ఓట్ల దొంగలొస్తారు.. జాగ్రత్త

526

ఎన్నికలు సమీపించేకొద్దీ మనముందుకు ఓట్ల దొంగలు వస్తారని, వారు చెప్పే మాయమాటలకు లొంగకుండా జాగ్రత్తగా నడుచుకోవాలని సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణగృహనిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు సూచించారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలోనూ, మండలంలోని 74 ఉడేగోళం, ఆవులదట్ల, వేపరాల గ్రామాల్లోనూ శనివారం ఆయన మహిళాసంఘాల సభ్యులకు పసుపు- కుంకుమ చెక్కులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. అంతకుముందు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోకపోయినా.. అన్నగా నేనున్నానంటూ వృద్ధులు, మహిళలకు ఆత్మబంధువుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారన్నారు. దొంగల చేతికి అధికారమిస్తే రావణరాజ్యం కావడం తథ్యమన్నారు. చేసిన మంచిని చూసి ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు మనచుట్టూ తిరుగుతున్నాయన్నారు.

వారు అధికారంలోకి వస్తే మన బతుకులు పదేళ్లు వెనక్కు వెళ్లే ప్రమాదముందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి ఒక్క చంద్రబాబుకే ఉందని, ఆయన నాయకత్వాన్ని మనమందరం బలపరచాలన్నారు. మహిళాసంఘాల సభ్యులకు రూ. పది వేలు చొప్పున అందజేయడం అదృష్టమన్నారు. డ్వాక్రాసంఘాల మహిళలకు రూ. 14 వేల కోట్లు మూడు విడతలుగా పసుపు-కుంకుమ కింద చెల్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ. 200 ఉన్న పింఛన్‌ రూ. రెండు వేలకు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతమన్నారు.

ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం ఆవిష్కృతం కావాలని నిరంతరం సీఎం తపన పడుతున్నారన్నారు. కుర్చీపై మోజుతో కుల, వికృత రాజకీయాలకు పాల్పడే వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కొల్లగొట్టిన ప్రజాధనంతో వైసీపీ అధినేత జగన్‌ సాక్షి పత్రిక స్థాపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముదిగల్లు జ్యోతి, కమిషనర్‌ ఇబ్రహీం సాబ్‌, వైస్‌ చైర్మన్‌ నల్లపూల వెంకటేసులు, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ బంగి ఉమాశంకర్‌, ప్రత్యేకాధికారి గీతాలక్ష్మి, తహసీల్దార్‌ నాగరాజు, వెలుగు ఏసీ గంగాధర, కౌన్సిలర్లు అరుడప్ప, రాజశేఖర్‌, కడ్డిపూడి మహబూబ్‌ బాషా, టీడీపీ అధ్యక్షుడు పసుపులేటి రాజు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here