యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆదివారం సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం యాదాద్రిలో ప్రధానాలయ నిర్మాణపనులను పరిశీలించనున్నారు. కొండపైకి వచ్చే భక్తులకు మంచినీటి సరఫరా చేసే సీఎం కేసీఆర్ విషయంపై ఆరాతీస్తారు. గ్రావిటీ ద్వారా తాగునీటిని చేరవేసే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మిషన్ భగీరథ అధికారులతో చర్చిస్తారు. రాయగిరి నుంచి యాదాద్రి వరకు ఏర్పాటుచేసిన గ్రీనరీ పరిరక్షణ, టెంపుల్‌సిటీలో బ్యూటిఫికేషన్ పనులను వేసవిలో పరిరక్షించే విషయంపై అటవీశాఖ అధికారులతో చర్చిస్తారు. గిరిప్రదక్షిణ రోడ్డు నిర్మాణం పనులను స్వయంగా పరిశీలిస్తారు. గిరిప్రదక్షిణకు అడ్డుగా ఉన్న వంద ఇండ్లను ప్రస్తుతం తొలగించకుండా పనులను చేపట్టాలనే విషయంపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు విడిదిచేయడానికి ఉద్దేశించిన ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం కోసం సేకరించిన పదమూడున్నర ఎకరాలల్లో చేపట్టనున్న పనుల విషయంలో అధికారులకు తగిన సూచనలు చేయనున్నట్టు సమాచారం. సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అనిల్‌కుమార్ యాదాద్రికి చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments