ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ నాయకుల స్వరంలో తెలియకుండానే మార్పులు వచ్చేస్తాయి. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి నాలుగేళ్ళు దాటుతోంది. మధ్యలో బీజేపీ, టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగినా కూడా ఎందుకో అది జరగలేదు. ఇపుడు ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేశాయి. దాంతో కొణతాల కూడా తన రూట్ ఎటో చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపధ్యంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని కొనియాడుతూ మీడియా మీట్ లో మాట్లాడడం విశేషం. ఇన్నాళ్ళు బాబు పొడ గిట్టనట్లుగా వ్యవహ‌రించిన కొణతాలలో ఉన్నట్లుండి ఈ మార్పు రావడానికి కారణం ఎన్నికల రాజకీయమేనని అంతా భావిస్తున్నారు.

బాబుపై కక్ష సాధింపు….

ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కొణతాల రామకృష్ణ ఆరోపించారు. బాబు విషయంలో అన్నింటా మోడీ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆ విధంగా చేయడం ద్వారా బాబును అడ్డుకుంటున్నామని భావిస్తున్నారని , అయితే ఏపీలోని అయిదు కోట్ల జనాన్ని మోడీ మోసం చేస్తున్నారని కొణతాల మండిపడడం గమనార్హం. ఏపీ అభివృధ్ధి ఆగిపోవడానికి మోదీయే కారణమని మాజీ మంత్రి ఆరోపించారు. ఎన్నికల్లో చెప్పిన మాట‌లకు, హామీలకు దిక్కు లేకుండా పోయిందని కొణతాల అన్నారు. ఇంతకు ఇంత ఫలితాన్ని మోడీ పార్టీ బీజేపీ ఏపీలో అనుభవిస్తుందని కూడా శాపనార్ధాలు కూడా పెట్టారు.

టీడీపీలోకి ఖాయం…..

మాజీ మంత్రి మాటలను బట్టి చూస్తూంటే ఆయన తొందరలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారన్నది అర్ధమైపోతోంది. ఏపీని బాబు అభివృధ్ధి చేస్తున్నారని, మోడీ అడ్డుకుంటున్నరని అచ్చం టీడీపీ తమ్ముళ్ళ భాషను కొణతాల వాడడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు అంటున్నారు. పలు మార్లు అనకాపల్లి ఎంపీగా గెలిచిన కొణతాలను వచ్చె ఎన్నికల్లో తిరిగి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించేందుకు టీడీపీ సాగిస్తున్న తెర వెనక ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మాజీ మంత్రి తొందరలోనే పసుపు కండువా కప్పుకోవడం తధ్యమన్న మాట గట్టిగా వినిపిస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments