2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరి కొద్దిసేపట్లో మొదలుకానుంది. ఇప్పటికే పోలింగ్ జరగనున్న 32,574 అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మొత్తం 119 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 1821 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి వీవీప్యాట్‌లను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఈవీఎంలకు అనుసంధానమై ఉండే వీవీప్యాట్‌లతో ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశామనేది చూసుకోవచ్చు. ఓటేసిన వెంటనే తమ ఓటు ఎవరికి నమోదైందో ఓటరు వీవీప్యాట్‌లో చూసుకోవచ్చు.

వీటిపై నిషేధం

పోలింగ్‌బూత్‌లలో సెల్‌ఫోన్‌లను నిషేధించారు. అలాగే పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలపై కూడా ఆంక్షలు విధించారు. మద్యం తాగి పోలింగ్ కేంద్రాలకు వస్తే అరెస్టు చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.ఓటర్లను ఎవరైనా ప్రలోభపెడితే డయల్ 100కు కాల్ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఉర్దూ, మరాఠీలో ఓటర్ల జాబితా

హైదరాబాద్‌ జిల్లాలో ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి 15 నియోజకవర్గాలతో పాటు, నిజామాబాద్‌ జిల్లాలోని నిజామాబాద్‌ (అర్బన్‌) నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను ఉర్దూలో కూడా ఎన్నికల సంగం ప్రచురించింది. అలాగే, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌, నిర్మల్‌ జిల్లా ముథోల్‌, నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ నియోజకవర్గాల్లో మరాఠీ భాషలో ఓటర్ల జాబితాను వెలువరించింది.

రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలు 119
మొత్తం ఓటర్లు 2,80,64,684
పోటీ చేస్తున్న అభ్యర్థులు 1821
మొత్తం ఈవీఎంలు 55, 329
మొత్తం వీవీప్యాట్లు 42, 751
పోలింగ్ నిర్వహణ కేంద్రాలు 32,574
పోలింగ్ సిబ్బంది 1,50,023
పోలీసు బలగాలు 48,860

ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో…

టీఆర్ఎస్ 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ టీడీపీ, టీజేఎస్‌,సీపీఐలతో కలిసి ప్రజాఫ్రంట్‌గా ఏర్పడి పోటీకి దిగాయి. బీజేపీ 118 స్థానాల్లో పోటీలో ఉంది.

భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో యువతెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి మద్దతిచ్చిన బీజేపీ అక్కడ తన అభ్యర్థిని నిలబెట్టలేదు.

ప్రజాఫ్రంట్ తరఫున కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో పోటీ చేస్తుండగా, టీడీపీ 11 స్థానాల నుంచి టీజేఎస్ 8 స్థానాల నుంచి, సీపీఐ 3 స్థానాల నుంచి బరిలోకి దిగాయి. బహుజన్ లెఫ్ట్ర్ ఫ్రంట్ 119 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం 8 స్థానాల్లో బరి దిగింది.

భారీ భద్రత

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నేడు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

30 వేల రాష్ట్ర పోలీసులు, 279 కంపెనీల పారా మిలటరీ బలగాలు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments