టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై ఐటీ పంజా విసిరింది. చెన్నైలోని  మాగుంటకు చెందిన పలు కంపెనీలు, వాటి కార్యాలయాల్లో ఐటీ అధికారులు  పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఒకేసారిగా అధికారులు మూకుమ్మడి దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.55 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు పలు కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల చెన్నైలో బంగారం హవాలా రాకెట్‌ను పట్టుకున్న పోలీసులు విచారణ జరపగా పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు బయట పడినట్లు తెలుస్తోంది.

ఆ విచారణ ఆధారంగా ఐటీ అధికారులు చెన్నై ప్రాంతంలో దాదాపు 40 చోట్ల ఏకకాలంలో దాడులకు దిగారు. రెండు రోజలుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ మాగుంట కంపెనీలపైన ఐటీ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయాన్నే ఐటీ అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి చెన్నై నగర శివార్లలోని పూందమల్లి ప్రాంతంలో ఉన్న మాగుంటకు చెందిన బాలాజీ డిస్టిలరీ కంపెనీలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.55 కోట్ల నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మిగిలిన అధికారుల బృందం టీ నగర్‌లో ఉన్న మాగుంట ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 మాగుంటకు చెందిన కంపెనీలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులకు దిగడంతో నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో మాగుంటకు చెందిన కంపెనీలు, కార్యాలయాల్లో అలజడి రేగింది. మాగుంట అనుచరులతో పాటు ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో వారు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి చెన్నైలోని మాగుంట కంపెనీలు, కార్యాలయాలపైనే ఐటీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

బెంబేలెత్తుతున్న అధికార పార్టీ నేతలు :
ఇటీవలే జిల్లాలోని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సీ ఫుడ్స్, ప్రాసెసింగ్‌ యూనిట్లతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపైనా ఐటీ పెద్ద ఎత్తున దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొంత నగదుతో పాటు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంతలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన ఎమ్మెల్సీ మాగుంటపైన ఐటీ దాడులకు దిగడంతో తెలుగుదేశం ముఖ్యనేతలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో అధికార పార్టీలో చాలా మంది నేతలు గ్రానైట్‌తో పాటు సీఫుడ్స్‌ వ్యాపారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. విదేశీ ఎగుమతులతో కోట్లాది రూపాయల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో వారంతా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు నగదుతో పాటు వ్యాపారలావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను రహస్య ప్రదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments