తెలంగాణ డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఏడాది కిందటే రూ.7,500 కోట్లకు చేరిన అప్పులు ఇప్పుడు రూ.10 వేల కోట్లకు పెరిగిపోయాయి. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన డిస్కంల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కరెంట్‌ కొనుగోళ్లకు చెల్లింపులు కనాకష్టంగా మారాయి. దాంతో ”వెంటనే రూ.3,000 కోట్లు ఇవ్వండి. రూ.5,000 కోట్లను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) ద్వారా బాండ్ల రూపేణా సమీకరించడానికి అనుమతి ఇవ్వండి” అంటూ వినతుల మీద వినతులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం ఏడాదిన్నరలోనే ప్రభుత్వానికి తెలంగాణ ట్రాన్స్‌కో ఏకంగా 15 వరకూ లేఖలు రాసింది. ఒక్క దానికీ జవాబు లేదు! డిస్కంల ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని; డబ్బులు ఇవ్వకపోతే నడి వేసవిలో విద్యుత్తు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని ముందుగానే హెచ్చరించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెప్పవాల్చకుండా విద్యుత్తును సరఫరా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో, రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా కోసం డిస్కంలు దీర్ఘకాలిక, తాత్కాలిక ప్రాతిపదికన కొనుగోళ్లు చేశాయి. రైతులు వద్దంటున్నా.. చాలామంది మంత్రులు వ్యతిరేకించినా.. ప్రభుత్వ ఒత్తిడితో గత ఏడాది జనవరి నుంచి వ్యవసాయ రంగానికి డిస్కమ్‌లు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాయి. ఇందుకు భారీగా కొనుగోళ్లు చేస్తున్నాయి. ఆయా సంస్థలకు ఇప్పుడు ఏకంగా రూ.10 వేల కోట్ల వరకూ బాకీ పడ్డాయి. ఒక్క ఎన్టీపీసీకే రూ.3000 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉండగా.. ఛత్తీ్‌సగఢ్‌కు రూ.1600 కోట్ల వరకూ; మిగిలిన సంస్థలకు మరో రూ.3000 కోట్ల వరకూ కట్టాల్సి ఉంది. సింగరేణికి ఇంకో రూ.2000 కోట్ల మేర బకాయి పడ్డాయి. ఇక, తెలంగాణకు 3 వేల మెగావాట్ల దాకా సౌర విద్యుత్తును అందించే సంస్థలకు కూడా ఆర్నెల్లుగా చెల్లింపులు లేవు.

ప్రభుత్వ కార్యాలయాల బకాయిలే 8 వేల కోట్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు డిస్కమ్‌లకు చెల్లించాల్సిన కరెంట్‌ బకాయిలు అక్షరాలా రూ.8 వేల కోట్లు. ఆయా శాఖలు నెలనెలా బిల్లులు చెల్లించడం లేదు. దాంతో, బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇవి 2017లో రూ.3,549 కోట్లుగా ఉండగా.. 2018 డిసెంబరు నెలాఖరుకు రూ.5,970 కోట్లకు; ప్రస్తుతం రూ.8 వేల కోట్లకు చేరుకున్నాయి. వీటిలో పంచాయతీల బకాయిలే రూ.3 వేల కోట్లు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన బాకీలు మరో రూ.2800 కోట్లు. ప్రభుత్వ శాఖలు తమ తమ కరెంట్‌ బిల్లులను చెల్లించినా డిస్కమ్‌లు ఆర్థిక సంక్షోభం నుంచి గ ట్టెక్కుతాయని అధికారులే చెబుతున్నారు.

కరెంటు సరఫరా చేయలేం

అప్పులు, ఆర్థిక లోటు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కరెంటు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని ట్రాన్స్‌కో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర విద్యుత్తు డిమాండ్‌ 10 వేల మెగావాట్లకు చేరిందని, వేసవిలో ఇది కాస్తా 11 వేల మెగావాట్లకు చేరుతుందని, ఆ మేరకు సరఫరా చేసేందుకు ఇప్పటికే కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని ఆ నివేదికలో పేర్కొంది. డిస్కంల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిన నేపథ్యంలో సత్వరమే తక్షణ ఉపశమనంగా రూ.3000 కోట్లు ఇవ్వాలని మూడు నాలుగు నెలల కిందటే కోరింది. లేకపోతే, విద్యుత్తు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. అయితే, మార్చిలో డిమాండ్‌ 10,800 మెగావాట్లకు చేరినా డిస్కంలు ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా చేయడం గమనార్హం.

ప్రభాకర్‌ రావు కొనసాగేనా!?

విద్యుత్తు సంస్థల సీఎండీ ప్రభాకర్‌ రావు తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారా!? పరిస్థితి బాగున్నప్పుడే వైదొలగాలని ఆయన భావిస్తున్నారా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి విద్యుత్తు వర్గాలు. తెలంగాణ ఆవిర్భవించిన వెంటనే 2014 జూన్‌ 4వ తేదీన విద్యుత్తు సంస్థల సీఎండీగా ఆయన నియమితులయ్యారు. వచ్చే నెలలో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎండీ బాధ్యతల నుంచి గౌరవంగా తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

వద్దంటే జీతాల పెంపు

విద్యుత్తు శాఖలో చీఫ్‌ ఇంజనీర్‌ జీతం రూ.4 లక్షలపైనే ఉండగా.. రాష్ట్రంలోని 40 వేల మందికిపైగా విద్యుత్తు ఉద్యోగులకు బాస్‌గా ఉన్న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీతం రూ.3 లక్షల్లోపే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే విద్యుత్తు ఉద్యోగులకు తొలి విడతలో 30ు ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా తొమ్మిది నెలల కిందట మరో 35ు పెంచింది. దాంతో, నాలుగున్నరేళ్లలోనే ఉద్యోగుల వేతనాలను ఏకంగా 65ు పెంచాల్సిన పరిస్థితి డిస్కమ్‌లకు అనివార్యంగా ఏర్పడింది. 9 నెలల క్రితం వేతనాల పెంపు ప్రతిపాదన వచ్చినప్పుడు 25ు-27ు చాలని, అంతకుమించి పెంచవద్దని విద్యుత్తు పెద్దలు విజ్ఞప్తి చేశారు. సీఎం ఏకంగా 35ు ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. దాంతో, వేతనాలకే ఏకంగా ఏడాదికి రూ.2వేల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments