సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కమలంను వీడి జనసేనలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. విశాఖపట్నంకు చెందిన బీజేపీ కీలక నేత చెరువు రామకోటయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పలువురు బీజేపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం పార్టీకి రావెల కిషోర్ బాబులు కూడా గతంలోనే రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. రాజీనామాల పరంపర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తాకింది.
వైసీపీకి ఆదిశేషగిరి రావు గుడ్ బై!
తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు, జగన్కు సన్నిహితంగా మెలిగిన ఈయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇది వైసీపీకి ఊహించని షాక్. ఆయన గుంటూరు లోకసభ స్థానం అడిగితే, జగన్ విజయవాడ లోకసభ స్థానం ఇచ్చేందుకు మొగ్గు చూపడం వల్లే ఆయన పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు.