ప్రస్తుతం రాజ్యాంగ విరుద్ధమైన పాలనను ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో భారీగా డబ్బును కుమ్మరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ప్రతీ నియోజకవర్గానికి రూ.25 కోట్లు దించారనీ, ఈ విషయాన్ని స్వయానా జనసేన అధినేత పవన్ కల్యాణే చెప్పారని తెలిపారు. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో కాంగ్రెస్ కు ఓటేస్తే వైసీపీకి వేసినట్లేనని చంద్రబాబు ఊదరగొట్టారని ధర్మాన గుర్తుచేశారు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే జగన్ కు వేసినట్లే అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఐదేళ్లలో రైతులను పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు సమీపించగానే హామీలు గుమ్మరిస్తున్నారని దుయ్యబట్టారు.

పొలవరం ప్రాజెక్టులో గేట్లు ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ఏకంగా రూ.400 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఈ ఎన్నికలు వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here