తూర్పుగోదావరి జిల్లా తుని నూతన రాజకీయ శకానికి నాంది అవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం పవన్‌ కల్యాణ్‌ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో తుని చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లో పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్న హాకర్స్‌తో ఆయన మాట్లాడారు. రోజంతా కష్టపడినా కుటుంబ పోషణ భారమవుతోందని, ఉండటానికి సొంత ఇల్లు లేదని పలువురు పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి గొల్ల అప్పారావు సెంటర్లో సభ ప్రాంగణానికి చేరుకున్నారు.

ఆయన మాట్లాడుతూ తుని ప్రజలు యనమల రామకృష్ణుడుకు 30 ఏళ్ల పాటు పట్టం కట్టారని, ఆయన ఎన్నో కీలక పదవులు నిర్వహించారన్నారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పారిశ్రామికవాడను తీసుకు రాలేకపోయారన్నారు. ఇటువంటి నాయకులకు మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తారా అని అడిగినప్పుడు జనం లేదు.. లేదు అంటూ జవాబిచ్చారు. తుని ప్రజలు చూపించిన ప్రేమ ,ఆప్యాయత, ఆదరణ మరులేనన్నారు. నూతన తరం కోసం జనసేన పుట్టిందని, మీరందరూ ఆశీర్వదిస్తే సుపరిపాలన వస్తుందన్నారు. అధికార పార్టీ నాయకులు కొండలను పల్లీల మాదిరిగా తినేస్తున్నారన్నారు.

అధికారం ఉంది కదా అని కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.2019లో జరిగే ఎన్నికల్లో ఇటువంటి రాబందులు ఓటు అనే గాలివానలో కొట్టుకుపోతారన్నారు. తుని పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడా గరుదత్‌ప్రసాద్, గెడ్డం బుజ్జి, ముత్తా గోపాలకృష్ణ, శెట్టిబత్తుల రాజ బాబు, తుని నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చోడిశెట్టి గణేష్, బోడపాటి శివదత్‌ తదితరులు పాల్గొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments