‘అటు పార్లమెంట్ సమావేశాలు. ఇటు అసెంబ్లీ సమావేశాలు. ఈ 60రోజులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఫిబ్రవరి 1న రాష్ట్రానికి బ్లాక్‌డే. కేంద్రం ఇప్పటికి ఐదు బడ్జెట్లు పెట్టి మనల్ని మోసం చేసింది. ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో శాంతియుతంగానే మన నిరసనలు తెలిపాలి. రాష్ట్ర రాబడికి నష్టం కలిగేలా నిరసనలు ఉండకూడదు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎలక్షన్ మిషన్- 2019’పై బుధవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు, బూత్ కన్వీనర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విపత్తు సాయంలోనూ ఏపీపై మోదీ వివక్షత చూపారన్నారు. మహారాష్ట్రకు రూ.4,717 కోట్లు ఇచ్చి, ఏపీకి రూ.900కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. తితలీ, పెథాయ్ తుఫాన్ల సాయం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అడుగడుగునా ఏపీపై బీజేపీ వివక్ష చూపుతోందని ఆయన అన్నారు.