బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించాలని రాజేంద్రనగర్‌ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ చంద్రకళ తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నికల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆవరణలో గల ఈవీఎం డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ వద్ద ఆమె మంగళవారం ఆంధ్రజ్యోతితో ఎన్నికల నిర్వాహణ కోసం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. నియోజకవర్గంలో 4,40,867 మంది ఓటర్లుండగా 4 లక్షల మందికి ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ నెల 7న జరిగే పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు 5 వేల మంది ఎన్నికల సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. పోలింగ్‌ స్టేషన్లలో విద్యుత్‌ సౌకర్యంతోపాటు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం, వికలాంగులకు ర్యాంప్‌లు ఏర్పాటు, వారు ఓటు హక్కు వినియోగించడానికి వీలుగా ఆటోల సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుందని, ఆ తర్వాత ఎవరైనా ప్రచారం చేసినట్లయితే వారికి ఆర్‌.పీ యాక్ట్‌ ప్రకారం నోటీసులు అందజేస్తామన్నారు. నియోజకవర్గంలో 441 పోలింగ్‌స్టేషన్లు, 10 యాగ్జలరీ పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఎవరైనా డబ్బులు పం పిణీ చేసినా, మద్యం పంపిణీ చేసినా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. అలా ఎక్కడైనా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రానికల్లా ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలను అందజేయడం జరుగుతుందని, వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆవరణ నుంచి బస్సుల ద్వారా ఆయా పోలింగ్‌ స్టేషన్లకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు

ఈ నెల 11న రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు పాల్మాకులలోని ఓల్డ్‌ విజయ్‌కృష్ణ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉంటుందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి చంద్రకళ తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments