టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. తమ ఎదుట హాజరుకావాలంటూ బుధవారం ఉదయం 11 గంటల వరకు సమయం ఇస్తూ సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు నోటీసులు జారీచేసినా.. రవిప్రకాశ్ విచారణకు డు మ్మాకొట్టారు. ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా ఆయన నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. విజయవాడలో రవిప్రకాశ్ ఉన్నట్లు గుర్తించారు.

ఫోర్జరీ కేసులో చిక్కుకున్న రవిప్రకాశ్ అజ్ఞాతం నుంచి పంపిన ఈమెయిల్ ఆయన అడ్రస్‌ను పట్టించిందని అంటున్నారు. ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యక్తిగత కారణాల వద్ద ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని తెలుగు టీవీ చానెల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం పంపారు.

విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో 10 రోజుల గడువు కావాలని ఆయన కోరారు. పోలీసులకు ఈ సమాచారం మెయిల్ ద్వారా అందింది. రవిప్రకాశ్ బాటలోనే పయనించిన నటుడు శివాజీ, తనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు కూడా 10 రోజుల గడువు కావాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన ఓ మెయిల్ పంపారు. రవిప్రకాశ్, శివాజీలు పంపిన ఈ-మెయిల్స్ పై సంతృప్తి చెందని పోలీసులు, ఐపీ అడ్రస్ ల ఆధారంగా వీరిద్దరూ విజయవాడలో ఉంటున్నట్టు గుర్తించారని తెలుస్తోంది.

ఏపీలోని అపద్ధర్మ ప్రభుత్వ పెద్దలతో ఉన్న సత్సంబంధాలతో రవిప్రకాశ్ అమరావతిలో ఆశ్రయం పొందినట్టు పోలీసులకు సమాచారం అందిందని ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనుండటంతో వారికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకొంటాడని భావిస్తున్నారు. గురువారం నుంచి ప్రత్యేక బృందాలు తమ పనిని ప్రారంభించే అవకాశాలున్నాయి. రవిప్రకాశ్‌కు సంబంధించిన ఫోర్జరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్నది, న్యాయ సలహాల మేరకు దర్యాప్తులో ముందుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments