ముందుగా ఊహించిన విధంగానే మాజీ మంత్రి, ప్రత్తిపాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. స్వయంకృతంతో మంత్రి పదవిని పోగొట్టుకున్న ఆయన… నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తిరిగి టీడీపీ అసెంబ్లీ టిక్కెట్టు కూడా దక్కదని భావించే కొద్ది కాలంగా పక్క చూపులు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పయనం వైసీపీలోకా, జనసేనలోకా అనే సందేహం ఇప్పటి వరకు పార్టీ శ్రేణుల్లో నెలకొని ఉంది. మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచే ఆయన ఒక రకంగా పార్టీపై తిరుగుబాటు ధోరణితో వ్యవహరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంద కృష్ణ మాదిగ మంగళగిరి సమీపంలో నిర్వహించిన సభకు రావె ల ఆధ్వర్యంలో జన సమీకరణ జరగడం అప్పట్లో వివాదమైంది. ఆ సభను విజయవంతం చేయా ల్సిందిగా ఆయన ఫొటోతో ఫ్లెక్సీలను పలు చోట్ల ఏర్పాటు చేశారు. దానిని ఆయన ఖండించకపోగా అదే సమయంలో మంద కృష్ణ మాదిగతో సమావేశమైనట్లు కూడా వార్తలు వచ్చాయి.

అదే సమయంలో టీడీపీని నిత్యం విమర్శించే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్ళి ఆయనతో భేటీ కావడం అప్పట్లో పార్టీ వర్గాల విమర్శలకు దారితీసింది. రావెల మంత్రిగా ఉన్న ప్పుడు అదే కన్నాను విమర్శించే వారు. బీజేపీలో కన్నా చేరికపై విమర్శలు సంధించిన రావెల తన మంత్రి పదవి పోయిన తరువాత ఆయనను కలవటం విశేషం. ఇటీవల నియోజకవర్గం పరిధిలోని వట్టిచెరుకూరు మండలంలో జరిగిన సంఘటనలు కూడా రావెల టీడీపీలో కొనసాగే ఉద్దేశంలో లేరని వెల్లడి చేశాయి.

2014లో తెలుగుదేశంలో రావెల ప్రస్థానం ప్రారంభం కాగా మళ్ళీ ఎన్నికలు రాకముందే ఆ పార్టీకి దూరమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో రావెలకు కలిసొచ్చినంతగా ఎవరికీ రాలేదు. టీడీపీలో చేరీ చేరకమునుపే సీటు లభించింది. నియోజకవర్గం అంతటా కూడా పర్యటించకుండానే పార్టీకి ఉన్న ఇమేజ్‌తో విజయం వరించింది. ఎమ్మెల్యే అయి అవ్వక మునుపే కేబినెట్‌ మంత్రి పదవి లభించింది. ఈ పరిణామాలన్నీ శరవేగంగా జరిగిపోయాయి. దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం నేటి వరకు దక్కని వారు జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. నాలుగైదు సార్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన వరుస విజయాల నేతలకు కూడా అమాత్య పదవి అందని ద్రాక్షగానే ఉంది. అటువంటిది రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన రోజుల వ్యవధిలోనే సీటు దక్కటం, గెలవటం, అమాత్య పదవిని చేపట్టటం అనూహ్యంగా జరిగిపోయాయి. అంతే రీతిలో అమాత్య పదవికే కాక ఎమ్మెల్యే పదవికీ రావెల దూరమయ్యారు.

ప్రత్తిపాడు సీటా….లేక వేమూరా ..!
జనసేన పార్టీలోకి రావెల కిశోర్‌బాబు చేరటం ఖాయమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కల్పిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతానికి బే షరతుగా రావెలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ ఆయనకు ప్రత్తిపాడు లేదా వేమూరు టిక్కెట్‌ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అనుయాయులు ఆశిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నందున ప్రత్తిపాడు సీటే ఆయనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరగని అభివృద్ధి తన హయాంలో జరిగిందనే ధీమాతో ఉన్న రావెల ప్రత్తిపాడు నుంచే జనసేన తరుపున పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒక వేళ ప్రత్తిపాడు కాకుంటే మరో ఎస్సీ రిజర్వ్‌ నియోజకవర్గమైన వేమూరు సీటు ఆశిస్తున్నట్లు తెలిసింది.

పార్టీకి నష్టమేమీ లేదు…
ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌ బాబు ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసి పవన్‌కల్యాణ్‌ పంచన చేరుతుండంపై ప్రత్తిపాడులో పార్టీ వర్గాలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆయనకు మంచి గుర్తింపు ఇస్తే విశ్వాసం లేకుండా పార్టీని వదలి వెళ్లిపోతున్నారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. టీడీపీ మండల అధ్యక్షుడు గింజుపల్లి శివరామప్రసాద్‌ మాట్లాడుతూ రావెల పోవడం వల్ల పార్టీ బలం రెట్టింపు అవుతుందన్నారు. ఎంపీపీలు చెన్నుబోయిన శ్రీనివాసరావు, నక్కల శైలజ, ముద్దన నగరాజకుమారి, జీ శ్రీదేవి మాట్లాడుతూ రావెలను నమ్మి మంత్రి పదవి ఇచ్చిన పార్టీని అంటి పెట్టుకుని ఉండాలి కానీ ఈ విధంగా పార్టీ మారడం మంచి పద్ధతి కాదన్నారు. పార్టీని రావెల వీడినా ఆయనతో పాటు నాయకులు కాని, కార్యకర్తలు కాని ఎవరూ వెళ్లరబోరన్నారు. కాకుమాను, వట్టిచెరుకూరు మండల అధ్యక్షులు నువ్వుల సునీల్‌చౌదరి, మన్నవ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రావెల ఇప్పటి వరకు ప్రజా ప్రతినిధిగా వ్యవహరించలేదనీ, కేవలం ఒక ఆఫీసర్‌గానే వ్యవహరించారనీ పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments