ఏపీలో టీడిపి బీజేపి మద్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భావోద్వేగాలు మరింత తారాస్థాయికి వెళ్తున్నాయి. ఈ నేపథ్యలో ఏపీ టీడిపి నేతలు బీజేపి అగ్ర నేతలతో పాటు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి ప్రధాని మోడీ శకుని పాత్ర పోషిస్తున్నారని ఏపీ ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. వచ్చే 6వ తేదీన మోడీ రాష్ట్ర పర్యటనపై ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా మోడీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని బుద్దా నిలదీశారు. ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే మోడీ రాష్ట్రానికి రావాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కు మాయ మాటలు చెప్పి ఏపీపైకి ఉసిగొల్పుతున్నారని అన్నారు. మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ జనవరి 6వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేపడతానని బుద్దా వెంకన్న ప్రకటించారు.

ఇదిలా ఉండగా ప్రధాని మోడీ ఏ మొహం పెట్టుకుని గుంటూరు వస్తారని వినుకొండ శాసనసభ్యుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీ.వీ.ఆంజనేయులు మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో మాకు సంబంధం లేదని ప్రణాళికా సంఘం చెప్పినా మోడీ రాష్ట్రానికి హోదా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించడానికి సహకరిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆంజనేయులు ప్రధాని మోడీని ప్రశ్నించారు.

దోలేరా నగరానికి వేల కోట్లు రూపాయల నిధులు ఇచ్చిన కేంద్రం అమరావతి కి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. జాతీయ సంస్ధలు మంజూరు చేసి ఒక్కదానికి కూడా పూర్తి స్ధాయిలో నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. విభజన అంశాలు ఎందుకు అమలు చేయలేదో రాష్ట్రప్రజలకు వివరించిన తర్వాత ఏపి ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆ తరువాత మోడీ రాష్ట్రంలో అడుగుపెట్టాలని ఆజంనేయులు అన్నారు. మరి ఏపి టీడిపి నేతల కౌంటర్ కు బీజేపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments