ‘ఆఖరిసారి’ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఐదుగురు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. వీరందరికీ ఇదే ఆఖరి ప్రపంచకప్‌ కానుంది. వీరందరికంటే ముందే నా వల్ల కాదు బాబోయ్, ప్రపంచ కప్‌ లేకపోయినా నాకేమీ లోటు లేదంటూ ఏబీ డివిలియర్స్‌ అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించగా… డు ప్లెసిస్, ఆమ్లా, డుమిని, స్టెయిన్, ఇమ్రాన్‌ తాహిర్‌ మరోసారి పోరాడబోతున్నారు (వీరంతా 2011, 2015లలో జరిగిన రెండు ప్రపంచ కప్‌లు ఆడారు). ఈసారైనా వీరి కల నెరవేరుతుందో వేచి చూడాలి.

డు ప్లెసిస్‌: 14 మ్యాచ్‌లలో 53.90 సగటుతో 539 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి.
హషీం ఆమ్లా: 15 మ్యాచ్‌లలో 42.60 సగటుతో 639 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి.
జేపీ డుమిని: 13 మ్యాచ్‌లలో 43.11 సగటుతో 388 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీ ఉన్నాయి.
డేల్‌ స్టెయిన్‌ : 14 మ్యాచ్‌లలో 23.39 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు.
ఇమ్రాన్‌ తాహిర్‌: 13 మ్యాచ్‌లలో 16.31 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments