ముంబయి కాచుకో!

493

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌12 ఫైనల్లోకి ప్రవేశించింది. క్వాలిఫయర్‌2లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన చెన్నై.. ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో టైటిల్‌ కోసం పోటీపడనుంది. 148 పరుగుల ఛేదనలో ఓపెనర్లు డుప్లెసిస్‌ (50, 39 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), షేన్‌ వాట్సన్‌ (50, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించగా చెన్నై గెలుపు ఖాయం చేసుకున్నది. అంతకుముందు, రిషబ్‌ పంత్‌ (38, 25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), కొలిన్‌ మన్రో (27, 24 బంతుల్లో 4 ఫోర్లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 148/9 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు దీపక్‌ చాహర్‌ (2/28), రవీంద్ర జడేజా (2/23), హర్బజన్‌ సింగ్‌ (2/31), డ్వేన్‌ బ్రావో (2/19) ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ను చిత్తు చేశారు.

ఓపెనర్లు అదరగొట్టారు : క్వాలిఫయర్‌1లో మూకుమ్మడిగా విఫలమైన చెన్నై టాప్‌ ఆర్డర్‌, క్వాలిఫయర్‌2లో సమష్టిగా చెలరేగింది. ఛేదనలో ఓపెనర్లు డుప్లెసిస్‌ (50), షేన్‌ వాట్సన్‌ (50) అర్ధ సెంచరీలతో చెలరేగారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే వాట్సన్‌, డుప్లెసిస్‌ సమన్వయ లోపంతో పరుగు తీస్తూ పిచ్‌ మధ్యలో ఉండిపోయారు. ఢిల్లీ రనౌట్‌ అవకాశం చేజార్చుకున్నది. అక్కడితో ఓపెనర్ల వీరంగం మొదలైంది. తొలుత డుప్లెసిస్‌ దూకుడు చూపించాడు. ఇషాంత్‌ శర్మ వేసిన ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లతో పవర్‌ ప్లేలో చెన్నై ఆధిపత్యం నిలిపాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన డుప్లెసిస్‌.. బౌల్ట్‌ బౌలింగ్‌లో వికెట్‌ కోల్పోయాడు. కీమో పాల్‌ వేసిన ఓవర్లో విశ్వరూపంతో 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ షేన్‌ వాట్సన్‌.. ఆ ఓవర్లో వరుసగా 6, 4, 6, 6తో 25 పరుగులు పిండుకున్న వాట్సన్‌.. తర్వాతి ఓవర్లో మిశ్రా బంతికి నిష్క్రమించాడు. ఎం.ఎస్‌ ధోని (9), సురేశ్‌ రైనా (11) నిరాశపరిచినా.. డ్వేన్‌ బ్రావో (4 నాటౌట్‌)తో కలిసి అంబటి రాయుడు (20 నాటౌట్‌, 20 బంతుల్లో 3 ఫోర్లు) లాంఛనం ముగించాడు.
చెన్నై స్పిన్‌ మాయ : టాస్‌ నెగ్గిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఛేదనకు మొగ్గుచూపింది. ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ పృథ్వీ షా (5) నిరాశపరిచాడు. ఓ బౌండరీతో మెరిసిన షా.. దీపక్‌ చాహర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (18) మూడు ఫోర్లతో ధనాధన్‌ అనిపించినా, వికెట్‌ నిలుపుకోలేదు. హర్బజన్‌ బంతికి ధోని చేతికి చిక్కాడు. 37/2తో ఢిల్లీ ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో స్థానంలో వచ్చిన కొలిన్‌ మన్రో (27, 24 బంతుల్లో 4 ఫోర్లు), కెప్టెన్‌ శ్రేయాష్‌ అయ్యర్‌ (13, 18 బంతుల్లో 1 ఫోర్‌) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే ప్రయత్నం చేశారు. మన్రో నాలుగు ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. కానీ స్పిన్‌ అస్త్రం సంధించిన చెన్నై.. క్యాపిటల్స్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. డ్వేన్‌ బ్రావో నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. నాలుగు ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి ఢిల్లీపై ఒత్తిడి పెంచాడు. అక్షర్‌ పటేల్‌ (3), కీమో పాల్‌ (3) బ్రావోకు పడిపోగా.. మన్రో, బౌల్ట్‌ (6)ను జడేజా పడగొట్టాడు. శ్రేయష్‌ అయ్యర్‌ను తాహీర్‌ సాగనంపాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఏ దశలోనూ మెరుగైన స్కోరు దిశగా సాగలేదు.
పంత్‌ పోరాటం : ఎలిమినేటర్‌లో విరుచుకుపడిన రిషబ్‌ పంత్‌ (38, 25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ కింగ్స్‌పై మెరువలేదు!. సహచరులు నిష్క్రమిస్తున్నా.. ఓ ఎండ్‌లో నిలిచి పోరాడినా భారీ షాట్లు ఆడలేదు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌కే పరిమితమయ్యాడు. తాహీర్‌ బౌలింగ్‌లో చాహర్‌ క్యాచ్‌ అందుకుని, బౌండరీ లైన్‌ దాటడంతో పంత్‌ మరికొంత సేపు క్రీజులో నిలిచాడు. పంత్‌ను చెన్నై బౌలర్లు నిలువరించినా, అతడు 38 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివరి నాలుగు ఓవర్లలో 42 పరుగులు సాధించిన ఢిల్లీ 147/9తో గౌరవప్రద స్కోరు చేసింది. ఇషాంత్‌ శర్మ (10 నాటౌట్‌, 3 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), అమిత్‌ మిశ్రా (6 నాటౌట్‌, 3 బంతుల్లో 1 ఫోర్‌), ట్రెంట్‌ బౌల్ట్‌ (6, 3 బంతుల్లో 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ చివరి 8 బంతులకు 22 పరుగులు పిండుకున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ : పృథ్వీ షా (ఎల్బీ) చాహర్‌ 5, శిఖర్‌ ధావన్‌ (సి) ధోని (బి) హర్బజన్‌ 18, కొలిన్‌ మన్రో (సి) బ్రావో (బి) జడేజా 27, శ్రేయాష్‌ అయ్యర్‌ (సి) రైనా (బి) తాహీర్‌ 13, రిషబ్‌ పంత్‌ (సి) బ్రావో (బి) చాహర్‌ 38, అక్షర్‌ పటేల్‌ (సి) తాహీర్‌ (బి) బ్రావో 3, రూథర్‌ఫోర్డ్‌ (సి) వాట్సన్‌ (బి) హర్బజన్‌ 10, కీమో పాల్‌ (బి) బ్రావో 3, అమిత్‌ మిశ్రా నాటౌట్‌ 6, ట్రెంట్‌ బౌల్ట్‌ (బి) జడేజా 6, ఇషాంత్‌ శర్మ నాటౌట్‌ 10, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం :(20 ఓవర్లలో 9 వికెట్లకు) 147.
వికెట్ల పతనం : 1-21, 2-37, 3-57, 4-75, 5-80, 6-102, 7-119, 8-125, 9-137.
బౌలింగ్‌ : దీపక్‌ చాహర్‌ 4-0-28-2, షార్దుల్‌ ఠాకూర్‌ 1-0-13-0, హర్బజన్‌ సింగ్‌ 4-0-31-2, రవీంద్ర జడేజా 3-0-23-2, ఇమ్రాన్‌ తాహీర్‌ 4-0-28-1, డ్వేన్‌ బ్రావో 4-0-19-2.
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌ : డుప్లెసిస్‌ (సి) పాల్‌ (బి) బౌల్ట్‌ 50, షేన్‌ వాట్సన్‌ (సి) బౌల్ట్‌ (బి) మిశ్రా 50, సురేశ్‌ రైనా (బి) అక్షర్‌ పటేల్‌ 11, అంబటి రాయుడు నాటౌట్‌ 20, ఎం.ఎస్‌ ధోని (సి) కీమో పాల్‌ (బి) ఇషాంత్‌ 9, డ్వేన్‌ బ్రావో నాటౌట్‌ 4, ఎక్స్‌ట్రాలు :11, మొత్తం : (19 ఓవర్లలో 4 వికెట్లకు) 151.
వికెట్ల పతనం: 1-81, 2-109, 3-127, 4-146.
బౌలింగ్‌ : ట్రెంట్‌ బౌల్ట్‌ 4-0-20-1, ఇషాంత్‌ శర్మ 4-0-28-1, అక్షర్‌ పటేల్‌ 4-0-32-1, అమిత్‌ మిశ్రా 4-0-21-1, కీమో పాల్‌ 3-0-49-0.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here