తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది బుధవారం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు, ప్రజల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఎవరికి మద్దతు ఇవ్వాలనేదానిపై అభిప్రాయాన్ని తెలపాలని ఆయా వర్గాలు జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ పై వత్తిడి తేవడంతో దానిపై ఈనెల 5వ తేదీన తెలియచేస్తామని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మరోపక్క తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో పవన్‌కల్యాణ్‌ అభిమానులు రెండుగా చీలిపోయి ఒక్కో పార్టీకి మద్దతు ఇస్తుండడం వివాదాస్పదమవుతోంది. రాష్ట్రంలోని సూర్యాపేట్‌ జిల్లాలో ఎవరికి మద్దతు ఇవ్వాలనేదానిపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అభిమానుల మధ్య విబేధాలు తలెత్తాయి. హుజూర్‌నగర్‌లో ఇటీవల ఒక సమావేశం ఏర్పాటు చేసిన కొందరు జనసేన కార్యకర్తలు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై మిగిలిన సభ్యులు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ అధిష్టానవర్గానికి తెలియకుండా, జిల్లాల్లో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం ఏమిటని మరికొందరు కార్యకర్తలు నియోజకవర్గంలో నిరసనకు దిగారు. దీంతో ఇక్కడ రెండుగా చీలిపోయినట్లయింది. ఈ విషయం పార్టీ అధినేత దృష్టికి రావడంతో రాష్ట్ర నాయకత్వంతో తమ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వ లేదని ప్రకటన చేయించాల్సి వచ్చింది. వీటన్నింటి దృష్ట్యా ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేదానిపై తన నిర్ణయాన్ని ప్రకటించడం తప్పనిసరి అయ్యింది.

కాగా జనసేన పార్టీకి తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలను అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శిస్తుండడంతో ఆ పార్టీలతో కూడిన మహాకూటమికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి పోటీ చేసేందుకు చివరి వరకూ పట్టు విడవ కుండా శత విధాలుగా ప్రయత్నాలు చేసిన సిపిఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌)కు జనసేన ఎంత వరకూ మద్దతు ఇస్తుందనేది తెలియాల్సి ఉంది. మరోపక్క టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఉన్న సత్‌ సంబంధాల నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదని జనసేన పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీలో నిలుస్తుందని, తప్పకుండా తమ ఉనికి చాటుతుందని భావించిన పవన్‌కల్యాన్‌ అభిమానులకు పోటీకి దిగకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది.

నామినేషన్లు ముగింపు దగ్గర పడుతున్నా ఆ పార్టీ నుండి ఒక్క అభ్యర్థి పేరునూ ప్రకటించ లేదు. 2019లో జరగాల్సిన సాధారణ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి, రాష్ట్రంలోని 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయవచ్చని భావించిన జన పవన్‌కల్యాన్‌ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావడంతో పోటీ చేయాలనే నిర్ణయాన్ని విరమించారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో క్షేత్ర స్తాయి కేడర్‌ పూర్తిగా బలోపేతం కాలేదు. ఒక వేళ పోటీ చేయాలనుకున్నా తగిన సమయం లేదు. ఎలాంటి కసరత్తులు లేకుండా బరిలోకి దిగితే పార్టీకి నష్టమనే అభిప్రాయంతో పవన్‌కల్యాణ్‌ పోటీకి దిగకుండా మిన్నకుండిపోయారు.

2019లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు పోటీ చేయాలని నిర్ణయించారు. మరోపక్క తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయనేది పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు పవన్‌కల్యాణ్‌ ఎన్నోసార్లు కితాబునిచ్చారు. మూడో ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో జవివిధ జాతీయ నాయకులను కేసీఆర్‌ కలిసే సమయంలో పవన్‌కల్యాణ్‌ ఆయన ప్రయత్నాన్ని ప్రశంసించారు. అంతేకాకుండా ఆ ఫ్రంట్‌లో తాము కూటా భాగస్వామ్యం అవుతాయని స్పష్టం చేశారు. దీంతో టిఆర్‌ఎస్‌కు పవన్‌కల్యాణ్‌ మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీనికి తగినట్లుగా తెలంగాణ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ను కూడా తమతో కలుపుకొని ఆయన క్రేజ్‌నును కూడా వాడుకుని కొన్ని సీట్లయినా గెలవాలని తొలుత సీపీఎం గట్టి ప్రయత్నాలు చేసింది. ఇందులోభాగంగా బహున లెఫ్ట్‌ ఫ్రంట్‌లోకి రావాల్సిందిగా సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అహ్వానించారు. అందుకోసం రెండు విడతలుగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చలు కూడా జరిపారు.

మరోవిడత పవన్‌కల్యాణ్‌తో జరగాల్సిన చర్చలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనేపథ్యంలో సిపిఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌కు పవన్‌కల్యాణ్‌ మద్దతు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదనే వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తామనేదానిపై 5వ తేదీన పవన్‌కల్యాణ్‌ తేల్చనుండడంతో రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments